ముందస్తుపై ‘సుప్రీం’కు..

18 Sep, 2018 04:03 IST|Sakshi

పిటిషన్‌ దాఖలుకు సిద్ధమవుతున్న టీపీసీసీ

ఓటర్ల జాబితాలో అవకతవకలే కారణం

30 లక్షల ఓట్లు తీసేశారని కాంగ్రెస్‌ ఆరోపణ

పాత షెడ్యూల్‌ ప్రకారం ఓటర్ల జాబితా సవరించాలి

ఆ తర్వాతే ఎన్నికలు జరపాలని డిమాండ్‌

ఇప్పటికే పలుమార్లు ఈసీతో సంప్రదింపులు

19 లేదా 20న పిటిషన్‌ దాఖలుకు మర్రి కసరత్తు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో జరుగనున్న ముందస్తు ఎన్నికలపై సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు కాం గ్రెస్‌ పార్టీ సిద్ధమవుతోంది. ఓటర్ల జాబితా తప్పుల తడకగా ఉందని, అలాంటి జాబితాతో ఎన్నికలకు వెళ్లడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే అవుతుందని పేర్కొంటోంది. ఓటర్ల జాబితాలోని తప్పులన్నీ సవరించి, కొత్త ఓటర్లందరినీ చేర్పించిన తర్వాతే ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేయాలని కోరుతోంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేస్తూ 19 లేదా 20న సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. దీనికోసం మాజీ మంత్రి, టీపీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్‌ మర్రి శశిధర్‌రెడ్డి మూడు రోజులుగా ఢిల్లీలోనే మకాం వేశారు. అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు, సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయవాది అభిషేక్‌ సింఘ్వీతో పాటు హైకోర్టు న్యాయవాది జంధ్యాల రవిశంకర్‌తో కలసి దీనిపై కసరత్తు చేస్తున్నారు.  

పిటిషన్‌ ఎందుకు?
సుప్రీంకోర్టులో ముందస్తు ఎన్నికలపై పిటిషన్‌ దాఖలు చేసేందుకు ఓటర్ల జాబితాలో అవకతవకలే కారణమని టీపీసీసీ నేతలు చెపుతున్నారు. 2014, ఓటర్ల జాబితా ప్రకారం.. రాష్ట్రంలో 2.81 కోట్లకు పైగా ఓటర్లు ఉండగా.. 2018, ముసాయిదా జాబితాలో 2.61 కోట్లే ఉన్నారని, దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నాలుగేళ్లలో ఓటర్ల సంఖ్య పెరగాల్సింది పోయి తగ్గడమేంటని వారు ప్రశ్నిస్తున్నారు. 2017, ఓటర్ల జాబితాతో పోలిస్తే 30 లక్షల ఓట్లు తగ్గాయని, గత 8 నెలల్లో 9 లక్షల ఓట్లు తొలగించి లక్ష ఓట్లను కొత్తగా చేర్చారని చెపుతున్నారు. మొత్తం మీద ప్రస్తుత ఓటర్ల జాబితాలోని 68 లక్షల మంది ఓటర్ల పేర్లపై సందేహాలు, గందరగోళం ఉందని, ఇదే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్తామని అంటున్నారు.

25 శాతం జాబితా తప్పులతడకగా ఉందని, వీటిని సరిచేసేందుకు గతంలో ఎన్నికల సంఘం ఇచ్చిన షెడ్యూల్‌ మేరకు.. 2019, జనవరి 4వ తేదీ అయినా సమయమే సరిపోదని వారంటున్నారు. నాలుగు నెలల్లో చేయలేని పనిని నాలుగు వారాల్లో పూర్తి చేయాలని షెడ్యూల్‌ కుదించారని, అసాధ్యమైన ఈ పనిని ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు. 30 లక్షల డబుల్‌ ఓటర్లు ప్రస్తుత జాబితాలో ఉన్నారని, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్‌ల్లో ఓటర్లుగా ఉన్నవారు 18–19 లక్షల మంది ఉన్నారని, ఇలాంటివేవీ సరి చేయకుండా ఎన్నికలకు ఎలా వెళ్తారని, ఈ విషయాలన్నింటినీ కోర్టు దృష్టికి తీసుకెళ్తామని అంటున్నారు. ఇప్పటికే 20వేలకు పైగా డబుల్‌ ఓటర్ల పేర్లను సా«క్ష్యాలుగా సేకరించామని, వీటిని కోర్టు ముందుంచుతామని పేర్కొంటున్నారు. 4 నెలల షెడ్యూల్‌ ప్రకారం ఓటర్ల జాబితాను సవరించాలని, అదీ సాధ్యం కాకపోతే మళ్లీ సమీక్ష జరిపి, గడువు పెంచాలని కోరనున్నారు. ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసిన తర్వాతే ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసేలా ఎన్నికల సంఘానికి ఆదేశాలు ఇవ్వాలని తమ పిటిషన్‌లో విజ్ఞప్తి చేయనున్నట్లు టీపీసీసీ నేతలు వివరిస్తున్నారు.  

చరిత్ర ఇదిగో...
పిటిషన్‌తో పాటు రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యవహారశైలిని తెలియజేసే ఆధారాలను కోర్టు ముందుంచేలా శశిధర్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారు. 2016లో జరిగిన గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలకు సంబంధించి కేసీఆర్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే అభియోగాలకు సంబంధించిన ఆధారాలనూ సేకరిస్తున్నారు. అందులో భాగంగా 2015, జూలై 21న అప్పటి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ సోమేశ్‌కుమార్‌లను సీఎం తన కార్యాలయానికి పిలిపించుకుని జీహెచ్‌ఎంసీ పరిధిలోని 15 లక్షల మంది పేర్లను తొలగించారని ఆదేశాలిచ్చారని కోర్టుకు తెలపనున్నారు. దీనికోసం 2014, ఆగస్టు 19న నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేను ఉపయోగించుకున్నారని, అందుకే ఈ సర్వే వివరాలను ప్రజల ముందు పెట్టలేదనే విషయాన్ని కోర్టు తెలియజేస్తామని వెల్లడిస్తున్నారు.  

టీఆర్‌ఎస్‌ గెలిచింది మూడు స్థానాలే...
ఈ విషయమై శశిధర్‌రెడ్డి ‘సాక్షి’తో మాట్లాడుతూ.. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలోని 24 అసెంబ్లీ స్థానాల్లో టీఆర్‌ఎస్‌కు కేవలం 3 స్థానాలే వచ్చాయని, అప్పటి నుంచి కొందరు ఓటర్లను టార్గెట్‌ చేసి తొలగించారని ఆరోపించారు. స్థానికంగా నివాసం ఉంటున్నప్పటికీ కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా ఓట్లను తొలగించారని, ప్రభుత్వ కార్యాలయాల్లో మూలన పడి ఉన్న వేల నోటీసులను అప్పుడే సేకరించి కేంద్ర ఎన్నికల సంఘానికి తాను ఫిర్యాదు చేశానని చెప్పారు. దీంతో పాటు ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌ మండలం దంతానపల్లి గ్రామంలో 2014 జాబితా ప్రకారం 2,701 ఓట్లు ఉండగా, మూడేళ్లలో 742 ఓట్లను అకారణంగా తొలగించి అక్కడ ఉప ఎన్నిక నిర్వహించిన విషయాన్ని కూడా ఈసీ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. ఈ రెండు అంశాలను కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లినప్పుడు ఇప్పుడు సీఈసీ చైర్మన్‌గా ఉన్న రావత్‌ అప్పుడు సభ్యుడిగా ఉన్నారని అన్నారు. ఇప్పుడు ఇవే అంశాలను సుప్రీంకోర్టు ముందు పెట్టి కేసీఆర్‌ దుర్బుద్ధిని కూడా కోర్టుకు తెలియజేస్తామని ఆయన వెల్లడించారు.

>
మరిన్ని వార్తలు