ముద్దుకృష్ణమకు ఘన నివాళి

8 Feb, 2018 08:52 IST|Sakshi
ముద్దుకృష్ణమ నాయుడి భౌతిక కాయానికి నివాళులర్పించిన సీఎం, టీడీపీ నాయకులు

ప్రశ్నించే గొంతు మూగబోయింది

హైదరాబాద్‌లో కన్నుమూసిన మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమ నాయుడు

దిగ్భ్రమ చెందిన జిల్లావాసులు

టీడీపీలో విషాదచాయలు

స్వగ్రామానికి భౌతికకాయం, నేడు అంత్యక్రియలు

సీఎం..మంత్రులు సందర్శన..సంతాపం

వైఎస్సార్‌సీపీ నాయకుల నివాళి

తిరుపతి రూరల్‌/రామచంద్రాపురం: మాజీ మంత్రి, శాసనమండలి సభ్యుడు, టీడీపీ సీని యర్‌ నాయకుడు గాలిముద్దుకృష్ణమ నాయుడుకు పలువురు నాయకులు, అధికారులు ఘననివాళులు అర్పించారు. రామచంద్రాపురం మండలంలోని ఆయన స్వగ్రామం వెంకట్రామాపురానికి బుధవారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో ఆయన పార్థివ దేహాన్ని హైదరాబాద్‌ నుంచి తీసుకువచ్చారు. ఆయనకు నివాళులు అర్పించేందుకు రాష్ట్రం నలు మూలల నుంచి ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నేతలు, ప్రజలు పెద్ద సంఖ్యలో వెంకట్రామాపురానికి తరలివచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముద్దు కృష్ణమ నాయుడి మృతదేహా నికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి బోరున విలపించారు. ప్రజానాయకుడిని కోల్పోవడం బాధాకరమని  చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌ ఆయనతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

ముద్దు మరణవార్త తెలుసుకుని తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. ఆత్మీయుడిని కోల్పోయానని గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడికి నివాళులు అర్పించిన వారిలో రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, నారాయణ, దేవినేని ఉమ, ఆదినారాయణరెడ్డి, గాలి వియ్యంకుడు, మాజీ కర్ణాటక మంత్రి కట్ట సుబ్రమణ్యం నాయుడు, ఎమ్మెల్యేలు తలారి ఆదిత్య, సుగుణమ్మ, మేడ మల్లికార్జునరెడ్డి, సత్యప్రభ, జెడ్పీటీసీ చైర్మన్‌ గీర్వాణీ, ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ జూపూడి ప్రభాకర్, ఎమ్మెల్సీలు దొరబాబు, గౌనివారి శ్రీనివాసులు, వైఎస్సార్‌ సీపీ యువ నాయకులు భూమన అభినయరెడ్డి, వైఎస్సార్‌ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు ఆదికేశవులు రెడ్డి, డాక్టర్‌ సుధారాణి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు పులివర్తి నాని, శ్రీధర్‌వర్మ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు చంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రెడ్డివారి రాజశేఖర్‌ రెడ్డి, ఎస్సీవీ నాయుడు, మాజీమంత్రి గల్లా అరుణకుమారి, డీఐజీ ప్రభాకరరావు, కలెక్టర్‌ ప్రద్యుమ్న, చిత్తూరు, తిరుపతి అర్బన్‌ ఎస్పీలు రాజశేఖర్‌బాబు, అభిషేక్‌ మొహంతి, తిరుపతి కార్పొరేషన్‌ కమిషనర్‌ హరికిరణ్, పలువురు నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

విషాద ఛాయలు..
తమ గ్రామానికి రాష్ట్ర వ్యాప్త గుర్తింపును తీసుకురావడమే కాకుండా, జిల్లా అభివృద్ధిలో తనదైన ముద్ర వేసిన ముద్దుకృష్ణమనాయుడు మరణవార్తను వెంకట్రామాపురం వాసులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఊరులో విషాద ఛాయలు నెలకొన్నాయి. పెద్దసంఖ్యలో ప్రజలు తరలివచ్చి ఆయన మృతదేహానికి నివాళులు అర్పించారు.

ఎమ్మెల్సీ మృతికి సంతాపం తెలిపిన నేతలు  
వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హైదరాబాదులోని కేర్‌ ఆస్పత్రిలో ముద్దుకృష్ణమనాయుడి మృతదేహానికి నివాళులర్పించారు. జిల్లాకు ఆయన చేసిన సేవలను కొనియాడారు. ముద్దు కృష్ణమనాయుడు హఠాన్మరణం బాధాకరమని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర‡రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు.  సుధీర్ఘ రాజకీయ అనుభవం కలిగి న జిల్లా నాయకుల్లో ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు ఒకరని నగరి ఎమ్మెల్యే రోజా అన్నారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎమ్మెల్సీగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉందని, ఆయన మృతి జిల్లాకు తీరనిలోటన్నారు. తమ మధ్య ఎప్పుడూ ఆరోగ్యకరమైన పోటీ ఉండేదని మాజీమంత్రి చెంగారెడ్డి అన్నారు. రాష్ట్రం ఓ మంచి నాయకుడిని కోల్పోవడం బాధాకరమని స్థానిక ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. వెంకట్రా మాపురం లో గాలి ముద్దు కృష్ణమనాయుడు పార్థివదేహం వద్ద వైఎస్సార్‌ సీపీ చిత్తూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు జంగాలపల్లె శ్రీనివాసులు బుధవారం అంజలి ఘటించారు.

ముద్దు బాల్యమంతా.. రామగిరిలోని అమ్మమ్మ ఇల్లే..
పిచ్చాటూరు: మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమ నాయుడి బాల్యం మొత్తం పిచ్చాటూరు మండలం రామగిరిలోనే గడిచింది. రామగిరిలో ఆయన అమ్మమ్మ ఇల్లు ఉంది. ప్రస్తుతం అదే ఇంట్లో నివాసం ఉన్న ముద్దు.. బావమరిది వెంకటపతి నాయుడు బుధవారం పలు ఆసక్తికర విషయాలను సాక్షికి వెల్లడించారు. ఈ మేరకు ముద్దు కృష్ణమ నాయుడు తల్లి రాజమ్మది రామగిరి గ్రామం. రామసముద్రం మండలంలోని వెంకటరామాపురానికి చెందిన రామానాయుడితో రాజమ్మ వివాహం జరిగింది. వీరికి ధనంజయులు, జయలక్ష్మి, ముద్దుకృష్ణమ అనే ముగ్గురు సంతానం.

మూడవ సంతానంగా ముద్దుకృష్ణమ నాయుడు జన్మించారు. ఆయనకు మూడేళ్లు వయస్సు ఉండగానే తండ్రి రామానాయుడు మృతి చెందారు. తర్వాత రామగిరికి చేరుకున్న ముద్దు మరో రెండేళ్లకే తల్లి రాజమ్మ మరణించారు. ఇక ముద్దును అమ్మమ్మ రామగిరిలోని ప్రాథమిక పాఠశాలలో ఒకటవ తరగతి చేర్పించింది. 5వ తరగతి పూర్తి చేసుకున్న ముద్దును ఆరవ తరగతి కోసం 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న వెంగళత్తూరు ఉన్న త పాఠశాలలో చేర్పించారు. అక్కడ పదవ తరగతి పూర్తి చేసుకున్న ఆయన 1963లో నాగలాపురం ప్రభుత్వ పాఠశాలలో ఎస్‌ఎస్‌ఎల్‌సీ చేరారు. ఎస్‌ఎస్‌ఎల్‌సీలో స్కూల్‌ ఫస్ట్‌ రావడంతో ముద్దుకృష్ణమ పేరును 1964లో మెరిట్‌ జాబితా లో రాశారు. ఆపై ఉన్నత చదువులకు తిరుపతి వెళ్లారని వెంకటపతి నాయుడు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు