నేడు జెడ్పీచైర్మన్‌ ఎన్నిక

8 Jun, 2019 08:16 IST|Sakshi
జిల్లా పరిషత్‌లో ఎన్నిక ఏర్పాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్‌ దివ్యదేవరాజన్‌

ఆదిలాబాద్‌అర్బన్‌: జిల్లా ప్రజా పరిషత్‌ అధ్యక్షుడు (జెడ్పీచైర్మన్‌), ఉపాధ్యక్షుడు (వైస్‌చైర్మన్‌) పదవులకు శనివారం ఎన్నిక జరగనుంది. జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో ఉదయం 9 గంటల నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. కలెక్టర్‌ పర్యవేక్షణలో జరిగే ఈ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. కాగా, ముందుగా మైనార్టీ వర్గానికి చెందిన ఇద్దరిని కోఆప్షన్‌ సభ్యులుగా ఎన్నుకుంటారు. అనంతరం చైర్‌పర్సన్, వైస్‌చైర్మన్‌ ఎన్నిక చేపడుతారు. జెడ్పీ చైర్మన్, వైస్‌ చైర్మన్, కోఆప్షన్‌ సభ్యుల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జిల్లా పరిషత్‌ కార్యాలయం నుంచి వంద మీటర్ల వరకు 144 సెక్షన్‌ అమల్లో ఉండనుంది. పరిషత్‌ చుట్టూ పక్కల ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.
 
ఎన్నిక ప్రక్రియ ఇలా.. కోఆప్షన్‌ సభ్యుల ఎన్నిక   
ప్రక్రియలో భాగంగా శుక్రవారం నోటిఫికేషన్‌ విడుదల చేశారు. శనివారం ఉదయం 10 గంటల వరకు కోఆప్షన్‌ సభ్యుల పోటీకి నామినేషన్లు స్వీకరిస్తారు. మధ్యాహ్నం 12 గంటల వరకు నామినేషన్లను పరిశీలించి, ఒంటి గంట వరకు నామినేషన్‌ ఉపసంహరణకు అవకాశమిస్తారు. ఒకవేళ ఒక అభ్యర్థే పోటీపడితే వారినే ఎన్నికైనట్లుగా ప్రకటిస్తారు. పోటీ ఉంటే ఎన్నిక నిర్వహించి గెలుపొందిన వారిని ప్రకటిస్తారు. నూతనంగా ఎన్నికైన సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించాల్సి ఉంటుంది. తద్వారా మధ్యాహ్నం 3 గంటల సమయంలో చైర్మన్, వైస్‌చైర్మన్‌ ఎన్నిక చేపడుతారు. ఈ ప్రక్రియకు కొత్తగా ఎన్నికైన జెడ్పీటీసీలందరూ హాజరుకానున్నారు.

ఎవరికో చైర్మన్‌ గిరి..
జిల్లాలో 17 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ తొమ్మిది జెడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకోగా, బీజేపీ 5, కాంగ్రెస్‌ 5 చొప్పున జెడ్పీటీసీ స్థానాలు దక్కించుకున్నాయి. అయితే టీఆర్‌ఎస్‌ పార్టీ గెలిచిన స్థానాలు మేజిక్‌ ఫిగర్‌కు కరెక్ట్‌గా సరిపోవడంతో ఎవరిని జెడ్పీ అధ్యక్ష పీఠం ఎక్కిస్తారనేది ఉత్కంఠగా మారింది. ఏ ఒక్క సభ్యుడిని పట్టించుకోకున్నా.. ఇబ్బందులు తలెత్తే అవకాశాలుండడంతో అందరిని కలుపుకొని పోయే దిశగా ఆ పార్టీ అడుగులు వేసేందుకే ఇంత వరకు చైర్మన్‌ అభ్యర్థిని ప్రకటించలేదని పలువురు చర్చించుకుంటున్నారు. అయితే టీఆర్‌ఎస్‌ తరఫున నేరడిగొండ జెడ్పీటీసీగా గెలుపొందిన అనిల్‌ జాదవ్, నార్నూర్‌ జెడ్పీటీసీగా గెలుపొందిన రాథోడ్‌ జనార్దన్‌ల పేర్లు అధ్యక్ష పదవి రేసులో ప్రధానంగా వినిపిస్తుండగా.. భీంపూర్‌ జెడ్పీటీసీగా గెలుపొందిన సుధాకర్‌ పేరు కూడా పరిశీలనలోకి వస్తున్నట్లు సమాచారం. అయితే అనుభవం, సీనియార్టీని దృష్టిలో ఉంచుకొని అభ్యర్థి ఎంపిక చేపడితే నేరడిగొండ, నార్నూర్‌ జెడ్పీటీసీలుగా గెలుపొందిన వారిద్దరిలో ఎవరో ఒకరు చైర్మన్‌ కానున్నారు. 

మరిన్ని వార్తలు