సర్వేల ఆధారంగానే టికెట్లు

21 Sep, 2018 01:19 IST|Sakshi

టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: పార్టీ టికెట్‌కోసం దరఖాస్తు చేసుకున్న ఆశావహుల విషయంలో రెండుసార్లు సర్వే నిర్వహిస్తామని, ఆ సర్వే ఫలితాల ఆధారంగానే టికెట్ల కేటాయింపు ఉంటుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. గురువారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ కాంగ్రెస్‌ అభ్యర్థుల దరఖాస్తుల స్వీకరణ గడువు శుక్రవారంతో ముగుస్తుందని చెప్పారు.

టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల జాబితాను టీపీసీసీ ఎన్నికల కమిటీ పరిశీలిస్తుందని, సర్వే ఫలితాలను జతచేసి తుదిజాబితాను స్క్రీనింగ్‌ కమిటీకి పంపుతుందని ఆయన చెప్పారు. షెడ్యూల్‌కు 15 రోజుల ముందు అభ్యర్థులను ప్రకటించే ఆలోచన చేస్తున్నామని ఆయన చెప్పారు. మహాకూటమిలో సీట్ల సర్దుబాటుపై మరిన్ని చర్చలు జరగాల్సి ఉందని, తమ సిట్టింగ్‌ స్థానాలను కూటమిలోని ఇతర పార్టీలు కోరుతున్నట్టు తన దృష్టికి రాలేదని చెప్పారు.

కామన్‌ ఎజెండాపై కూటమిలో ఏకాభిప్రాయం వచ్చిందని చెప్పారు. ఎన్నికల షెడ్యూల్‌ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం కొంత గందరగోళంలో ఉన్నట్టు కనిపిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఓటరు లిస్టులో భారీగా తప్పులు ఉండటం, అక్రమంగా ఓట్లు తొలగించడమే ఇందుకు కారణమని ఆయన చెప్పారు.  

మరిన్ని వార్తలు