సోషల్‌ మీడియాలో టీపీసీసీ దూకుడు

5 Mar, 2018 02:20 IST|Sakshi

ఫేస్‌బుక్‌ లైవ్‌ ద్వారా బస్సు యాత్రకు విస్తృత ప్రచారం

ఇప్పటికే రెండుసార్లు అందుబాటులోకి ఉత్తమ్‌  

సాక్షి, హైదరాబాద్ ‌: పార్టీ ప్రచారంలో భాగంగా సోషల్‌ మీడియాను ఉపయోగించుకునే దిశలో టీపీసీసీ ఓ అడుగు ముందుకు వేసింది. ఇప్పటికే పార్టీ తరఫున వాట్సాప్‌ గ్రూపులు, ఫేస్‌బుక్‌ పేజీలుండగా, తాజాగా టీపీసీసీ అ«ధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేరుగా ఫేస్‌బుక్‌ ద్వారా లైవ్‌లోకి వచ్చి కార్యకర్తలతో మాట్లాడుతున్నారు. పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ‘బస్సు యాత్ర’కు విస్తృత ప్రచారం కల్పించడంలో భాగంగా ఇప్పటికే రెండుసార్లు అందుబాటులోకి వచ్చిన ఆయన.. సోషల్‌ మీడియా వేదికగా పార్టీ ఉద్దేశాన్ని, లక్ష్యాన్ని వివరిస్తూ కార్యకర్తలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

తొలుత గత నెల 26న బస్సుయాత్ర ప్రారంభం కాగా, 25వ తేదీన ఫేస్‌బుక్‌ ద్వారా ఉత్తమ్‌ కార్యకర్తలతో మాట్లాడారు. రెండోసారి బస్సుయాత్ర ఆదివారం నుంచి ప్రారంభం కాగా, అంతకు ముందు రోజు ఫేస్‌బుక్‌లో మాట్లాడారు. రెండు ఫోన్‌లైన్ల ద్వారా నిర్వహిస్తోన్న ఈ కార్యక్రమానికి మంచి స్పందనే లభిస్తోంది. మొదటిసారి ఫేస్‌బుక్‌ లైవ్‌ కార్యక్రమంలో 24 గంటల ఉచిత విద్యుత్, ఖాళీ పోస్టుల భర్తీ, మైనార్టీ రిజర్వేషన్‌ అంశాలపై కేడర్‌తో తన అభిప్రాయాలను పంచుకున్నారు.

రెండోసారి మాత్రం తన వ్యక్తిగత వ్యవహార శైలిని కూడా కార్యకర్తలకు చెప్పుకొచ్చారు ఉత్తమ్‌. తాను వైమానిక దళంలో పనిచేసిన వ్యక్తిగా పనికిమాలిన మాటలు మాట్లాడలేనని, కొందరు వాడే భాషను తాను ఉపయోగించలేనని కేడర్‌కు స్పష్టం చేశారు. యువత, ఉద్యోగాల కల్పన, నిరుద్యోగ భృతి లాంటి అంశాలపై కేడర్‌ అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ పార్టీ హామీలను కూడా వివరించారు. మొత్తంమీద సోషల్‌ మీడియా వేదికగా టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ చేస్తున్న ఈ ప్రచార ప్రయత్నం ఎంతవరకు సఫలీకృతమవుతుందో వేచి చూడాల్సిందే.

మరిన్ని వార్తలు