చర్చకు నోచుకోని ‘ట్రిపుల్‌ తలాక్‌’

1 Jan, 2019 04:37 IST|Sakshi
రాజ్యసభలో మాట్లాడుతున్నఆజాద్‌

రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టిన న్యాయ మంత్రి

బెట్టువీడని విపక్షాలు

ప్రతిష్టంభనతో సభ వాయిదా

న్యూఢిల్లీ: ఊహించినట్లుగానే విపక్షాలు పట్టు విడవకపోవడంతో ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుపై రాజ్యసభలో చర్చ ప్రారంభం కాలేదు.  బిల్లును జాయింట్‌ సెలక్ట్‌ కమిటీకి పంపాలన్న తమ డిమాండ్‌ను ప్రతిపక్షాలు పునరుద్ఘాటించాయి. సోమవారం న్యాయ శాఖ మంత్రి రవిశంకర్‌ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. దీనిపై చర్చ జరగాలని ప్రభుత్వం కోరినా, విపక్షాలు సహకరించకపోవడంతో కార్యకలాపాలు జరగకుండానే సభ వాయిదా పడింది. అంతకుముందు కావేరి నదీ జలాల పంపిణీ వివాదంపై ఏఐఏడీఎంకే ఎంపీలు నిరసనకు దిగడంతో సభ వాయిదా పడింది. ట్రిపుల్‌ తలాక్‌ బిల్లును ప్రవేశపెట్టాక మరో 15 నిమిషాలు అంతరాయం ఏర్పడింది. తర్వాతా పరిస్థితి మారకపోవడంతో డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌ సభను బుధవారానికి వాయిదా వేశారు. తక్షణ ట్రిపుల్‌ తలాక్‌ను నేరంగా పరిగణిస్తూ రూపొందించిన తాజా బిల్లు గురువారం లోక్‌సభలో ఆమోదం పొందింది.

సంప్రదాయాన్ని ఉల్లంఘిస్తున్న కేంద్రం
రాజ్యసభలో కాంగ్రెస్‌ పక్ష నేత గులాం నబీ ఆజాద్‌ మాట్లాడుతూ..బిల్లు తాజా రూపం చాలా క్రూరంగా ఉందని, దాన్ని మరింత అధ్యయనం చేసేందుకు జాయింట్‌ సెలక్ట్‌ కమిటీకి పంపాలని సగం కన్నా ఎక్కువ మంది ఎంపీలు డిమాండ్‌ చేస్తున్నారని అన్నారు. ఏదైనా బిల్లును చట్టం చేసే ముందు జాయింట్‌ సెలక్ట్‌ కమిటీకి పంపాలన్న సంప్రదాయాన్ని ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి విజయ్‌ గోయల్‌ స్పందిస్తూ.. బిల్లుపై చర్చకు ప్రభుత్వం సిద్ధమేనని, అది ఆమోదం పొందడంలో కాంగ్రెస్‌ అడ్డంకులు సృష్టిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వమే ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుపై రాజకీయాలు చేస్తోందని మరో కాంగ్రెస్‌ నాయకుడు ఆనంద్‌ శర్మ తిప్పికొట్టారు. ఆర్డినెన్స్‌ తెచ్చినా కూడా ఈరోజు వరకు ట్రిపుల్‌ తలాక్‌ కేసులు నమోదయ్యాయని, లింగ సమానత్వంతో ముడిపడిన ఈ బిల్లుపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని న్యాయ మంత్రి రవిశంకర్‌  అన్నారు.

రఫేల్‌పై చర్చకు సిద్ధం: ఖర్గే
రఫేల్‌ ఒప్పందంపై లోక్‌సభలో చర్చకు రావాలన్న కేంద్ర ప్రభుత్వ సవాలును కాంగ్రెస్‌ స్వీకరించింది. జనవరి 2న చర్చలో పాల్గొంటామని, సమయాన్ని నిర్ణయించాలని లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్ష నేత మల్లికార్జున ఖర్గే స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ను కోరారు. రఫేల్‌ ఒప్పందంపై సంయుక్త పార్లమెంట్‌ కమిటీతో విచారణ జరిపించాలని పునరుద్ఘాటించారు. దీనికి ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ స్పందిస్తూ..ఈ అంశంపై ఖర్గే చర్చను ప్రారంభించాలని, బదులిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. కానీ ఖర్గే చర్చ నుంచి పారిపోతున్నారని అన్నారు.

కొత్త ఏడాది నుంచి వెల్‌లోకి రాకండి
కొత్త ఏడాది నుంచైనా సభ్యులు నిబంధనల మేరకు నడుచుకోవాలని, వెల్‌లోకి దూసుకురావద్దని లోక్‌సభ స్పీకర్‌ సుమిత్ర  విజ్ఞప్తి చేశారు. రఫేల్‌పై కాంగ్రెస్, కావేరిపై ఏఐఏడీఎంకే సభ్యులు ఆందోళనకు దిగిన సమయంలో ఆమె స్పందిస్తూ..వారంతా తన కోసమైనా మీమీ స్థానాల్లోకి వెళ్లాలన్నారు. ఆమె మాటను గౌరవిస్తూ రెండు పార్టీల సభ్యులు వెనక్కువెళ్లారు. ‘ ఈ ఏడాదిలో ఇదే ఆఖరి రోజు. మీరు వెల్‌లోకి వచ్చిన ఆఖరి రోజు కూడా ఇదే కావాలని కోరుకుంటున్నా’ అని సుమిత్రా అన్న మాటల్ని సభ్యులంతా ఓపికగా వినడం గమనార్హం.

మరిన్ని వార్తలు