గెలుపే లక్ష్యం

18 Mar, 2019 06:40 IST|Sakshi

వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ఎంపికపై సర్వత్రా జనామోదం 

 ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను ఒకేసారి ప్రకటించిన పార్టీ

అత్యధికంగా బీసీలకు 41 ఎమ్మెల్యే, 7 ఎంపీ టిక్కెట్లు 

ముస్లిం మైనారిటీలకు 5 ఎమ్మెల్యే టికెట్లు కేటాయింపు 

 అభ్యర్థుల్లో అత్యధికులు సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారే  

దాదాపు ఎక్కడా అసంతృప్తులు, అసమ్మతులు లేవు 

పార్టీకి చేసిన సేవ, విశ్వసనీయతకు పెద్దపీట.. శ్రేణుల్లో రెట్టించిన ఉత్సాహం 

వైఎస్సార్‌ కాంగ్రెస్‌లో ఎన్నికల ఉత్సాహం ఉరకలెత్తుతోంది. రాష్ట్రంలో ఏప్రిల్‌ 11నజరుగనున్న అసెంబ్లీ, లోక్‌సభకు ఎన్నికలకు ప్రకటించిన అభ్యర్థుల జాబితా..పార్టీ శ్రేణుల ఉత్సాహాన్నిరెట్టింపుచేసింది. రాష్ట్రమంతటా ఫీల్‌ గుడ్‌ భావన తీసుకువచ్చింది. అభ్యర్థుల జాబితా విడుదలయ్యాక.. గెలుపు తథ్యమనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. విశ్వసనీయతకు పెద్దపీట.. పార్టీకి చేసిన సేవలకు గుర్తింపు.. సర్వేలతో శాస్త్రీయంగా  బలాబలాల బేరీజు... టిక్కెట్లపై మొదటి నుంచీ స్పష్టత... ధనం కంటే గుణానికి ప్రాధాన్యం... బీసీలు.. మైనారిటీలు.. యువతకు పెద్దపీట..సొంత వారికి నచ్చజెప్పి మరీ కొత్తవారికి అవకాశం ఇవ్వడం... ఇవే ప్రాతిపదికలుగా వైఎస్సార్‌సీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను ఎంపిక చేసింది. ఆదివారం ఉదయం ఒకేసారి 175 ఎమ్మెల్యే,  25 ఎంపీ అభ్యర్థులను ప్రకటించడం ద్వారా.. ఎన్నికల సమరానికి తామెంత సర్వసన్నద్ధంగా, స్పష్టతతో ఉన్నామో ఆ పార్టీ వెల్లడించింది. దాంతో పార్టీ అభ్యర్థులపట్ల రాష్ట్రవ్యాప్తంగా విశేషంగా సానుకూల స్పందన వెల్లువెత్తుతోంది. అదే ఉత్సాహంతో అత్యధిక స్థానాల్లో విజయఢంకా మోగించేందుకు పార్టీ నేతలు, శ్రేణులుఎన్నికల కదనరంగంలోకి ఉరుకుతున్నారు.  
– వడ్డాది శ్రీనివాస్, సాక్షి, అమరావతి 

రాష్ట్రంలో అన్ని అసెంబ్లీ, ఎంపీ స్థానాలకు ఆదివారం ఒకేసారి అభ్యర్థులను ప్రకటించి  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి రాజకీయంగా సంచలనం సృష్టించారు. ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో ఏ పార్టీ కూడా అన్ని అసెంబ్లీ, ఎంపీ అభ్యర్థుల జాబితాను ఒకేసారి ప్రకటించనే లేదు. అధికార పార్టీ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాలుగు నెలలుగా కసరత్తు చేస్తూ కూడా టిక్కెట్ల ఎంపికలో కిందా మీదా పడుతున్నారు. ఇప్పటికి వారం రోజుల వ్యవధిలో రెండు జాబితాలు ఇచ్చారు. ఇంకా కొన్ని స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. కానీ వైఎస్సార్‌సీపీ మాత్రం ఒకేసారి మొత్తం జాబితాను ప్రకటించడం రాష్ట్రంలో అందర్నీ ఆకట్టుకుంది. ఈ పరిణామంతో ఎన్నికలకు వైఎస్సార్‌సీపీ ఎంత పక్కాగా సంసిద్ధమైందన్నది అందరికీ స్పష్టమైంది. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల ప్రకటనతో పార్టీ నేతలు, శ్రేణుల్లో  ఆత్మవిశ్వాసం మరింతగా ఇనుమడించింది. రెట్టించిన ఉత్సాహంతో ఆ పార్టీ ఎన్నికలకు సన్నద్ధమవుతోంది.  

