గవర్నర్‌కు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి లేఖ!

27 Sep, 2019 20:18 IST|Sakshi

సాక్షి, సూర్యాపేట :  శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డిని అనర్హులుగా ప్రకటించాలని నల్గొండ ఎంపీ, టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను కోరారు. సూర్యాపేటలోని హుజుర్‌నగర్‌ క్యాంపు కార్యాలయం నుంచి ఆయన గవర్నర్‌కు లేఖ రాశారు. మండలి చైర్మన్‌గా ఉన్న సుఖేందర్‌ రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పాలకీడు నియోజకవర్గం జడ్పీటీసీ మోతిలాల్‌తో పాటు సర్పంచ్‌ జితేందర్‌రెడ్డిలకు లక్షల రూపాయలు ఆశ చూపి  గుత్తా వారిని టీఆర్‌ఎస్‌ పార్టీలో చేర్పించారని అన్నారు. అలాగే కాంగ్రెస్‌ పార్టీ నుంచి చేర్చుకున్న వారిని.. టీఆర్‌ఎస్‌ మంత్రులైన మల్లారెడ్డి, జగదీష్‌రెడ్డిల ఇళ్లలో ఉంచారని, కాంగ్రెస్‌ ఎంపీగా గెలిచిన గుత్తా 2015లో టీఆర్‌ఎస్‌లో చేరినందుకు భారీ ఎత్తున ప్యాకేజీ తీసుకున్నారని పేర్కొన్నారు. పదవుల్లో ఉన్న గుత్తా, ఆయన కుమారుడు అమిత్‌రెడ్డి కాళేశ్వరం, పాలమూరు, రంగారెడ్డి ఇరిగేషన్‌ ప్రాజెక్టులలో వేల కోట్ల కాంట్రాక్ట్‌ పనులు చేస్తున్నారని అన్నారు. హుజుర్‌నగర్‌ ఉప ఎన్నికలలో టీఆర్‌ఎస్‌ను గెలిపించేందుకు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని.. ఈ విషయంపై కేంద్ర ఇంటెలిజెన్స్‌ బృందంతో విచారణ చేపట్టాలని గవర్నర్‌ను ఉత్తమ్‌ కోరారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు