బీజేపీకి ఇక రోజులు దగ్గరపడ్డాయి: మమతా బెనర్జీ

28 Nov, 2019 13:40 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ క్లీన్‌ స్వీప్‌ చేసింది. ఉప ఎన్నికలు జరిగిన మూడు శాసనసభా స్థానాలను తృణమూల్‌ కైవసం చేసుకుంది. రెండు దశాబ్దాల అనంతరం కలియాగంజ్‌ స్థానాన్ని తృణమూల్‌ కాంగ్రెస్‌ దక్కించుకుంది. ఈ ఫలితాలపై తృణమూల్‌ అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హర్షం వ్యక్తం చేశారు.

ఉప ఎన్నికల ఫలితాలు ప్రజా విజయంగా పేర్కొన్న ఆమె... బీజేపీకి ఇక రోజులు దగ్గర పడ్డాయని వ్యాఖ్యానించారు. అహంకారపూరిత రాజకీయాలు పనిచేయవని, అందుకే బీజేపీని ప్రజలు తిరస్కరించారని మమతా విమర్శించారు. ఖరగ్‌ పూర్‌ సదర్‌ నుంచి పోటీ చేసిన తృణమూల్‌ అభ్యర్థి ప్రదీప్‌ సర్కార్‌ 20,811 ఓట్ల తేడాతో గెలుపొందారు. అలాగే కరీంపూర్‌, కలియాగంజ్ నుంచి తృణమూల్‌ అభ్యర్థులు విజయం సాధించారు. మరోవైపు ఉప ఎన్నికల్లో విజయంతో తృణమూల్‌ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.

కాగా పశ్చిమ మిడ్నపూర్‌ జిల్లాలోని  ఖరగ్ పూర్ సదర్, కరీంపూర్ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు దిలీప్ ఘోష్, మహువా మొయిత్రా లోక్ సభకు ఎన్నిక కావడం, ఉత్తర్‌ దినాజ్‌పూర్‌లోని కలియాగంజ్ నియోజకవర్గ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ప్రమథనాథ్‌ రాయ్‌ ఈ ఏడాది మే 31న మరణించడంతో ఆయా స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఏడాది మే నెలలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు