ఏం ఉద్ధరించారని ఓట్లడుగుతారు?

11 Jan, 2020 02:02 IST|Sakshi

మున్సిపల్‌ ప్రచారానికి వచ్చిన టీఆర్‌ఎస్‌ నేతలను నిలదీయండి

కార్యకర్తలతో టెలి కాన్ఫరెన్స్‌లో టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ వ్యాఖ్యలు..

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న 120 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లలో ఏ మున్సిపాలిటీని ఉద్ధరించారని ఓట్లు అడగుతున్నారో ప్రచారానికి వచ్చిన టీఆర్‌ఎస్‌ నేతలను ప్రశ్నించాలని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆరేళ్లుగా రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో టీఆర్‌ఎస్‌ చేసింది శూన్యమని, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ పట్టణ ప్రాంత ప్రజల అభివృద్ధికి చేసిందేమీ లేదనే విషయాన్ని ప్రతి ఓటరు దృష్టికి తీసుకెళ్లాలని  కాంగ్రెస్‌ కార్యకర్తలను కోరారు.

శుక్రవారం గాంధీభవన్‌ నుంచి మున్సిపల్‌ కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలతో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్‌లో ఉత్తమ్‌ మాట్లాడుతూ.. మున్సిపాలిటీల్లో జరిగిన అభివృద్ధి ఏమీ లేదు కాబట్టి డబ్బును అడ్డం పెట్టుకుని, అధికార దుర్వినియోగం చేసి టీఆర్‌ఎస్‌ గెలవాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ ప్రయత్నాలను, కుట్రలు, కుతంత్రాలను కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు ఛేదించాలని, వీరసైనికుల్లా పోరాడి ఈ ఎన్నికల్లో విజయం సాధించాలని పిలుపునిచ్చారు.

ఒక్క నిరుద్యోగికి భృతి ఇవ్వలే.. 
మున్సిపాలిటీల్లో కొత్తగా రోడ్లు వేయడం అటుంచితే, మిషన్‌ భగీరథ పేరుతో ఉన్న రోడ్లను ధ్వంసం చేశారని, విద్యుత్, శానిటేషన్, నీటిసరఫరా విషయంలో పూర్తిగా విఫలమయ్యారని ఉత్తమ్‌ మండిపడ్డారు. రాష్ట్రంలోని ఏ మున్సిపాలిటీలో కనీస మౌలిక వసతుల కల్పన జరగలేదని, ఈ విషయాలన్నింటినీ ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.

నిరుద్యోగ యువతకు ఇస్తామన్న నిరుద్యోగ భృతిని ఇప్పటివరకు ఒక్కరికి కూడా ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలోని ఏ ఒక్క రైతుకు రుణమాఫీ చేయలేదని, ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు, కేసీఆర్‌కు ఝలక్‌ ఇస్తేనే నిరుద్యోగ భృతి, రైతురుణమాఫీ వస్తాయని ఉత్తమ్‌ అన్నారు.

టీఆర్‌ఎస్‌–బీజేపీలు మిలాఖత్‌.. 
అన్ని విషయాల్లో ఇలాగే మోసం చేసే కేసీఆర్‌ గత ఆరేళ్లలో అనేక సందర్భాల్లో బీజేపీతో జతకట్టిన విషయాన్ని రాష్ట్రంలోని మైనార్టీలు కూడా గుర్తించాలని ఉత్తమ్‌ కోరారు. అవసరమైన అన్ని సందర్భాల్లోనూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి టీఆర్‌ఎస్‌ వత్తాసు పలికిందని, టీఆర్‌ఎస్, బీజేపీలు మిలాఖత్‌ అయ్యాయని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే బీజేపీకి వేసినట్టేనన్న విషయాన్ని మైనార్టీలు గుర్తించి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

సీఏఏపై సీఎం మౌనం ఎందుకు? 
పంజాబ్, కేరళ, బిహార్, ఒడిశా, బెంగాల్‌ సీఎంలు తమ రాష్ట్రాల్లో సీఏఏను అమలు చేయడం లేదని స్పష్టంగా చెప్పినా, కేసీఆర్‌ మాత్రం మౌనంగా ఉంటున్నారని ఉత్తమ్‌ ఎద్దేవా చేశారు. ఈ విషయంలో ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించి సీఏఏకు వ్యతిరేకంగా తీర్మా నం చేయాలని కాంగ్రెస్‌ పార్టీ పదేపదే కోరినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్‌ను ఎందుకు నిలదీయడం లేదో ఎంఐఎం అధినేత ఒవైసీ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంత వరకు కాంగ్రెస్‌ కార్యకర్తలు, నాయకులు అప్రమత్తంగా ఉండాలని ఉత్తమ్‌ కోరారు. నామినేషన్ల పరిశీలన, అవసరమైన చోట్ల అప్పీల్‌ చేయడం, పోలింగ్, కౌంటింగ్‌ వరకు అందరూ ఎన్నికల ప్రక్రియలో చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు