పేలవంగా రాష్ట్రపతి ప్రసంగం: ఉత్తమ్‌

20 Jun, 2019 16:37 IST|Sakshi
టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి(పాత చిత్రం)

ఢిల్లీ: భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రసంగం చాలా పేలవంగా ఉందని, చాలా సమస్యలపై స్పష్టత లేదని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి విమర్శించారు. ఢిల్లీలో ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ..దేశంలో నిరుద్యోగ సమస్య గురించి,  రైతుల సమస్య గురించి రాష్ట్రపతి మాట్లాడలేదని అన్నారు. రాష్ట్రపతి ప్రసంగం మొత్తం బీజేపీ ప్రభుత్వాన్ని పొగడటానికే సరిపోయిందని చెప్పారు. 2014 కంటే ముందు ప్రభుత్వాలు అస్థిరమైన ప్రభుత్వాలని రాష్ట్రపతితో అనిపించడం బాధాకరమన్నారు. యూపీఏ-1, యూపీఏ-2 ప్రభుత్వాలు కచ్చితంగా స్థిరమైన ప్రభుత్వాలని అన్నారు.

యూపీఏ ప్రభుత్వ పాలనలో దేశ ప్రజలకు అద్భుతమైన, స్వచ్ఛమైన పాలనను అందించాయని చెప్పారు. ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ హయాంలో దేశం ఆర్ధికాభివృద్ధి చెందింది.. దాని కోసం అనేక సంస్కరణలు తీసుకువచ్చారని వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి ప్రసంగంలో మాత్రం 2014 తర్వాతనే దేశం అభివృద్ధి చెందుతోందని చెప్పడం విడ్డూరమన్నారు. రాష్ట్రపతి ప్రసంగంలో మహిళా రిజర్వేషన్‌ ప్రస్తావనే లేదని అన్నారు. ప్రతిసంవత్సరం దేశంలో లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు.. దాని నివారణ చర్యల గురించి పట్టించుకోలేదని తెలిపారు.  

‘విదేశాల్లో దాగి ఉన్న నల్లధనం గురించి రాష్ట్రపతి ప్రసంగంలో మాట్లాడలేదు. బిహార్‌లో 110 మంది చిన్నపిల్లలు చనిపోతే దాని గురించి ప్రసంగంలో లేదు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని, స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులను అమలు చేస్తామన్న బీజేపీ దానిని ఏవిధంగా అమలు చేస్తారో చెప్పలేదు. రాష్ట్రపతి ప్రసంగంలో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగింది. విభజన చట్టంలో తెలంగాణాకు రావాల్సిన అంశాలపై ప్రసంగంలో ప్రవేశపెట్టలేదు. ఈ ఐదు సంవత్సరాలు కూడా తెలంగాణాకి మొండి చెయ్యే అని స్పష్టంగా తెలుస్తుంద’ని ఉత్తమ్‌ వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు