‘షోకాజ్‌’ సుఖాంతమేనా?

26 Sep, 2018 03:57 IST|Sakshi

రాజగోపాల్‌రెడ్డి వ్యవహారంపై టీపీసీసీ తర్జనభర్జన

జానా, షబ్బీర్‌ అభిప్రాయాలు కోరిన క్రమశిక్షణ కమిటీ?

ఎన్నికల వేళ కఠిన నిర్ణయాలతో పార్టీకి నష్టమంటున్న సీనియర్లు

మెత్తబడ్డ కుంతియా! హెచ్చరికలతో సరిపెడతారనే చర్చ

సాక్షి, హైదరాబాద్‌: ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యవహారంపై కాంగ్రెస్‌ పార్టీలో ఉత్కంఠ నెలకొంది. షోకాజ్‌ నోటీసుకు సరైన సమాధానం ఇవ్వాలంటూ 24 గంటల గడువుతో క్రమశిక్షణ కమిటీ ఆయనకు మరో నోటీసు ఇవ్వడం, గడువు కూడా ముగియడంతో ఏం నిర్ణయం తీసుకుంటారోననే చర్చ పార్టీ నేతల్లో కొనసాగుతోంది. అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం రాజగోపాల్‌రెడ్డి వ్యవహారం సుఖాంతమయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ఈ విషయంలో క్రమశిక్షణ కమిటీ గట్టిగానే ఉన్నా... ఎన్నికల ముందు కఠిన నిర్ణయాలు తీసుకోవడం పార్టీకి నష్టం చేస్తుందనే సీనియర్ల అభిప్రాయం మేరకు అనూహ్య నిర్ణయం తీసుకుంటే తప్ప రాజగోపాల్‌రెడ్డిని హెచ్చరికలతో సరిపెడతారనే చర్చ గాంధీ భవన్‌ వర్గాల్లో జరుగుతోంది. నోటీసు కాలపరిమితి మంగళవారం సాయంత్రంతో ముగియడంతో బుధవారం టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ మరోసారి సమావేశమై దీనిపై తుది నిర్ణయం తీసుకోనుంది.

మీరేమంటారు..?
రాజగోపాల్‌రెడ్డి వ్యవహారం క్రమశిక్షణ కమిటీ వద్దకు చేరినప్పటి నుంచీ పార్టీలో పెద్ద ఎత్తున తర్జనభర్జనలు జరుగుతున్నాయి. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు..? ఒకవేళ రాజగోపాల్‌రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని నిర్ణయం తీసుకుంటే పరిస్థితి ఏమిటి? సీనియర్లు ఏమంటారు? ఎమ్మెల్సీగా ఉండి రాష్ట్రవ్యాప్తంగా కోమటిరెడ్డి బ్రదర్స్‌ పేరుతో సుపరిచితమైన నాయకుడిపై చర్యలు తీసుకుంటే కేడర్‌ నుంచి ఎలాంటి స్పందన వస్తుంది అనే దానిపై పార్టీలో పెద్ద చర్చే జరుగుతోంది.

అయితే పార్టీకి నష్టం కలిగించేలా మాట్లాడవద్దని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ చెప్పాక కూడా రాజగోపాల్‌రెడ్డి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియా, పార్టీ ఎన్నికల కమిటీలపై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో క్రమశిక్షణ కమిటీ కూడా దీనిపై తీవ్రంగానే స్పందించింది. ఆయనకు షోకాజ్‌ నోటీసు ఇచ్చి సమాధానమిచ్చేందుకు 48 గంటల గడువిచ్చింది. రాజగోపాల్‌ 3 పేజీల వివరణ పంపగా ఆయన సమాధానంపై సంతృప్తి చెందని కమిటీ... మళ్లీ 24 గంటల గడువిస్తూ మరో నోటీసు ఇవ్వడంతో వాతావరణం వేడెక్కింది.

ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్సీగా ఉన్న నాయకుడిపై చర్యలు తీసుకునే ముందు పార్టీ శాసనసభాపక్ష నేత జానారెడ్డి, మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్‌ అలీ అభిప్రాయాన్ని కమిటీ కోరినట్లు తెలుస్తోంది. దీనికితోడు పార్టీ సీనియర్‌ నేత, ఏఐసీసీ అధికార ప్రతినిధి జైపాల్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి సోదరుడు వెంకట్‌రెడ్డి కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోవడంతో పరిస్థితి చేయిదాటిపోదనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.


ఎన్నికల ముందు ఎందుకు?
రాజగోపాల్‌రెడ్డి వ్యవహారంపై టీపీసీసీలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పార్టీ రాజ్యాంగ నిబంధనల ప్రకారం వెళ్లాల్సిందేనని క్రమశిక్షణ కమిటీ అంటుంటే సీనియర్లు మాత్రం రాజగోపాల్‌ను దూరం చేసుకోవడం సరికాదని, ఎన్నికల వేళ ఎలాంటి కఠిన నిర్ణయం తీసుకున్నా పార్టీకి నష్టం జరుగుతుందని అంటున్నారు.

దీనికితోడు అంతర్గతంగా జరిగిన కొన్ని పరిణామాల నేపథ్యంలో కుంతియా కూడా ఈ విషయంలో మెత్తబడ్డట్టు తెలుస్తోంది. జానా, షబ్బీర్, జైపాల్, వెంకట్‌రెడ్డి జోక్యం కూడా సమస్యను పరిష్కరించే విధంగానే ఉందని, జానా, షబ్బీర్‌ క్రమశిక్షణ కమిటీకి తెలిపిన అభిప్రాయం ప్రకారం ఎలాంటి చర్యలూ ఉండబోవని తెలుస్తోంది. ఇలాంటి వ్యాఖ్యలు, ఘటనలు పునరావృతం కావొద్దని రాజగోపాల్‌ను హెచ్చరిస్తూ సరిపెడతారని సమాచారం.

మరిన్ని వార్తలు