మీలాగా కాళ్ల మీద పడి సీఎం కాలేదు..!

13 Nov, 2019 08:32 IST|Sakshi

రజనీకాంత్‌, కమల్‌పై సీఎం పళనిస్వామి విమర్శలు

సీఎం వ్యాఖ్యలపై మండిపడిన అభిమానులు

సాక్షి ప్రతినిధి, చెన్నై: వెండితెర నటులుగా ఉంటూ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించిన కమల్‌హాసన్, రజనీకాంత్‌ రాజకీయ అజ్ఞానులని ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి వ్యాఖ్యానించారు. గతంలో అగ్రనటులు శివాజీగణేశన్‌ పార్టీకి పట్టిన గతే వీరికి తప్పదని ఎద్దేవా చేశారు.  సేలం జిల్లా, నగర అన్నాడీఎంకే నిర్వాహకులతో ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి ఓమలూరులో మంగళవారం సమావేశమై పార్టీ స్థితిగతులను సమీక్షించారు. అనంతరం ఆయన పత్రికాప్రతినిధులతో మాట్లాడుతూ తమ పార్టీకి విజయావకాశాలు మెండుగా ఉన్నాయని గొప్పలు చెప్పుకొంటున్న మక్కల్‌ నీది మయ్యం అధ్యక్షుడు కమల్‌హాసన్‌ ఇటీవలి ఉపఎన్నికల్లో ఎందుకు పోటీచేయలేదని ఎడపాడి ప్రశ్నించారు.

‘కమల్‌ పెద్ద నాయకుడే కదా, గడిచిన లోక్‌సభ ఎన్నికల్లో ఆయన పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయి. పాపం ఆయనకు వయస్సు దాటిపోయి వృద్ధాప్య దశలోకి చేరుకోవడంతో సినిమా అవకాశాలు రాక రాజకీయ ప్రవేశం చేశారు. సినిమాలు విజయం సాధించక పోవడంతో కనీసం తమ పార్టీవారైనా చూస్తారనే ఆశతోనే కమల్‌హాసన్‌ మక్కల్‌ నీది మయ్యం స్థాపించాడు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీని స్థాపించవచ్చు. అది తప్పుకాదు. అయితే ఇతరులను దూషించడం తప్పు. ఇంతకాలం ఆయన ఎక్కడున్నారు. నేను 1974లో అన్నాడీఎంకేలో చేరి పార్టీ కోసం 45 ఏళ్లపాటు పాటుపడ్డాను. ప్రజల కోసం పోరాటాలు చేసి జైలుకెళ్లాను. ప్రజాభిమానంతో సీఎం దశకు చేరుకున్నాను. రజనీ, కమల్‌ వెండితెర నటులు, రాజకీయం తెలియదు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పంచాయతీల సంఖ్య కూడా తెలియదు. ప్రజల సమస్యలపై అవగాహన లేదు. శివాజీగణేశన్‌ సొంతపార్టీ పెట్టి ఎన్నికల సమయంలో ఏమైనారో అందరికీ తెలుసు’ అంటూ రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌లపై విమర్శలు గుప్పించారు.

కాళ్లపై పడి ఎవరైనా సీఎం అవుతారు..
శివాజీ గణేశన్‌ రాజకీయ జీవితంపై సీఎం పళనిసామి చేసిన వ్యాఖ్యలపై ఆయన అభిమాన సంఘం తీవ్ర స్థాయిలో మండిపడింది. ఇతరులు కాళ్ల మీద పడి ముఖ్యమంత్రి పదవి దక్కించుకున్న వ్యక్తికి.. ఆత్మాభిమానం గల మహోన్నత వ్యక్తి గురించి మాట్లాడే అర్హత లేదని విమర్శించింది. పళనిసామికి అధికారం మాత్రమే ఉందని.. పదవి పోయిన తర్వాత ఆయనను ఎవరూ గుర్తుపెట్టుకోరని.. అదే శివాజీ గణేశన్‌ మాత్రం తమిళ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని పేర్కొంది. ఒకప్పడు తమ అభిమాన నటుడి ప్రచారంతో అన్నాడీఎంకే గెలుపొందిన విషయాన్ని సీఎం మరిచిపోయినట్టు ఉన్నారంటూ ఎద్దేవా చేసింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. మరోవైపు కమల్‌, రజనీ అభిమానులు కూడా ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినీ నటులను తక్కువ చేసి మాట్లాడటం సీఎం స్థాయి వ్యక్తికి సరికాదని విమర్శలు గుప్పిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు