పీఆర్సీ అమలు చేయండి

23 Feb, 2020 03:42 IST|Sakshi

సీఎం కేసీఆర్‌కు ఉత్తమ్‌కుమార్‌ లేఖ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు వెంటనే పీఆర్సీ ప్రకటించాలని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శనివారం ఆయన పార్టీ అధికార ప్రతినిధి, టీపీఆర్టీయూ వ్యవస్థాపక అధ్యక్షుడు జి.హర్షవర్ధన్‌రెడ్డితో కలసి సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాలు నిరాశలో ఉన్నాయని, తెలంగాణ ఏర్పాటైన తర్వాత వీరి హక్కులు కాలరాస్తున్నారని ఆ లేఖలో ఆరోపించారు. 2018, జూలై 1 నుంచే అమల్లోకి రావాల్సిన 11వ పీఆర్సీని 20 నెలలు గడుస్తున్నా ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. ‘పీఆర్సీ గడువు మరో 10 నెలలు ఎందుకు పొడిగించాల్సి వచ్చింది. పొడగింపు కోసం కమిషన్‌ సభ్యులు అడిగిన కారణాలను ప్రజాబాహుళ్యంలో ఎందుకు పెట్టలేదు? ఐదేళ్ల కాలపరిమితి ఉన్న పీఆర్సీలో మూడేళ్లు ఉద్యోగులకు ఫిట్‌మెంట్‌ ప్రకటించకపోతే ఆ మేరకు వారు ఆర్థికంగా నష్టపోరా?’అని ఆ లేఖలో నిలదీశారు.

మరిన్ని వార్తలు