సార్వత్రిక ఎన్నికల వేళ ప్రత్యేక ఎడిషన్‌ని ప్రచురించనున్న టైమ్‌

10 May, 2019 16:03 IST|Sakshi

న్యూఢిల్లీ : దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు యావత్‌ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన ప్రముఖ వీక్లీ.. ‘టైమ్‌’ మ్యాగజైన్‌ భారత ఎన్నికలపై ప్రత్యేకంగా అంతర్జాతీయ ఎడిషన్‌ ప్రచురించింది. దాంతో పాటు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫొటోను కవర్‌ పేజీపై ముద్రించింది. అయితే కవర్‌ పేజీపై మోదీ ఫొటో పక్కనే ‘ఇండియాస్‌ డివైడర్‌ ఇన్‌ చీఫ్‌’ అని రాసిన హెడ్‌లైన్‌ ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. ఈ హెడ్‌లైన్‌ను ఉద్దేశిస్తూ.. ‘ఇక మీ నిజస్వరూపాన్ని అందరూ చూస్తారు’ అని  కాంగ్రెస్‌ మహిళా వింగ్‌ ట్వీట్‌ చేసింది. 

‘ఇండియాస్‌ డివైడర్‌ ఇన్‌ చీఫ్‌’ కథనాన్ని ఆతిష్‌ తసీర్ రచించారు. ‘ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో మరో ఐదేళ్లు మోదీ ప్రభుత్వం వస్తుందా?’ అనే పేరుతో తసీర్‌ కథనం ప్రచురితం కానుంది. దీనిలో ఈ ఐదేళ్ల కాలంలో బీజేపీ ప్రభుత్వంలో చోటు చేసుకున్న ముఖ్యమైన సంఘటనల గురించి ప్రస్తావించారు తసీర్‌. మూక దాడులు, యోగి ఆదిత్యనాథ్‌ను యూపీ సీఎంగా నియమించడం, సాధ్వి ప్రజ్ఞా సింగ్‌ను భోపాల్‌ నుంచి బరిలో దించడం వంటి అంశాలను ఈ కథనంలో చర్చించారు. వీటితో పాటు కాంగ్రెస్‌ పార్టీ గురించి కూడా చర్చించారు తసీర్‌. కాంగ్రెస్‌ వారసత్వ రాజకీయాలు మినహా ఇంకేమీ చేయట్లేదని ఆయన దుయ్యబట్టారు. తాజాగా రాహుల్‌గాంధీకి తోడుగా ఆయన సోదరి ప్రియాంక గాంధీ కూడా రాజకీయాల్లోకి వచ్చారన్నారు. కానీ పెద్దగా మార్పేం కనబడటంలేదని పేర్కొన్నారు.  ఇంతటి బలహీన ప్రతిపక్షం ఉండటం కూడా మోదీ ప్రభుత్వానికి బాగా కలిసి వస్తుందని తసీర్‌ పేర్కొన్నారు.

మోదీ చిత్రం టైమ్‌ మ్యాగజైన్‌ కవర్‌ ఫోటోగా రావడం ఇదే ప్రథమం కాదు. మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తైన సందర్భంగా టైమ్‌ మ్యాగజైన్‌ మోదీ కవర్‌ ఫోటోతో ప్రత్యేక ఎడిషన్‌ని ప్రచురించిన సంగతి తెలిసిందే.

>
మరిన్ని వార్తలు