కూటమిలో కుమ్ములాట.. మెదక్‌ టికెట్‌ దక్కించుకునేదెవరు..?

7 Nov, 2018 15:57 IST|Sakshi

  టికెట్‌ కోసం ఆశావహుల ముమ్మర యత్నం 

  కాంగ్రెస్‌ నేతల్లో పెరుగుతున్న టెన్షన్‌

  ఢిల్లీలో విజయశాంతి అధిష్టానం నేతలతో బేటి

 టీజేఎస్‌కు టికెట్‌ దక్కుతుందంటూ జోరుగా ప్రచారం

  రెండు రోజుల్లో ఉత్కంఠకు తెర!  

సాక్షి,మెదక్‌ : మహా కూటమి టికెట్ల పంపిణీ విషయం ఇంకా రెండు రోజుల్లో తేలనుంది. నియోజకవర్గంలో ఏ ఇద్దరు మాట్లాడుకున్నా.. ఇదే చర్చ. మెదక్‌ టికెట్‌ కాంగ్రెస్‌కు దక్కుతుందా? లేక టీజేఎస్‌కా?

ఒక వేళ కాంగ్రెస్‌కే  పోటీ చేసే అవకాశం వస్తే.. శశిధర్‌రెడ్డికి వస్తుందా? బట్టి జగపతికా? సుప్రభాతరావుకా? తిరుపతిరెడ్డికా? ఇలాంటి ప్రశ్నలతో.. ఆశావహులే కాకుండా నియోజకవర్గ ప్రజలు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఆశావహులు వాళ్ల గాడ్‌ ఫాదర్స్‌తో టికెట్‌ కోసం ఢిల్లీలో గట్టిగానే ప్రయాత్నాలు 
చేస్తున్నారు.    

కాంగ్రెస్‌ నేతల్లో టెన్షన్‌ పెరుగుతోంది. ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటనకు ఇంకా రెండు రోజులే మిగలి ఉంది. దీంతో టికెట్‌ ఎవరికి దక్కుతుందోనన్న ప్రశ్న కాంగ్రెస్‌ ఆశావహుల్లో ఉత్కంఠ రేపుతోంది. మరోవైపు మెదక్‌ నుంచి టీజేఎస్‌ పోటీ చేస్తుందంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో కాంగ్రెస్‌ ఆశావహులు, నేతల్లో మహాకూటమిలో భాగంగా ఎమ్మెల్యే టికెట్‌ ఎవరికి వరిస్తుందోనన్న ఆందోళన కాంగ్రెస్‌ శ్రేణుల్లో కనిపిస్తోంది. మెదక్‌ నుంచి కాంగ్రెస్‌ పార్టీనే బరిలో దింపాలని మొదటి నుంచి పట్టుబడుతున్న స్టార్‌ క్యాంపెయినర్, మాజీ ఎంపీ విజయశాంతి ఢిల్లీలో మకాం వేశారు. మెదక్‌ టికెట్‌ కోసమే విజయశాంతి ఢిల్లీ వెళ్లిందని ఆమె అనుచరులు చెబుతున్నారు.

విజయశాంతి మంగళవారం ఏఐసీసీ పెద్దలను కలిసి మెదక్‌ టికెట్‌మహాకూటమిలో టీజేఎస్‌కు ఇవ్వొద్దని గట్టిగా కోరినట్లు తెలుస్తోంది. దీనిపై అధిష్టానం సానుకూలంగా స్పందించిందని, దీంతో మెదక్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి బరిలో దిగడం ఖాయమని కాంగ్రెస్‌ ఆశావహులు ధీమాగా చెప్పుకుంటున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్‌ నుంచి టికెట్‌ ఆశిస్తున్న ఆశావహులంతా ఎమ్మెల్యే టికెట్‌ కోసం ఎవరికివారే చివరి ప్రయత్నాల్లో మునిగిపోయారు. మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి ఢిల్లీలోనే మకాం వేసి టికెట్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైపాల్‌రెడ్డి ద్వారా టికెట్‌ కోసం ఆయన  ప్రయత్నిస్తున్నారు.  ఈ రేసులో ఉన్న బట్టి జగపతి, సుప్రభాతరావు, తిరుపతిరెడ్డిలు  కూడా పట్టు విడువకుండా  ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. పీసీసీతోపాటు ఏఐసీసీలోని తమ గాడ్‌ఫాదర్‌ల ద్వారా టికెట్‌ను దక్కించుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. సోమవారం కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ ఎమ్మెల్యే అభ్యర్థులను ఖరారు చేసే పనిలో నిమగ్నమైంది. మహాకూటమిలో టీడీపీ, టీజేఎస్, సీపీఐలకు సీట్లు సర్దుబాటుపై చర్చలు జరుపుతూనే మరోవైపు కాంగ్రెస్‌ పోటీ చేసే స్థానాల్లో అభ్యర్థులను ఎంపిక చేస్తున్నట్లు తెలుస్తోంది. అన్ని కుదిరితే ఈనెల 9వ తేదీన ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించటం ఖాయమని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు.  


టీజేఎస్‌కు దక్కుతుందని..
మెదక్‌ ఎమ్మెల్యే టికెట్‌ మహాకూటమిలో భాగంగా టీజేఎస్‌కే దక్కుతుందని జోరుగా ప్రచారం సాగుతోంది. టీజేఎస్‌ నుంచి ఎమ్మెల్యే టికెట్‌ ఆశిస్తున్న జనార్దన్‌రెడ్డి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. మహాకూటమిలో భాగంగా టీజేఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం మెదక్‌ టికెట్‌ కోసం పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. తమ పార్టీ గెలుపొందే స్థా నాలను మాకు ఇవ్వాలని, మెదక్‌లో గెలిచే అవకాశం ఉందన్న టీజేఎస్‌కు టికెట్‌ ఇవ్వాలని ఆయ న కాంగ్రెస్‌ అధిష్టానంపై వత్తిడి తీసుకువస్తున్నట్లు సమాచారం. మహాకూటమిలో భాగంగా కాంగ్రెస్‌ మెదక్‌ టికెట్‌ వదులుకునేందుకు సిద్ధంగా ఉంద ని, మెదక్‌ నుంచి తామే పోటీ చేస్తామని టీజేఎస్‌ నాయకులు చెప్పుకుంటున్నారు. దీంతో మెదక్‌ టికెట్‌ కాంగ్రెస్‌ దక్కుతుందా? లేక టీజేఎస్‌కు దక్కుతుందా? అన్న ఉత్కంఠ కొనసాగుతోంది.  

మరిన్ని వార్తలు