వివాదాస్పద బిల్లుపై తృణమూల్‌ ఎంపీలకు విప్‌ జారీ

7 Dec, 2019 13:03 IST|Sakshi
టీఎంసీ జాతీయ అధికార ప్రతినిధి డెరెక్‌ ఓబ్రియన్‌

సాక్షి, ఢిల్లీ : కేంద్రలోని బీజేపీ ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టబోతున్న పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ తన ఎంపీలకు విప్‌ జారీ చేసింది. ఈ బిల్లు సోమవారం పార్లమెంటు ముందుకు వచ్చే అవకాశముందని, ఈ నేపథ్యంలో సోమవారం నుంచి గురువారం వరకు పార్టీకి చెందిన ఉభయ సభల సభ్యులందరూ తప్పనిసరిగా సమావేశాలకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ విషయంపై ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి డెరెక్‌ ఓబ్రియన్‌ మాట్లాడుతూ.. భారత స్పూర్తికి విరుద్ధమైన ఈ బిల్లును మేం వ్యతిరేకిస్తున్నామని శుక్రవారం స్పష్టం చేశారు. నాలుగు నెలల క్రితం ఉమ్మడి పౌర స్మృతి విషయంలో అధికార పార్టీ వారు ఒకే దేశం, ఒకే చట్టం అని ఊదరగొట్టారని, కానీ ఇప్పుడు విభజన రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ శుక్రవారం కోలకతాలో పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. పౌరసత్వ బిల్లు, జాతీయ పౌర పట్టిక (ఎన్నార్సీ) రెండూ ఒకే నాణేనికి ఉన్న బొమ్మా, బొరుసు లాంటివని వ్యాఖ్యానించారు. పౌరసత్వం అందరికీ ఇస్తానంటే తమకు అభ్యంతరం లేదని, కానీ మతం ఆధారంగా పౌరసత్వం కల్పిస్తామంటే ఖచ్చితంగా వ్యతిరేకిస్తామని వెల్లడించారు.

పడిపోతున్న ఆర్థిక వ్యవస్థ నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే బీజేపీ ఈ బిల్లును ముందుకు తెచ్చిందని విమర్శించారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఉన్న 12 ప్రతిపక్ష పార్టీలను కలిసి ఏం చేయాలనే దానిపై అందరం ఒక నిర్ణయానికి వస్తామన్నారు. కాగా, ఆఫ్ఘనిస్తాన్‌, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌లలో మతపర వేధింపులకు గురువుతున్న ముస్లిమేతర వర్గాల వారికి భారత పౌరసత్వ అవకాశం కల్పిస్తూ కేంద్ర కేబినెట్‌ బుధవారం పౌరసత్వ సవరణ బిల్లు- 2019ను ఆమోదించిన విషయం తెలిసిందే. అయితే మత పరమైన వివక్షకు గురవుతున్న ముస్లింలలోని అల్పసంఖ్యాక వర్గాలైన షియా, అహ్మదీయ వర్గాలకు కూడా ఈ సదుపాయం కల్పించాలనే డిమాండ్‌తో ప్రతిపక్షాలు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాయి. మరోవైపు ఎన్నార్సీని కూడా పలు పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఎన్నార్సీని అమలుచేయనీయమని ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేయగా, పశ్చిమ బెంగాల్లో కూడా కుదరదని మమతా బెనర్జీ ఎప్పటినుంచో చెప్తోంది. అయితే ఇటీవల జరిగిన జార్ఖండ్‌ ఎన్నికల్లో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా మాట్లాడుతూ.. 2024 లోగాదేశ వ్యాప్తంగా ఎన్నార్సీని ఖచ్చితంగా అమలు చేస్తామని ప్రకటించారు. దీంతో అటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య, ఇటు జాతీయ, ప్రాంతీయ పార్టీల మధ్య పరిస్థితి నువ్వా, నేనా అన్నట్టు కొనసాగుతోంది. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా