‘కేసీఆర్‌ కుటుంబం అక్రమాస్తుల్ని బయటపెడతాం’

1 Dec, 2018 16:48 IST|Sakshi

సాక్షి, నిజామాబాద్‌ : ప్రజాకూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కేసీఆర్‌ కుటుంబం అక్రమాస్తులను బయటపెడతామని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మధుయాష్కి గౌడ్‌ అన్నారు. బినామీ కంపెనీలతో కేసీఆర్‌ కుటంబ సభ్యులు కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. మధుయాష్కి శనివారం మీడియాతో మాట్లాడారు. కేసీఆర్‌ ఉరఫ్‌ దుబాయ్‌ శేఖర్‌కు నకిలీ పాస్‌పోర్టు, దొంగనోట్ల స్కామ్‌ల చరిత్ర ఉందని వ్యాఖ్యానించారు. 2009లో కేటీఆర్‌కు కోటిన్నర ఆస్తి ఉండగా.. ఆ మొత్తం 2014లో ఏడుకోట్ల తొంభై లక్షలకు, 2018లో 41 కోట్ల రూపాయలకు ఎలా పెరిగిందని ప్రశ్నించారు. వెంకయ్యనాయుడు కొడుకు హర్షవర్ధన్‌ నాయుడు, సత్యం రామలింగరాజు కొడుకు తేజారాజులు కేటీఆర్‌ వ్యాపార భాగస్వాములుగా ఉన్నారని తెలిపారు. రూ.1500 కోట్ల కాంట్రాక్టును కేటీఆర్‌  తేజారాజు కంపెనీకి దోచిపెట్టారని ఆరోపించారు. ‘కాల్‌ హెల్త్‌’ కేటీఆర్‌ బినామీ కంపెనీ అనీ, ఆ కంపెనీకి తేజారాజు భర్య చీఫ్‌గా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఎంపీ కల్వకుంట్ల కవిత బెంగుళూరులోని డాలర్స్‌ కాలనీలో నిర్మించిన  బంగ్లా వివరాలు రేపు బయటపెడతామని మధుయాష్కి పేర్కొన్నారు.

వ్యాట్‌ ఎత్తేయాలి కదా..!!
రాష్ట్ర ప్రజల్ని ఉద్ధరిస్తానని చెప్పుకుంటున్న కేసీఆర్‌ తెలంగాణలో డీజిల్‌, పెట్రోల్‌పై వ్యాట్‌ను ఎందుకు ఎత్తేయడం లేదని కేంద్రమంత్రి జితిన్‌ ప్రసాద్‌ ప్రశ్నించారు. పక్కనున్న కర్ణాటక ప్రభుత్వం వ్యాట్‌ తగ్గించిందని గుర్తు చేశారు. నరేంద్ర మోదీతో టీఆర్‌ఎస్‌ కుమ్మక్కైందని మండిపడ్డారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గిస్తామని అన్నారు. 

మరిన్ని వార్తలు