ఆ వార్త అవాస్తవం: కోదండరాం

1 Jan, 2019 16:12 IST|Sakshi

హైదరాబాద్‌: లోక్‌సభకు తాను పోటీ చేసే విషయమై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని, కాంగ్రెస్‌ పార్టీ నుంచి రాజ్యసభకు వెళ్తున్నారన్న వార్త అవాస్తమని టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. హైదరాబాద్‌లో కోదండరాం విలేకరులతో మాట్లాడారు. కూటమి అజెండాను డోర్‌ టు డోర్‌ ప్రచారం చేయటంలో తాము పూర్తిగా విఫలమయ్యామని తెలిపారు. మంచి అజెండాను రూపొందించుకున్నా ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయామని చెప్పారు. ప్రచారాన్ని సమర్ధవంతంగా అమలు చేయలేకపోవటమే కూటమి ఓటమికి కారణమన్నారు. కేసీఆర్‌ ప్రచారాన్ని తట్టుకోవాలంటే ప్రచారానికి కనీసం 50 రోజులు కావాలని కూటమి నేతలకు తాను చెప్పినట్లు వెల్లడించారు. ప్రచారానికి మూడు వారాలు చాలని కాంగ్రెస్‌, టీడీపీ నాయకులు చెప్పారని అన్నారు.

మా హామీలు ప్రజలకు చేరవేయటంలో మేము విఫలమయ్యామని కోదండరాం అన్నారు. లోక్‌సభకు జరిగే ఎన్నికలు మరో విధంగా ఉంటాయని చెప్పారు. ఓటమి ద్వారా గుణపాఠం నేర్చుకోవటానికి తాము సిగ్గుపడటం లేదన్నారు.  ఓటమితో మాపై మేం విశ్వాసాన్ని కోల్పోలేదన్నారు. గ్రామ , మండలస్థాయి నుంచి తెలంగాణ జన సమితిని బలోపేతం చేయటానికి ప్రణాళికలు రచిస్తున్నామని తెలిపారు.  టీఆర్‌ఎస్‌కు, కూటమికి మధ్య ఓట్ల వ్యతాసం కేవలం 22 లక్షలేనని తెలిపారు. బీసీలకు కనీసం 25 శాతం పంచాయతీలను రిజర్వ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. రైతు రుణమాఫీ, గిట్టుబాటు ధర, నిరుద్యోగ సమస్య, జీఎస్టీ లాంటి అంశాలు జాతీయ రాజకీయాలను ప్రభావం చూపబోతున్నాయని వ్యాఖ్యానించారు. రాష్ట్రాల నిధుల అంశం కూడా జాతీయ స్థాయిలో కీలకం కానుందన్నారు.

చరిత్రలో రెండు సార్లు మాత్రమే ఫెడరల్‌ ఫ్రంట్‌ సాధ్యమైందని గుర్తు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఫెడరల్‌ ఫ్రంట్‌కు అవకాశం లేదని అన్నారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ ఎవరి కోసమో కేసీఆర్‌కే తెలియాలని వ్యాఖ్యానించారు. కూటమి ఓటమికి ఈవీఎంలే కారణమనేది సరైంది కాదన్నారు. కూటమి ఏర్పాటులోనే చాలా ఆలస్యం జరిగిందన్నారు. కేసీఆర్‌ ప్రచార శైలి మీకు తెలవదని కూటమి నేతలతో చెప్పినట్లు తెలియజేశారు. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పదిహేను రోజుల ప్రచారం చాలు అన్నారు..కానీ కేసీఆర్‌ వ్యూహాలు దగ్గరుండి చూశాను కాబట్టే 15 రోజులు చాలవని చెప్పినట్లు తెలిపారు.

కేసీఆర్‌, చంద్రబాబుకు మధ్య ఏం ప్రేమ ఉందో, రిటర్న్‌ గిఫ్ట్‌ ఏం ఇస్తారో చూడాలని చమత్కరించారు. కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ సక్సెస్‌ అవ్వదని, ఫెడరల్‌ ఫ్రంట్‌ రెండు కారణాల ద్వారా సక్సెస్‌ అయ్యే అవకాశముందన్నారు. ఒకటి దేశాన్ని ప్రభావితం చేసేలా ఒక రాష్ట్రం సమస్యలను లేవనెత్తాలి లేదా నాలుగైదు రాష్ట్రాలు కలిపి సమస్యలను లేవనెత్తాలని వ్యాఖ్యానించారు. కానీ కేసీఆర్‌ ఇంతవరకు ఆ ప్రధాన సమస్యను గుర్తించలేదన్నారు. కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ వెనక ఎవరున్నారో భవిష్యత్తులో తెలుస్తుందన్నారు.

మరిన్ని వార్తలు