అంతటా ఫీల్‌ గుడ్‌
వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ఎంపిక పార్టీలో మరింత సానుకూలతను తీసుకువచ్చింది. అభ్యర్థుల ఎంపికపై ఎక్కడా ఎలాంటి అసమ్మతులు లేనే లేవు. ఎలాంటి చెప్పుకోదగ్గ అసంతృప్తులు కూడా కనిపించలేదు. ఎందుకంటే.. పార్టీ అభ్యర్థుల ఎంపికపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ కొద్దికాలంగా శాస్త్రీయంగా కసరత్తు చేస్తూ వచ్చారు. పలు సర్వేల ఫలితాలను క్రోడీకరించి.. సామాజిక సమీకరణలు పాటిస్తూ.. అభ్యర్థుల బలాబలాలు బేరీజు వేస్తూ.. టికెట్ల కేటాయింపుపై తుది నిర్ణయానికి వచ్చారు. సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ, విశ్వసనీయతకు ప్రాధాన్యమిస్తూ అభ్యర్థులను ఎంపిక చేశారు.  

  •    అత్యధికంగా బీసీలకు 41 ఎమ్మెల్యే టికెట్లు కేటాయించారు, అదే విధంగా 7 మంది బీసీ నేతలను ఎంపీ అభ్యర్థులుగా ప్రకటించారు. 5 మంది ముస్లిం మైనారిటీలకు ఎమ్మెల్యే టికెట్లు కేటాయించారు. అంతేకాకుండా పార్టీ ప్రకటించిన అభ్యర్థుల్లో 90శాతం మంది పార్టీ ఆవిర్భావం నుంచి చిత్తశుద్ధితో పనిచేస్తున్న నేతలే కావడం విశేషం. తద్వారా రాజకీయాల్లో వైఎస్సార్‌ సీపీ తన విశ్వసనీయతను మారుసారి చాటుకుంది.  అతికొద్ది నియోజకవర్గాల మినహా అత్యధిక నియోజకవర్గాల్లో పార్టీ సమన్వయకర్తలుగా ఉన్నవారినే అభ్యర్థులుగా ఖరారు చేశారు. ఆ కొన్ని నియోజకవర్గాల్లో కూడా సామాజికవర్గ సమీకరణలు, గెలుపు గుర్రాల ఎంపిక కోసమే అనివార్యంగా ఆపాటి మార్పులు చేశారు.  
  •     అదే విధంగా సీనియర్‌నేతలు, కేంద్ర మంత్రులుగా చేసిన వారు పార్టీలోకి వచ్చినప్పటికీ.. వారికి వైఎస్‌ జగన్‌ ముందే అభ్యర్థుల ఎంపికపై స్పష్టత ఇచ్చారు. అంతేగానీ ముందు పార్టీలో చేర్చుకుని తరువాత టిక్కెట్‌లేదని చెప్పడం తన విధానం కాదన్నారు. అందుకు సమ్మతించే ఆ నేతలు పార్టీలో చేరారు. ఉదాహరణకు అమలాపురం సిట్టింగ్‌ ఎంపీ పండల రవీంద్రబాబు,  శ్రీకాకుళం జిల్లాకు చెందిన కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, విశాఖపట్నం జిల్లాకు చెందిన రాష్ట్ర మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, ఆయన కుమారుడు రత్నాకర్‌ ఇటీవల పార్టీలో చేరారు. పార్టీలో చేరికకు ముందే వారికి టిక్కెట్లు కేటాయించలేమని వైఎస్‌ జగన్‌ స్పష్టంగా చెప్పారు. ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేస్తే తప్పకుండా సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అందుకు వారు సానుకూలంగా స్పందించే పార్టీలో చేరారు. ఇంతటి స్పష్టతతో వ్యవహరించబట్టే ఆదివారం ప్రకటించిన అభ్యర్థుల జాబితాపట్ల నేతలు, కార్యకర్తలు, ప్రజల్లోనూ సానుకూల స్పందన రావడం పార్టీకి మరింత ఉత్సాహానిచ్చింది.   

సొంతవాళ్లకు సర్దిచెప్పి మరీ
పార్టీ గెలుపే లక్ష్యంగా వైఎస్‌ జగన్‌ అందర్నీ కలుపుకుని మరీ వెళ్లారు. సమర్థులైన సీనియర్లు, ఇతరులను పార్టీలో చేర్చుకున్నారు. అందుకోసం సిట్టింగ్‌ ఎంపీలు అయిన తన కుటుంబ సభ్యులు, సొంతవాళ్లకు సర్దిచెప్పి మరీ కొత్త వారికి టిక్కెట్ల కేటాయించారు. 2014 ఎన్నికల్లో  ఒంగోలు ఎంపీగా ఎన్నికైన తన చిన్నాన్న వైవీ సుబ్బారెడ్డికి జగన్‌ సర్దిచెప్పారు. పార్టీ విశాల ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్రవ్యాప్తంగా పార్టీ బాధ్యతలు వహించాలని కోరారు. అందుకు ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. ఒంగోలు నుంచి 1998, 2004, 2009 ఎన్నికల్లో గెలిచిన మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఈసారి అవకాశం కల్పించారు. అదే విధంగా తనకు అత్యంత సన్నిహితుడైన నెల్లూరు ఎంపీ మేకపాటి రాజ్‌మోహన్‌రెడ్డికి కూడా వైఎస్‌ జగన్‌ సర్దిచెప్పారు. ఆయన కూడా సానుకూలంగా స్పందించంతో.. అక్కడ మరో సీనియర్‌ నేత ఆదాల ప్రభాకర్‌రెడ్డిని అవకాశం కల్పించారు. ఇవన్నీ త్వరలో జరుగనున్న ఎన్నికల్లో విజయం కోసం పార్టీ ఎంతో పకడ్బందీగా సంసిద్ధమైందనడానికి నిదర్శనంగా కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  

ధనం కాదు...గుణం చూసీ
ఎన్నికలు అంటేనే ధనవంతులు, కార్పొరేట్‌ పెద్దల ఆటగా మారిపోయిన ప్రస్తుత తరుణంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. వర్తమాన రాజకీయాల్లో పోటీ పడేంత ధనవంతులు కానీ వారిని ఎంపీ అభ్యర్థులుగా ఎంపిక చేశారు. అందులోనూ ఆయా స్థానాల్లో పోటీచేయనున్న టీడీపీ అభ్యర్థులు అత్యంత ధనవంతులు కావడం గమనార్హం. పార్టీ ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల్లో అత్యధికులు సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారే కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం ప్రధాన రాజకీయ పార్టీలు  పూర్తిగా డబ్బుకే ప్రాధాన్యమిచ్చి ఎంపీ అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. కానీ వైఎఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రం అందుకు విరుద్ధంగా.. సామాన్యులు, పెద్దగా ధనవంతులుకాని నేతలకు ఎంపీ అభ్యర్థులుగా అవకాశం కల్పించి చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యేకించీ టీడీపీ తరపున వందల కోట్ల ఆస్తులు, వ్యాపార సామ్రాజ్యాలు ఉన్నవారు, రాజ కుటుంబీకులు బరిలో ఉన్న లోక్‌సభ నియోజకవర్గాల్లో సైతం... సామాన్యులు, మధ్యతరగతి వర్గాలకు చెందిన వారిని ఎంపీ అభ్యర్థులుగా ఎంపిక చేయడం గమనార్హం.  

