కరెంటు బిల్లులు మాఫీ చేయండి

6 Jul, 2020 04:37 IST|Sakshi

సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ బహిరంగ లేఖ

సాక్షి, హైదరాబాద్‌: కరెంటు బిల్లులపై సీఎంకు కాంగ్రెస్‌ లేఖాస్త్రం సంధించింది. కరోనా కరుణించలేదు.. కనీసం మీరైనా కనికరించాలని విజ్ఞప్తి చేసింది. పేద కుటుంబాలు, ఎంఎస్‌ఎంఈలు లాక్‌డౌన్‌ కారణంగా బిల్లులు భరించలేకపోతున్నందున వాటిని మాఫీ చేయాలని తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ(టీపీసీసీ) అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి కోరారు. ఇతర వినియోగదారులకు కూడా బిల్లులో రాయితీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. ‘బీపీఎల్‌ కుటుంబాలకు లాక్‌డౌన్‌ కాలానికి 100 శాతం విద్యుత్‌ బిల్లులను మాఫీ చేయాలని కోరుతున్నాం. తెల్లరేషన్‌ కార్డుదారులకు విద్యుత్‌ బిల్లులను పూర్తిగా మాఫీ చేయాలి. బిల్లింగ్‌ పద్ధతిలో తప్పులను సరిదిద్దడం ద్వారా ఇతర వినియోగదారులకు కూడా తగిన విధంగా తగ్గించాలి. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల స్థిర, సాధారణ చార్జీలు సహా విద్యుత్‌ బిల్లులు పూర్తిగా మాఫీ చేయాలి.

జూన్‌లో విద్యుత్‌ బిల్లులు చాలా అన్యాయంగా ఉన్నాయి. వినియోగం మీద ఆధారపడి నెలవారీగా చార్జీలు వసూలు చేయాలి. కానీ, ఈఆర్సీ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూ 90 రోజుల్లో చేసిన మొత్తం వినియోగం ఆధారంగా బిల్లులను తయారు చేశారు. పర్యవసానంగా, వినియోగదారులకు యూనిట్‌కు రూ.4.30కి బదులు రూ.9 బిల్లు వేశారు. ప్రజలపట్ల తన విధానాన్ని మార్చుకునే స్థితిలో తెలంగాణ ప్రభుత్వం లేదు. రెండు నెలలకుపైగా లాక్‌డౌన్‌ కారణంగా నష్టపోయిన ప్రజలపై భారాన్ని తగ్గించడానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఒకవైపు కోవిడ్‌ –19 ని అరికట్టడంలో విఫలమైన ప్రభుత్వం మరోవైపు సామాన్యులపై అదనపు ఆర్థిక భారం వేయడానికి ప్రయత్నిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో చాలామంది జీవనోపాధి వనరులను కోల్పోయి విద్యుత్‌ బిల్లులు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు. పెరిగిన విద్యుత్‌ బిల్లులకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్రమంతటా నల్ల జెండాలు, బ్యాడ్జ్‌లతో నిరసనలు నిర్వహిస్తాం’అని లేఖలో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు