‘ఆ విషయాన్ని మోదీయే ఒప్పుకున్నారు’

21 Jul, 2018 18:17 IST|Sakshi
టీపీసీసీ ప్రెసిడెంట్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి (ఫైల్‌ ఫొటో)

సాక్షి, హైదరాబాద్‌: పార్లమెంట్‌ తలుపులు మూసేసి తెలంగాణ ఇచ్చారని ప్రధాని మోదీ శుక్రవారం లోక్‌సభలో పేర్కొనడంపై తెలంగాణ ప్రజలు ఆలోచించాలని టీపీసీసీ ప్రెసిడెంట్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అన్నారు. పరోక్షంగా తెలంగాణ ఏర్పాటుకోసం కృషి చేసింది కాంగ్రెస్సేనని మోదీ ఒప్పుకున్నారని ఆయన వెల్లడించారు. పార్టీ కార్యాలయంలో ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. కేసీఆర్‌, మోదీ మధ్య రహస్య ఒప్పందాలు జరిగాయనీ, అందుకే ప్రజల ముందు బీజేపీని విమర్శించే టీఆర్‌ఎస్‌ నాయకులు తెరవెనుక మద్దతు ఇస్తున్నారని అన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను మరచిన కేసీఆర్‌కు బుద్ధి చెప్పాలని అన్నారు. 

అవిశ్వాస తీర్మానం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ఎంపీలు ప్రత్యేక హోదా సాధన కోసం గళమెత్తితే, తెలంగాణ ఎంపీలు ఎందుకు నోరు మెదపలేదని మండిపడ్డారు. అవిశ్వాస తీర్మానంతో  విభజన హామీల సాధనలో టీఆర్‌ఎస్‌ వైఖరి బయటపడిందని ఎద్దేవా చేశారు. ముస్లిం రిజర్వేషన్ల పెంపు కోసం ఎందాకైనా పోరాడతామని ప్రకటించిన కేసీఆర్‌ నిన్న లోక్‌సభలో టీఆర్‌ఎస్‌ ఎంపీలతో ఎందుకు మాట్లాడించలేక పోయారని దుయ్యబట్టారు. లోక్‌సభలో రాహుల్‌ ప్రసంగం ఆకట్టుకుందని ‍ప్రశంసించారు. ప్రధాని మోదీని రాహుల్‌ ఆలింగనం చేసుకోవడం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. అమిత్‌ షా-మోదీల రాజకీయాలు వికృతంగా మారిపోయాయని విమర్శించారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు