టీఆర్‌ఎస్‌.. ద్రోహులమయం

5 May, 2018 11:24 IST|Sakshi
మాట్లాడుతున్న గాదె ఇన్నయ్య

అమరవీరుల ఆత్మలు ఘోషిస్తున్నాయి

అందుకే రాజకీయ పార్టీగా టీజేఎస్‌ అవతరణ

ప్రజలకు పారదర్శక పాలనే లక్ష్యం

టీజేఎస్‌ రాష్ట్ర కార్యదర్శి గాదె ఇన్నయ్య

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌ : ఉద్యమ నేపథ్యంతో ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పుడు తెలంగాణ ద్రోహుల పార్టీగా మారిందని తెలంగాణ జన సమితి (టీజేఎస్‌) రాష్ట్ర కార్యదర్శి, ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ఇన్‌చార్జి గాదె ఇన్నయ్య అన్నారు. ఉద్యమాన్ని అడుగడుగునా అడ్డుకుని గూండాల్ల వ్యవహరించిన వాళ్లంతా టీఆర్‌ఎస్‌లో మంత్రులుగా కొనసాగుతున్నారని, చీమలపుట్టలో పాములు చేరిన చందంగా ఉందని విమర్శించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు తీర్చడం కోసం తెలంగాణ జన సమితి ఆవిర్భవించిందని పేర్కొన్నారు. కరీంనగర్‌ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గాదె ఇన్నయ్య మాట్లాడారు.

‘‘అంకుల్‌ తెలంగాణ వచ్చేది కాదు సచ్చేదికాదు మా నాన్నను డిస్టర్బ్‌ చేయకండి.. ఇంకెవరినన్న చూసుకోండి’ అంటూ 2001లో టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ సమయంలో ప్రస్తుత మంత్రి కేటీఆర్‌ తనకు ఫోను చేసి వేడుకున్నాడని, అలాంటి వ్యక్తి ఇప్పుడు మంత్రిగా కొనసాగుతున్నాడని అన్నారు. టీఆర్‌ఎస్‌ మొత్తం కుటుంబపాలన, తెలంగాణ ద్రోహుల మయమైందన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని అవహేళన చేసిన వాళ్లే ఎక్కువగా ఆ పార్టీలో ఉన్నారని గుర్తుచేశారు. టీఆర్‌ఎస్‌ పెట్టినప్పుడు కేసీఆర్‌ ’నాకెవరున్నారు.. నేను నా భార్యే.. నా పిల్లలు రాజకీయాల్లోకి రారు’ అన్నారని, ఇప్పుడు మొత్తం కుటుంబపాలనే అయ్యిందన్నారు.

ఉద్యమ ఆకాంక్ష పూర్తిచేసేందుకే టీజేఎస్‌ పుట్టిందని, అసమానతలు లేని, పరిపాలన మార్పు, మెజార్టీ ప్రజల అభివృద్ధి అనే మూడు లక్ష్యాలను సాధించేందుకు పాటుపడుతుందని స్పష్టం చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నుంచే తమ విజయ ప్రస్థానం మొదలవుతుందని జోస్యం చెప్పారు. తెలం గాణ జన సమితి తరఫున వార్డు అనుబంధ సభ్యులను ప్రకటిస్తామని, ఉద్యమంలో భాగస్వాములైన వారు, సామాజిక సేవ నేపథ్యం ఉన్నవారికి మాత్రమే అవకాశమిస్తామన్నారు. దివ్యాంగులకు, అనాథ యువతకు పంచాయతీ ఎన్నికల్లో ప్రాధాన్యం ఇస్తామన్నారు.

సమావేశంలో టీజేఎస్‌ కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల ఇన్‌చార్జిలు, నాయకులు ముక్కెర రాజు, జేవీ రాజు, జనగామ నర్సింగ్, కనకం కుమారస్వామి, స్రవంతి, ఎస్‌.గంగారెడ్డి, గడ్డం రవిందర్‌ రెడ్డి, డొంకెన రవిలతో పాటు పలువురు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు