తెలంగాణ కాంగ్రెస్‌ బస్సు యాత్ర ఖరారు

17 Feb, 2018 22:10 IST|Sakshi
టీపీసీసీ నాయకులు (ఇన్‌సెట్‌లో కాంగ్రెస్‌ బస్సు యాత్ర -పాత ఫొటో)

సాక్షి, హైదరాబాద్‌ : టీఆర్‌ఎస్‌ సర్కారు వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లే క్రమంలో భారీ బస్సు యాత్రను చేపట్టాలని తెలంగాణ కాంగ్రెస్‌ కమిటీ నిర్ణయించింది. ఫిబ్రవరి 26 నుంచి తొలి విడత యాత్రను ప్రారంభించనున్నట్లు టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి తెలిపారు. శనివారం గాంధీభవన్‌లో జరిగిన కీలక భేటీలో ఈ మేరకు తీసుకున్న నిర్ణయాలపై ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

చేవెళ్ల నుంచి షురూ.. : మహానేత వైఎస్సార్‌ చరిత్రాత్మక పాదయాత్రను మొదలుపెట్టిన చేవెళ్ల నుంచే తాజా బస్సు యాత్ర కూడా ప్రారంభంకానుండటం గమనార్హం. ఈ నెల 26న మధ్యాహ్నం 1 గంటకు చేవెళ్ల నుంచి యాత్ర మొదలవుతుందని, హోలీ పండుగ విరామం అనంతరం ఏప్రిల్‌ 1 నుంచిమే 15 వరకు రెండో విడత యాత్ర ఉంటుందని, మొత్తం 119 నియోజకవర్గాలను కవర్‌ చేస్తామని ఉత్తమ్‌ పేర్కొన్నారు.

యాత్రలే యాత్రలు : రెండో విడత బస్సు యాత్ర ముగిసే మే 15 నుంచి వివిధ ప్రాంతాల్లో ఆయా నాయకుల ఆధ్వర్యంలో మళ్లీ యాత్రలు జరుగనున్నాయి. టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ భట్టీ విక్రమార్క, ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌లు తమ తమ ప్రాంతాల నుంచి పాదయాత్రలు ప్రారంభిస్తారు. మాజీ ఎంపీ వి.హనుమంతరావు రథయాత్ర చేపట్టనున్నారు. జూన్‌ 1న హైదరాబాద్‌ లేదా వరంగల్‌లో భారీ బహిరంగ సభను నిర్వహించాలని నాయకులు తీర్మానించారు. శనివారం గాంధీభవన్‌లో జరిగిన భేటీలో టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్, ఎల్‌వోపీ జానారెడ్డి, పొన్నం, షబ్బీర్ అలీ ఇతర కీలక నేతలు పాల్గొన్నారు.

whatsapp channel

మరిన్ని వార్తలు