కూటమిలో ‘ట్విస్ట్‌’

19 Nov, 2018 02:02 IST|Sakshi
బీ–ఫారాలు అందుకున్న అభ్యర్థులతో టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం

ఏడుగురికి బీ–ఫారాలు ఇచ్చిన టీజేఎస్‌

టీడీపీ ప్రకటించిన మహబూబ్‌నగర్‌లోనూ అందజేత

సాక్షి, హైదరాబాద్‌: కూటమిలో కొత్త ట్విస్ట్‌ మొదలైంది. సీట్ల సర్దుబాటు ఎంతకూ తెగకపోవడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో కూటమి పార్టీలు ముందుగా బీ–ఫారాలు ఇచ్చేస్తున్నాయి. నామినేషన్ల దాఖలుకు సోమవారం తుది గడువు కావడంతో ముందు బీ–ఫారం ఇవ్వడం ద్వారా అభ్యర్థికి వెసులుబాటు కల్పించాలని, నామినేషన్ల ఉపసంహరణ గడువులోపు తుది నిర్ణయం తీసుకోవచ్చనే అంచనాతో టీజేఎస్‌ ఆదివారం ఏడుగురు అభ్యర్థులకు బీ–ఫారాలు ఇచ్చింది. ఈ జాబితాలో సిద్దిపేట, మెదక్, దుబ్బాక, మల్కాజ్‌గిరి, మిర్యాలగూడ, వరంగల్‌ (ఈస్ట్‌), మహబూబ్‌నగర్‌ స్థానాలున్నాయి.

అయితే, టీజేఎస్‌ బీ–ఫారాలు ఇచ్చిన స్థానాల్లో నాలుగు చోట్ల ఇంకా సమస్యలు పరిష్కారం కాలేదు. మహబూబ్‌నగర్‌ నుంచి తెలుగుదేశం పార్టీ ఎర్ర శేఖర్‌ను ప్రకటించి బీ–ఫారం కూడా ఇచ్చింది. అలాగే మిర్యాలగూడ విషయం ఎటూ తేలలేదు. ఇక్కడ తన కుమారుడు రఘువీర్‌రెడ్డికి అవకాశం ఇవ్వాలని జానారెడ్డి పట్టుపడుతున్నారు. టీజేఎస్‌ నుంచి ఆయన బంధువు విజయేందర్‌రెడ్డి పోటీ పడుతున్నారు. దీనిపై ఏమీ తేలకుండానే టీజేఎస్‌ విద్యాధర్‌రెడ్డికి బీ–ఫారం ఇచ్చేసింది. ఇక వరంగల్‌–ఈస్ట్‌లో కూడా ఇదే పరిస్థితి.

ఈ స్థానాన్ని కాంగ్రెస్‌ ఆశిస్తుండగా అక్కడ గాదె ఇన్నయ్యకు టీజేఎస్‌ బీ–ఫారం ఇచ్చేసింది. దుబ్బాక స్థానాన్ని చిందం విజయ్‌కుమార్‌కు టీజేఎస్‌ కేటాయించగా, ఆయన్ను కాంగ్రెస్‌ పార్టీ అధిష్టాన దూతలు ఆదివారం పిలిపించారు. ఆయనతో పాటు దుబ్బాక టికెట్‌ను కాంగ్రెస్‌ తరఫున ఆశిస్తున్న మద్దుల నాగేశ్వర్‌రెడ్డిని కూడా పిలిపించి మాట్లాడారు. అక్కడ కాంగ్రెస్‌కు పోటీచేసే అవకాశం ఇవ్వాలని విజయ్‌ను కాంగ్రెస్‌ దూతలు కోరినట్టు సమాచారం. ఈ నాలుగు స్థానాల్లో ఏమీ తేలకుండానే టీజేఎస్‌ బీ–ఫారాలు ఇచ్చేయడం గమనార్హం.

ప్రకటించారు.. కానీ..
ఇక టీడీపీలో మరో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఇబ్రహీంపట్నం స్థానాన్ని సామ రంగారెడ్డికి ఆ పార్టీ ప్రకటించింది. అయితే, ఆదివారం ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో పార్టీ ఇప్పటివరకు ప్రకటించిన అభ్యర్థులందరికీ బీ–ఫారాలు ఇచ్చారు కానీ, రంగారెడ్డికి ఇవ్వలేదు.

అభ్యర్థులందరితో ప్రమాణం చేయించినప్పుడు రంగారెడ్డి కూడా ప్రమాణం చేశారు కానీ, బీ–ఫారం మాత్రం ఇవ్వకపోవడంతో సందిగ్ధత నెలకొంది. ప్రమాణం చేయించిన వ్యక్తికి బీ–ఫారం ఇవ్వలేదంటే ఆయన్ను అభ్యర్థిగా కొనసాగిస్తారా?.. కొనసాగిస్తే నియోజకవర్గాన్ని మారుస్తారా..? మారిస్తే ఎక్కడ అవకాశం ఇస్తారన్నది ఇప్పుడు టీడీపీ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.

టీజేఎస్‌కు 9 స్థానాలు
తెలంగాణ జన సమితి 9 స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధమైంది. కాంగ్రెస్‌ పార్టీ 8 స్థానాలను ఇచ్చేందుకు ఓకే చెప్పినా 6 స్థానాలకే క్లియరెన్స్‌ ఇచ్చింది. అయితే టీజేఎస్‌ తాము 9 స్థానాల్లో పోటీ చేసేలా ఏర్పాట్లు చేసుకుం టోంది. దీంతోపాటు అదనంగా మరో ఎస్టీ స్థానం ఇవ్వాలని కాంగ్రెస్‌ను కోరుతోంది. ఈ మేరకు ఆదివారం కాంగ్రెస్‌ రాష్ట్ర పరిశీలకుడు ఆర్‌సీ కుంతియాతో టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం సమావేశమై చర్చించారు.

ఆదివారం స్పష్టత వస్తుందని భావించినా ఎలాంటి సమాచారం రాలేదు. దీంతో టీజేఎస్‌ 7 స్థానాల్లో పోటీలో నిలుపనున్న అభ్యర్థులకు బీ–ఫారాలు అందజేసింది. మెదక్‌ నుంచి జనార్దన్‌రెడ్డి, సిద్దిపేట నుంచి భవానిరెడ్డి, దుబ్బాక నుంచి రాజ్‌కుమార్, మల్కాజిగిరి నుంచి దిలీప్‌కుమార్, వరం గల్‌ ఈస్ట్‌ నుంచి ఇన్నయ్య, మిర్యాల్‌గూడ నుంచి విద్యాధర్‌ రెడ్డి, మహబూబ్‌నగర్‌ నుంచి రాజేందర్‌ రెడ్డికి బీ–ఫారాలను అందజేశారు. వర్ధన్నపేట, అంబర్‌పేట్‌ నియోజకవర్గాలకు అభ్యర్థులను సోమవారం ఖరారు చేసి, బీ–ఫారాలను అందజేయాలని నిర్ణయించింది.

మరిన్ని వార్తలు