మాజీ ఎంపీ వివేక్‌తో ఉత్తమ్‌ మంతనాలు

29 Jul, 2019 08:56 IST|Sakshi

పార్టీలోకి రావాలని ఆహ్వానం! 

సాక్షి, హైదరాబాద్‌: మాజీ ఎంపీ వివేక్‌తో టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భేటీ అయ్యారు. ఆదివారం రాత్రి వివేక్‌ నివాసానికి వెళ్లిన ఆయన గంటపాటు ఆయనతో మంతనాలు జరిపారు. టీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం వివేక్‌ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. ముఖ్యంగా సచివాలయం, అసెంబ్లీ భవనాల కూల్చివేతలకు వ్యతిరేకంగా ఇటీవల అఖిలపక్షాలతో కలసి సమావేశాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. వివేక్‌ ఇటీవలే న్యూఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాతో సమావేశమయ్యారు. కేసీఆర్‌ ప్రభుత్వ తీరుపై ఆయనకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగానే ఆయన బీజేపీలో చేరడం ఖాయమని, అమిత్‌షా రాష్ట్ర పర్యటన సందర్భంగా ఆయన చేరిక ఉంటుందని అంతా భావించారు. ఈ తరుణంలో ఆయనతో ఉత్తమ్‌ చర్చలు జరపడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన్ను తిరిగి కాంగ్రెస్‌ పార్టీలోకి ఆహ్వానించారని తెలుస్తోంది. అయితే వివేక్‌ తిరిగి సొంత గూటికి చేరతారా? లేక బీజేపీలో చేరతారా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

మరిన్ని వార్తలు