నేడు బహిరంగసభ

21 May, 2018 08:58 IST|Sakshi

వేదిక : తాడేపల్లిగూడెం మార్కెట్‌ సెంటర్‌    

సమయం : సాయంత్రం 4 గంటలు

సాక్షి ప్రతినిధి, ఏలూరు: ప్రజాసంకల్పయాత్రలో భాగంగా తాడేపల్లిగూడెం బ్రహ్మానందరెడ్డి మార్కెట్‌ సెంటర్‌లో సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు బహిరంగ సభ జరగనుంది. వాస్తవానికి ఆదివారం ఈ సభ జరగాల్సి ఉంది. అయితే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ సలహా మండలి సభ్యులు డీఏ సోమయాజులు ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్‌లో కన్నుమూశారు. దీంతో వై.ఎస్‌.జగన్‌ తన పాదయాత్రను, బహిరంగసభను రద్దు చేసుకుని హుటాహుటిన ఆదివారం ఉదయం హైదరాబాద్‌ బయలుదేరి వెళ్లారు. వాస్తవానికి శనివారం రాత్రే సోమయాజులును పరామర్శించేందుకు వెళ్లాల్సి ఉండగా, ఆయన ఆరోగ్యం బాగుందన్న సమాచారం తెలియడంతో వై.ఎస్‌.జగన్‌ ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు.

ఈ తరుణంలో ఆదివారం తాడేపల్లిగూడెం పట్టణంలో ప్రజా సంకల్ప యాత్ర యథావిధిగా జరుగుతుందని పార్టీ శ్రేణులు భావించాయి. అయితేఅనుకోనివిధంగా ఆదివారం తెల్లవారుజాము∙3.50 గంటలకు సోమయాజులు మరణవార్త తెలియడంతో వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి వెనువెంటనే హైదరాబాద్‌ వెళ్లారు. మండలంలోని వెల్లమిల్లి స్టేజ్‌ వద్ద నుంచి జాతీయ రహదారి 16 మీదుగా గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి ఆయన హైదరాబాద్‌  వెళ్లారు. అక్కడ సోమయాజులు భౌతిక కాయాన్ని వై.ఎస్‌.జగన్‌ సందర్శించి నివాళులర్పించారు. ఆయన వెంట పార్టీ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే కారుమూరి వెంకటనాగేశ్వరరావు తదితరులు ఉన్నారు. ఇదిలా ఉండగా, డి.ఎ.సోమయాజులు మృతికి వైఎస్సార్‌ సీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ కన్వీనర్‌ కొట్టు సత్యనారాయణ సంతాపం తెలిపారు.

నేడు యథావిధిగా పాదయాత్ర
ఇదిలా ఉంటే సోమవారం ఉదయం 8 గంటలకు ప్రజాసంకల్ప పాదయాత్ర యథావిధిగా ప్రారంభం అవుతుంది. వెల్లమిల్లి స్టేజి, పెద తాడేపల్లి మీదుగా తాడేపల్లిగూడెం చేరుకుంటుంది. తాడేపల్లిగూడెంలో జరిగే సభలో వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగిస్తారని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

సభను జయప్రదం చేయండి : కొట్టు
తాడేపల్లిగూడెం మార్కెట్‌ సెంటర్‌లో సోమవారం సాయంత్రం జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని వైఎస్సార్‌ సీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ సమన్వయకర్త కొట్టు సత్యనారాయణ కోరారు.

మరిన్ని వార్తలు