ఎన్నికల్లో ఓటమి: మాజీ సీఎం కీలక ప్రకటన

24 Mar, 2018 17:02 IST|Sakshi

సాక్షి, లక్నో: రాజ్యసభ ఎన్నికల ఫలితాలు ఎస్పీ-బీఎస్పీ మధ్య సంబంధాలపై ప్రభావం చూపించే ప్రసక్తే లేదని యూపీ మాజీ సీఎం, బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు. ఎస్పీ-బీఎస్పీల పొత్తు భవిష్యత్తులోనూ కొనసాగుతుందని కీలక ప్రకటన చేశారు. రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీకి ఓటేసిన తమ పార్టీ అభ్యర్థులపై మాయావతి గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీకి ఓటేసిన పార్టీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ సింగ్‌ను ఆమె సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. బీఎస్పీ అభ్యర్థికి మద్దతివ్వకుండా ఇతర పార్టీకి ఓటేశారన్న కారణంగా అనిల్ కుమార్‌పై వేటు పడే అవకాశం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. లక్నోలో మాయావతి మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌లు తమను ఒక్క ఇంచు కూడా కదిలించలేరన్నారు.  

ప్రజాస్వామ్యాన్ని బీజేపీ అపహాస్యం చేసిందనడానికి తాజా రాజ్యసభ ఓటింగే నిదర్శనంగా నిలిచిందన్నారు. ఎస్పీ-బీఎస్పీలు పరస్పర అవగాహనతో ఓటింగ్‌లో పాల్గొంటే.. సీటు కోల్పోతామన్న భయంతో బీజేపీ మా ఎమ్మెల్యేలను భయపెట్టిందని, ప్రలోభాలకు గురిచేసిందని మాయావతి ఆరోపించారు. ప్రజలు బీజేపీని నమ్మడం నిజమైతే గోరఖ్‌పూర్, ఫూల్‌పూర్ లోక్‌సభ స్థానాల్లో ఆ పార్టీ ఎందుకు ఓడిపోయిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలు ఎన్నుకున్న నేతలు ఆ పార్టీకి మద్దతు తెలపకపోవడం ప్రజాస్వామ్య విజయం ఎలా అవుతుందని బీజేపీ అధిష్టానాన్ని ఈ సందర్భంగా మాయావతి ప్రశ్నించారు.

మరోవైపు యూపీ రాజ్యసభ ఎన్నికల్లో 10 సీట్లకు 9 సీట్లు బీజేపీ కైవసం చేసుకోగా సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి ఒకరు నెగ్గారు. ఎస్పీ-బీఎస్పీ మద్దతిచ్చిన అభ్యర్థి మాత్రం ఓటమి పాలయ్యారు. బీజేపీ అభ్యర్థులు కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ, పార్టీ అధికార ప్రతినిధి జీవీఎల్‌ నరసింహారావు సహా 9 మంది విజయం సాధించగా ఎస్పీ తరపున జయాబచ్చన్‌ గెలుపొందిన విషయం తెలిసిందే. ఓ బీఎస్పీ, ఓ బీజేపీ ఎమ్మెల్యేల ఓట్లు చెల్లలేదు.

మరిన్ని వార్తలు