  • ఉదాహరణకు శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా దువ్వాడ శ్రీనివాస్‌కే వైఎస్సార్‌సీపీ ఎంపిక చేసింది. ఈయన ఆర్థికంగా అంత స్థితిమంతుడు కాదు. ఆ నియోజకవర్గ టీడీపీ ఎంపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు కుటుంబానికి వందల కోట్ల ఆస్తులు ఉన్నాయి. జిల్లాలో బలమైన సామాజికవర్గానికి చెందిన కింజరాపు కుటుంబ అరాచకాలను ఎదురొడ్డి ఉద్యమాలు చేసిన దువ్వాడ శ్రీనివాస్‌ జిల్లాలో మంచి గుర్తింపు సాధించారు. అందుకే ధన రాజకీయాలు కాకుండా.. ప్రజా రాజకీయాలకు ప్రాధాన్యమిస్తూ ఆయనకు జగన్‌ అవకాశం కల్పించారు.  
  •    ఇక విజయనగరం లోక్‌సభ నియోజకవర్గం నుంచి టీడీపీ ఎంపీగా కేంద్ర మాజీ మంత్రి,  విజయనగరం మహారాజ కుటుంబానికి చెందిన అశోక్‌ గజపతిరాజు పోటీ చేస్తున్నారు. ఆయనతో పోలిస్తే ఏమాత్రం ధనవంతుడు కానీ బెల్లాన చంద్రశేఖర్‌ను ఎంపీ అభ్యర్థిగా వైఎస్సార్‌సీపీ ఎంపిక చేసింది. జిల్లాలో అత్యధికంగా ఉన్న తూర్పు కాపు సామాజికవర్గానికి పెద్దపీట వేసింది.  
  •     అరకు ఎంపీగా టీడీపీ నుంచి మాజీ మంత్రి, కురుపాం రాజ కుటుంబానికి చెందిన కిశోర్‌చంద్రదేవ్‌  పోటీ చేస్తున్నారు. కానీ అక్కడ అతి సామాన్య గిరిజన కుటుంబానికి చెందిన గొడ్డేటి మాధవిని ఎంపీగా వైఎస్సార్‌సీపీ ఎంపిక చేసింది.  
  •     అదే విధంగా బాపట్ల లోక్‌సభ నియోజకవర్గం నుంచి నందిగం సురేష్‌ను ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేయడం ద్వారా వైఎస్‌ జగన్‌ తన విలక్షణతను చాటుకున్నారు. రాజధాని ప్రాంతంలో టీడీపీ ప్రభుత్వ అరాచకాలకు వ్యతిరేకంగా ఆయన పోరాటాలు చేశారు. ఆర్థికంగా ఆయన అతి సామాన్యుడు. కానీ పార్టీ కోసం ఆయన చేసిన సేవలకు గుర్తించి ఎంపీ అభ్యర్థిగా అవకాశం కల్పించడంపట్ల పార్టీలోనూ, ప్రజల్లోనూ సానుకూలత వ్యక్తమవుతోంది.  
  •       ఇక టీడీపీ పూర్తిగా ధన, దౌర్జన్యకర రాజకీయాలకు చేసే అనంతపురం జిల్లాలో.. అతి సామాన్యులైన ఇద్దరికి ఎంపీ అభ్యర్థులుగా వైఎస్సార్‌సీపీ అవకాశం కల్పించడం చారిత్రక నిర్ణయం. టీడీపీ సిట్టింగ్‌ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి కుటుంబం వందల కోట్ల ఆర్థిక సామ్రాజ్యం కలిగి ఉంది. ఈసారి జేసీ కుమారుడు పవన్‌ కుమార్‌ రెడ్డి అనంతపురం నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. కానీ ఆ నియోజకవర్గంలో సామాన్య మధ్యతరగతి వర్గానికి చెందిన తలారి రంగయ్యను వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా ఎంపిక చేసింది. అదే విధంగా హిందూపురం లోక్‌సభ నియోజకవర్గ నుంచి పార్టీ అభ్యర్థిగా ఇటీవల సీఐగా ఉద్యోగ విరమణ చేసిన గోరంట్ల మాధవ్‌ను ఎంపిక చేశారు. ఆ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున మాజీ మంత్రి, సిట్టింగ్‌ ఎంపీ నిమ్మల కిష్టప్ప మళ్లీ పోటీ చేయనున్నారు. అయినప్పటికీ వైఎస్సార్‌సీపీ మధ్య తరగతి కుటుంబానికి చెందిన గోరంట్ల మాధవ్‌కు అవకాశం కల్పించడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది.  
  •     కర్నూలు లోక్‌సభ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున ఆర్థికంగా సంపన్నుడైన మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి పోటీ చేయనున్నారు. కానీ ఆ నియోజకవర్గంలో సామాన్య డాక్టర్‌ అయిన సంజీవ్‌ కుమార్‌ను ఎంపీ అభ్యర్థిగా వైఎస్సార్‌సీపీ ఎంపిక చేసింది.

శ్రేణుల్లో రెట్టించిన ఉత్సాహం
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రజా రాజకీయాల కోణంలో జనామోదం కలిగిన అభ్యర్థులను ఎంపిక చేయడం పట్ల రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని తీసుకువచ్చింది. వైఎస్‌ జగన్‌ సామాజికవర్గ సమతౌల్యం, విశ్వసనీయత ప్రాతిపదికన పార్టీ అభ్యర్థులను ఎంపిక చేశారు. ధన రాజకీయాలు కాకుండా.. ప్రజా రాజకీయాల దిశగా రాష్ట్రాన్ని మలుపు తిప్పేందుకు వైఎస్సార్‌సీపీ ముందడుగు వేసింది. గెలుపు గుర్రాలను అభ్యర్థులుగా ఎంపిక చేసింది. అభ్యర్థుల ఎంపిక పట్ల అంతటా విశేషంగా సానుకూలత వ్యక్తమవుతుండటంతో పార్టీ శ్రేణులు రెట్టించిన ఉత్సాహంతో ఎన్నికల్లో విజయఢంకా మోగించేందుకు ఉరకలెత్తుతున్నాయి!! 

మరిన్ని వార్తలు