తృణమూల్‌ కాంగ్రెస్‌పై అమిత్‌ షా ఫైర్‌

4 Jul, 2018 12:02 IST|Sakshi
అమిత్‌ షా (ఫైల్‌ ఫోటో)

కోల్‌కత్తా : బెంగాల్‌లో మరో బీజేపీ కార్యకర్త అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ముర్షిదాబాద్‌కు సమీపంలో మంగళవారం ధోర్మ హజరా అనే బీజేపీ కార్యకర్త అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందారు. ఆదివారం నుంచి కనిపించకుండా పోయిన హజరా చెరువులో మృతదేహమై కనిపించాడు. హజరాను తృణమూల్‌ నేతలే హత్యచేశారని బీజేపీ ఆరోపిస్తోంది. బీజేపీ కార్యకర్తలు వరస హత్యలకు గురైతున్న నేపథ్యంలో అమిత్‌ షా అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌పై మండిపడ్డారు.

‘తృణమూల్‌ కాంగ్రెస్‌ మరోసారి మానవ జాతిని అవమానపరిచింది. అత్యంత అనాగరికంగా మరో బీజేపీ కార్యకర్తను హత్య చేసింది. బెంగాల్‌ మరోసారి హింసాత్మకంగా, క్రూరంగా మారింది. హజరాకు నా ప్రగాఢ సంతాపం తెలుపుతున్నా’ అని ట్వీట్‌ చేశారు. ఘటన జరిగిన వెంటనే బెంగాల్‌ బీజేపీ ప్రధాన కార్యదర్శి సాయంతన్‌ బసు, బీజేపీ నేత ముఖుల్‌ రాయ్‌ కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో ఢిల్లీలో భేటి అయ్యారు. ప్రత్యర్ధులను దెబ్బ తీసేందుకు టీఎంసీ హత్యా రాజకీయలు చేస్తోందని హోం మంత్రికి ఫిర్యాదు చేశారు.

బీజేపీ చేస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని టీఎంసీ జిల్లా పరిషత్‌ చైర్మన్‌ షహనాజ్‌ భేగం అన్నారు. బీజేపీ కార్యకర్త హత్యతో తమ పార్టీకి ఏలాంటి సంబంధం లేదని, అనవసరపు ఆరోపణలు చేస్తే పరవు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. కాగా ఇప్పటి వరకూ ఒక్కరిపై కూడా పోలీసులు కేసు నమోదు చేయలేదని బీజేపీ నేతలు తెలిపారు.

మరిన్ని వార్తలు