పెద్దాపురం టీడీపీలో సామాజిక చిచ్చు

5 Mar, 2019 07:51 IST|Sakshi
ముత్యాల రాజబ్బాయి

తూర్పుగోదావరి, పెద్దాపురం: పెద్దాపురం తెలుగుదేశం పార్టీలో సామాజిక చిచ్చు రేగింది. అసెంబ్లీ టికెట్‌ కేటాయింపులో సిట్టింగ్‌ ఎమ్మెల్యే, మంత్రి చిన రాజప్పకు టికెట్‌ ఇచ్చేందుకు అభ్యంతరం లేదన్న మార్కెట్‌ కమిటీ చైర్మన్, సీనియర్‌ నాయకులు ముత్యాల రాజబ్బాయి కమ్మ  సామాజిక వర్గానికి చంద్రబాబు టికెట్‌ ఇవ్వదలచుకుంటే నేనూ పోటీలో ఉంటానంటూ సోమవారం బహిరంగంగా ప్రకటించారు. మాజీ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే బొడ్డు భాస్కర రామారావు రెండు రోజుల క్రితం అధిష్టానం కమ్మ సామాజిక వర్గానికి టికెట్‌ ఇవ్వాలని చూస్తోందని, ఆరో తేదీలోపు తనకు టికెట్‌ ప్రకటిస్తుందని ప్రచారం చేస్తుండడంతో అదే సామాజిక వర్గానికి చెందిన రాజబ్బాయి తాను కూడా ఈ దఫా పోటీలో ఉంటానంటూ ఆర్‌బీ పట్నంలో తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ప్రకటించారు.

దీంతో దాదాపు కమ్మ సామాజిక వర్గంలో కూడా చిచ్చురేగడంతో ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న బొడ్డుకు ఈ ప్రకటన చుక్కెదురైనట్టయ్యింది. 1982లో పార్టీ స్థాపించిన నాటి నుంచి టీడీపీలో కొనసాగుతున్న తనకు కమ్మ సామాజిక వర్గ నాయకుడే అడ్డుపడుతూ ఉన్నాడని రాజబ్బాయి అన్నారు. గత ఎన్నికల్లో టికెట్‌ ఆశించిన తనకు చంద్రబాబు ఈ దఫా చిన రాజప్ప గెలుపునకు కృషి చేస్తే ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చారన్నారు. ఇప్పటికీ ఆయన తనకు న్యాయం చేస్తాననడంతోనే సమన్వయ కమిటీ తరఫున తాను రాజప్పకు మద్దతు ఇచ్చానన్నారు. ఆయనకు కాకుండా కమ్మ సామాజిక వర్గం నుంచే పెద్దాపురం అసెంబ్లీ టికెట్‌ కేటాయిస్తే చంద్రబాబు తనకు  టికెట్‌ కేటాయిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. దీనిపై మరోమారు చంద్రబాబును కలుస్తానని రాజబ్బాయి ప్రకటించారు. సమావేశంలో గ్రామ నాయకులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు