ఏమీ చేయలేదు..ఏమీ చేయబోరు

17 Jan, 2020 03:48 IST|Sakshi

పట్టణ ప్రాంతాల అభివృద్ధిపై టీఆర్‌ఎస్‌కు చిత్తశుద్ధి లేదు

బీజేపీ అసలు పోటీలోనే లేదు..: టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల అభివృద్ధికి గత ఆరేళ్లలో టీఆర్‌ఎస్‌ చేసిందేమీ లేదని, భవిష్యత్‌లో కూడా ఆ పార్టీ నేతలు ఏమీ చేయబోరని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అసలు పట్టణ ప్రాంతాల అభివృద్ధిపై వారికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన నిరుద్యోగ భృతి, రైతు రుణమాఫీ విషయాలు సీఎం కేసీఆర్‌కు గుర్తుకు రావాలంటే ఈ మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను చిత్తుగా ఓడించి కాంగ్రెస్‌ను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలోని కాంగ్రెస్‌ పార్టీ నేతలు, కార్యకర్తలతో ఆయన గురువారం గాంధీభవన్‌ నుంచి టెలి కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. గత ఆరేళ్లలో టీఆర్‌ఎస్‌ వైఫల్యాలను, ప్రజలను మోసం చేసిన తీరును ఎన్నికల ప్రచారంలో ఎండగట్టాలని శ్రేణులకు పిలుపునిచ్చారు.

టీఆర్‌ఎస్‌కు ఓట్లడిగే అర్హత లేదు
మూడేళ్లలో మిషన్‌భగీరథ ద్వారా ఇంటింటికీ నీళ్లు ఇవ్వకపోతే ఓట్లడగబోనని 2014 డిసెంబర్‌లో అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్‌ చెప్పారని, నేటికీ నీళ్లివ్వని టీఆర్‌ఎస్, కేసీఆర్‌కు మున్సిపల్‌ ఎన్నికల్లో ఓట్లడిగే అర్హత లేదని ఉత్తమ్‌ అన్నారు. నిరుద్యోగ భృతి, రైతు రుణమాఫీ, రైతుబంధు, ముస్లింలు, గిరిజనులకు రిజర్వేషన్లు తదితర అన్ని అంశాల్లో కేసీఆర్‌ మాట తప్పిన విషయాన్ని ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. పౌరసత్వ చట్ట సవరణ (సీఏఏ)కు వ్యతిరేకంగా దేశంలోని చాలా రాష్ట్రాల్లో అసెంబ్లీలు తీర్మానాలు చేశాయని, తెలంగాణలో కూడా ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి తీర్మానం చేయాలని తాము కోరినా సీఎం పట్టించుకోవడం లేదన్న విషయాన్ని మైనార్టీలు గుర్తించాలని కోరారు.

మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లండి..
రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ రూపొందించిన కామన్‌ మేనిఫెస్టో–విజన్‌ డాక్యుమెంట్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు ఉత్తమ్‌ సూచించారు. శుక్రవారం జిల్లా కేంద్రాలు, శనివారం అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో విలేకరుల సమావేశాలు ఏర్పాటు చేసి కాంగ్రెస్‌ను గెలిపిస్తే పట్టణ ప్రాంతాల్లో ఎలాంటి అభివృద్ధి చేస్తామో ప్రజలకు వివరించాలని కోరారు. తాము మెజార్టీ స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేసిన ఉత్తమ్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో అసలు బీజేపీ పోటీలోనే లేదని వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు