బీజేపీ చెబుతున్న మార్పు ఎక్కడ?

5 Mar, 2018 18:49 IST|Sakshi
ప్రధాని నరేంద్ర మోదీతో నైఫ్యూ రియో (ఫైల్‌)

సాక్షి, న్యూఢిల్లీ : ‘మార్పు తీసుకొస్తాం, మార్పు కోసమే మా పోరాటం’ అంటూ నాగాలాండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ–నేషనలిస్ట్‌ డెమోక్రటిక్‌ ప్రోగ్రెసివ్‌ పార్టీ కూటమి విస్తృతంగా ప్రచారం చేసింది. ఎన్నికల ఫలితాలు వెలువడడంతో ఎలాగైనా బీజేపీ అధికారంలోకి వస్తుందని తేలిపోయింది. కానీ రాష్ట్రంలో మార్పు వచ్చే సూచనలు మాత్రం శూన్యమే. ఎన్‌డీపీపీ పార్టీతో కలిసి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, 60 మంది సభ్యులు గల రాష్ట్ర అసెంబ్లీలో తమకు జేడీయూ, ఓ స్వతంత్య్ర అభ్యర్థితోపాటు మొత్తం 32 మంది సభ్యుల మద్దతు ఉందని బీజేపీ ప్రకటించింది.

గవర్నర్‌ ఆహ్వానిస్తే ఎన్‌డీపీపీ వ్యవస్థాపక నాయకుడు నైఫ్యూ రియో ముఖ్యమంత్రి అవుతారు. ఆయన ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి టీఆర్‌ జెలియాంగ్‌ కంటే ముందు వరుసగా 11 ఏళ్లపాటు మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. నాగా పీపుల్స్‌ ఫ్రంట్‌ తరఫున మూడోసారి ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన ఆయన అర్ధాంతరంగా సీఎం పదవిని వదిలిపెట్టి 2014లో ఎంపీగా లోక్‌సభకు వెళ్లారు. ఆ తర్వాత మళ్లీ రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చారు. జెలియాంగ్‌ ప్రభుత్వం హయాంలో వెలుగులోకి వచ్చిన అనేక అవినీతి కుంభకోణాలు నాటి రియో ప్రభుత్వంలో ప్రారంభమైనవే. రియో పార్టీతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్లయితే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న గత శాసనసభ్యులకన్నా ఈసారి అవినీతి ఆరోపణలు ఎదుర్కొనే శాసనసభ్యుల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంటుందని ‘ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం’  ఓ సర్వే ద్వారా తేల్చింది.

నాగాలాండ్‌ ముఖ్యమంత్రి పదవికి తాను రాజీనామా చేయనని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత బలం తనకూ ఉందని, తనకే అవకాశం కల్పించాలని ప్రస్తుత ముఖ్యమంత్రి టీఆర్‌ జెలియాంగ్‌ రాష్ట్ర గవర్నర్‌ను కోరిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఆయన్ని కూడా బీజేపీ చర్చలకు పిలిచింది. జెలియాంగ్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న నాగా పీపుల్స్‌ ఫ్రంట్‌కు ఎన్నికల్లో 27 సీట్లు లభించాయి. 2013 ఎన్నికల్లో కేవలం ఒక్క సీటును మాత్రమే గెలుచుకొని ఈసారి ఏకంగా 12 సీట్లను గెలుచుకున్న బీజేపీ, నాగా పీపుల్స్‌ ఫ్రంట్‌కు మద్దతిస్తే మళ్లీ జెలియాంగ్‌ ప్రభుత్వమే ఏర్పడుతుంది. ప్రస్తుత జెలియాంగ్‌ ప్రభుత్వంలో కూడా బీజేపీ కొనసాగిన విషయం తెల్సిందే. బీజేపీ తరఫున 2013లో ఒక్కరే గెలిచినప్పటికీ ఆ తర్వాతా వారి సంఖ్య పార్టీ ఫిరాయింపులతో నాలుగుకు చేరింది. 2015 నుంచి ప్రతిపక్షంలో ఒక్కరు కూడా లేకుండానే జెలియాంగ్‌ ప్రభుత్వం కొనసాగింది. ప్రతిపక్ష పార్టీలన్నీ ప్రభుత్వంలో చేరిపోవడమే అందుకు కారణం.

రియో నాయకత్వంలోని ఎన్‌డీపీపీతో కలిసే బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే రాష్ట్రంలోనే ధనిక ప్రభుత్వం అవుతుంది. ఇరుపార్టీలకు చెందిన శాసనసభ్యుల్లో 75 శాతం మంది కోటి రూపాయలకు పైగా ఆస్తులు కలిగిన వారే. అవినీతి కుంభకోణాలు రియో హయాంలో ప్రారంభమై ఆ కేసులు ఇప్పటికీ కొనసాగుతున్నందున బీజేపీ చెప్పే మార్పు ఎక్కడ వస్తుంది? ఇక జెలియాంగ్‌తో చేతులు కలిపితే మార్పు అనే పదానికే అర్థం ఉండదు. ఈసారి మార్పు వచ్చేదల్లా ఒక్కటే. బీజేపీ ఎవరితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా అవతలి పక్షం ప్రతిపక్షం అవుతుంది. రియో పార్టీతో కలిసి బీజేపీ పోటీ చేసినందున ప్రభుత్వంలో ఆయన పార్టీ కూడా చేరిపోతే మళ్లీ ప్రతిపక్షం అనేది ఉండదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో బలమైన ప్రతిపక్షం ఉన్నప్పుడే ప్రభుత్వ పాలన సవ్యంగా సాగుతుంది.

మరిన్ని వార్తలు