నేడే ‘తొలి’ ఘట్టం

22 Apr, 2019 10:53 IST|Sakshi

మెదక్‌ రూరల్‌: స్థానిక సంగ్రామానికి అంతా సిద్ధమైంది. పరిషత్‌ ఎన్నికల్లో ‘తొలి’ ఘట్టం సోమవారం ప్రారంభం కానుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్‌ ప్రకారం సోమవారం నుంచి మొదటి విడత నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ షురూ కానుంది. జిల్లాలో 20 మండలాలు, 469 గ్రామ పంచాయతీలు ఉండగా, మొత్తం 4,84,995 మంది ఓటర్లు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 20 జెడ్పీటీసీ స్థానాలు, 189 ఎంపీటీసీ స్థానాలకు గాను, 1,032 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొదటి విడత 6 జెడ్పీటీసీ, 65 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం 339 పోలింగ్‌ కేంద్రాలను కేటాయించారు. మే 6న పోలింగ్‌ నిర్వహించనున్నారు. మే 27న ఫలితాలను వెల్లడించనున్నారు.

నోటిఫికేషన్‌ తర్వాత మూడు రోజుల పాటు నామినేషన్‌ సమర్పణకు గడువిచ్చారు. ఆన్‌లైన్‌ ద్వారా సైతం నామినేషన్లను దాఖలు చేసే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. కలెక్టర్‌ ధర్మారెడ్డి ఆధ్వర్యంలో డీపీఓ హనూక్, డిప్యూటీ సీఈఓ లక్ష్మీబాయి పర్యవేక్షణలో ఎన్నికల ఏర్పాట్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ఆయా మండలాల్లో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసింది. జెడ్పీటీసీ స్థానాలకు గతంలో జిల్లా కేంద్రంలోనే నామపత్రాలను స్వీకరించగా, ప్రస్తుతం మండల పరిషత్‌ కార్యాలయంలోనే తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో మండల కేంద్రాల వద్ద బారీకేడ్లు, కౌంటర్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ప్రతి మండల కేంద్రం వద్ద ము గ్గురు రిటర్నింగ్‌ అధికారులు, ముగ్గురు సహాయ రిటర్నింగ్‌ అధికారులను నియమించారు.

మరిన్ని వార్తలు