రెజ్లర్‌ ఖలీపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు

28 Apr, 2019 14:36 IST|Sakshi

కేంద్ర ఎన్నికల సంఘానికి తృణమూల్‌ కాంగ్రెస్ లేఖ

కోల్‌కతా : బీజేపీ అభ్యర్థి తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రెజ్లర్‌ ది గ్రేట్ ఖలీపై తృణమూల్‌ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. జాదవ్‌పూర్‌ భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థి అనుపమ్‌ హజ్రాకు మద్దతుగా ఖలీ ప్రచారంలో పాల్గొన్న విషయం తెలిసిందే. అమెరికా పౌరసత్వం కలిగిన ఖలీ ఎన్నికల్లో ఎలా పాల్గొంటారంటూ తృణమూల్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆదివారం ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. విదేశీ పౌరసత్వం ఉన్నవాళ్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదని పేర్కొంది. ఓ విదేశీయుడు భారత ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఇవ్వడం నిబంధనలకు విరుద్దమని... ఖలీ సెలెబ్రిటీ హోదాను బీజేపీ వాడుకుంటూ.... భారతీయ ఓటర్లను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తోందని తృణమూల్‌ కాంగ్రెస్‌ ఆరోపణలు చేసింది. 

అయితే కన్నయ్య కుమార్‌కు మద్దతుగా బంగ్లాదేశీ నటుడు పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తృణమూల్‌ ఫిర్యాదుపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఖలీ పంజాబ్‌ పోలీసు శాఖలో పని చేసిన విషయాన్ని గుర్తు చేసింది. కాగా 2019 ఎన్నికల్లో అధికారం కోసం తృణమూల్‌, బీజేపీలో హోరాహోరీగా తలపడుతున్నాయి. అయితే పశ్చిమ బెంగాల్‌లో మొత్తం ఏడు దశల్లో పోలింగ్‌ జరగనుంది. అందులో ఇప్పటికే మూడు దశల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లో నెలకొన్న హింసపై ఇరు పార్టీలు పరస్పరం వేలెత్తి చూపుకుంటున్నాయి.

మరిన్ని వార్తలు