అంత భారీ చలాన్లా? ప్రజలెలా భరిస్తారు?

7 Sep, 2019 14:33 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ముంబై: ట్రాఫిక్‌ ఉల్లంఘనలపై ఉక్కుపాదం మోపేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల నూతన మోటారు వాహన చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. పలు రాష్ట్రాల్లో సెప్టెంబర్‌ 1 నుంచి కొత్త మోటారు వాహన చట్టం అమల్లోకి వచ్చింది. దీంతో ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు సంబంధించిన చలాన్లు భారీమొత్తంలో పెరిగాయి. ఈ చట్టం అమలులోకి రావడంతో ఢిల్లీ శివారులోని గురుగ్రామ్‌లో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ చేసిన పలువురు వాహనదారులకు ఒక్కరోజే ఏకంగా రూ. 59వేల వరకు జరిమానాలు విధించారు. ఈ నేపథ్యంలో బీజేపీ మిత్రపక్షం శివసేన ట్రాఫిక్‌ జరిమానాలపై ఆందోళన వ్యక్తం చేసింది. ట్రాఫిక్‌ ఉల్లంఘనలపై భారీ జరిమానాలు విధించడంలోని ఆంతర్యమేమిటని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ట్రాఫిక్‌ ఉల్లంఘనలపై ఈస్థాయిలో జరిమానాలు విధిస్తే.. సామాన్య ప్రజలు ఎలా భరిస్తారని ప్రశ్నించింది.

కొత్త మోటారు వాహన చట్టానికి తాను వ్యతిరేకం కాదని, కానీ జరిమానాలు సామాన్య ప్రజలు భరించలేనివిధంగా చాలా ఎక్కువగా ఉండటాని తాము వ్యతిరేకిస్తున్నామని శివసేన అధికార పత్రిక సామ్నా తన సంపాదకీయంలో పేర్కొం‍ది. ‘కొత్త చట్టంలో ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘనలకు దాదాపు పదిరెట్లు ఎక్కువగా జరిమానాలు పెంచారు. కొత్త చట్టం ఆహ్వానించదగిందే. కానీ మన దేశంలో నిరుపేదలకు అంత భారీస్థాయి జరిమానాలు భరించే స్తోమత ఉందా?’ అని సామ్నా పేర్కొంది. నితిన్‌ గడ్కరీ ప్రవేశపెట్టిన ఈ చట్టంలో పెద్దమొత్తంలో జరిమానాలు ప్రతిపాదించడంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయని తెలిపింది.

ఇప్పటికైనా కేంద్ర రవాణా మంత్రిత్వశాఖ భారీగా పెంచిన జరిమానాలపై పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేసింది. రోడ్ల మీద అనేక గుంతలు ఉన్నాయని, ఆ గుంతల వల్ల ప్రమాదాలు జరుతున్నాయని, ఈ గుంతలు సరిచేసి.. రహదారులను చక్కగా తీర్చిదిద్దిన అనంతరం కొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకొస్తే బాగుండేదని సామ్నా అభిప్రాయపడింది. రోడ్లను సరిచేసేవరకు కొత్త చట్టం అమలును నిలిపేయాలన్న గోవా కాంగ్రెస్‌ డిమాండ్‌ను ఈ సందర్భంగా ‘సామ్నా’ తన సంపాదకీయంలో ప్రస్తావించింది.
 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా