‘ఆరు నెలల్లో మమత సర్కారు కూలుతుంది’

29 May, 2019 13:22 IST|Sakshi

బీజేపీ నేత రాహుల్‌ సిన్హా సంచలన వ్యాఖ్యలు

కోల్‌కత్తా: బెంగాల్‌లో మరో ఆరు నెలల్లో మమతా బెనర్జీ ప్రభుత్వం పడిపోతుందని బీజేపీ నేత రాహుల్‌ సిన్హా సంచలన వ్యాఖ్యలు చేశారు. తృణమూల్‌ కాంగ్రెస్‌పై పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు నమ్మకం లేదని మమత సర్కార్‌ కూలిపోవడం ఖాయమని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ.. ఆ తరువాత బెంగాల్‌లో పార్టీ ఫిరాయింపులకు తెరలేపిన విషయం తెలిసిందే. టీఎంసీ, సీపీఎంకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, 50 మంది కౌన్సిలర్లు బుధవారం బీజేపీ గూటికి చేరారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరమే చోటుచేసుకున్న ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో రాహుల్‌ సిన్హా వ్యాఖ్యలు ఆ రాష్ట్రంలో కలకలం రేపుతున్నాయి. కాగా బెంగాల్‌ అసెంబ్లీకి 2021 వరకు గడువున్న విషయం తెలిసిందే.

బుధవారం ఓ సమావేశంలో​ రాహుల్‌ సిన్హా మాట్లాడుతూ.. ‘‘ఆరు నెలలు లేదా ఏడాది లోపు మమత సర్కార్‌ పడిపోనుంది. ఆ పార్టీలో చాలామంది ఆమెపై అసంతృప్తితో ఉన్నారు. పోలీసులు, సీఐడీ బలంతో మమత ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. కేంద్రంపై కోపంతో టీఎంసీ నేతలు రాష్ట్రంలో అల్లర్లను ప్రేరేపిస్తున్నారు’’ అని అన్నారు. కాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా బెంగాల్‌లో పర్యటించిన మోదీ 40 మంది తృణమూల్‌ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి ఫిరాయింపులను ప్రోత్సహించే విధంగా మాట్లాడారని విమర్శలు వ్యక్తమయ్యాయి. కాగా ఇటీవల వెలువడిన సార్వత్రిక ఎన్నికల్లో ఫలితాల్లో 42 స్థానాలకు గాను బీజేపీ అనుహ్యంగా 18 స్థానాల్లో గెలుపొంది తృణమూల్‌కు పెద్ద ఎత్తున గండికొట్టిన తెలిసిందే. టీఎంసీ 22 సీట్లతో సరిపెట్టుకుంది. 


 

>
మరిన్ని వార్తలు