రాజ్యసభకు ‘ట్రిపుల్‌ తలాక్’‌.. అందరికళ్లూ కాంగ్రెస్‌పైనే!

2 Jan, 2018 09:17 IST|Sakshi
రాజ్యసభ(ఫైల్‌ ఫొటో)

మిగతా విపక్షాలతో కలిసి ‘నో’ చెబుతారా? లేక సొంతగా ‘మార్పులు’ సూచిస్తారా?

నేడు పెద్దల సభకు  బిల్లు.. బీజేపీ ఎంపీలకు విప్‌ జారీ

సాక్షి, న్యూఢిల్లీ : తీవ్రచర్చనీయాంశమైన ట్రిపుల్‌ తలాక్‌ బిల్లు నేడు రాజ్యసభకు రానుంది. బీజేపీకి భారీ మెజారిటీ ఉన్న లోక్‌సభలో తలాక్‌ బిల్లుకు సులువుగా ఆమోదం లభించిన సంగతి తెలిసిందే. అయితే రాజ్యసభలో మాత్రం విపక్షాలదే మెజారిటీ కావడంతో తలాక్‌కు ఆమోదం లభిస్తుందా, లేదా అనేదానిపై ఉత్కంఠనెలకొంది. కాంగ్రెస్‌ నేతృత్వంలో అన్ని విపక్ష పార్టీలు ఏకమైతే తలాక్‌ బిల్లు వీగిపోయే అవకాశాలే ఎక్కువ. తలాక్‌ బిల్లు విషయంలో రాజ్యసభలో అనుసరించాల్సిన విధానంపై కాంగ్రెస్‌, సీపీఎం, ఇతర పక్షాల మధ్య చర్చలు నడిచాయి కానీ ఉమ్మడి నిర్ణయం ఉంటుందని మాత్రం ఇంకా ప్రకటన వెలువడలేదు.

అందరికళ్లూ కాంగ్రెస్‌పైనే : మిగతా పక్షాలతో సంబంధం లేకుండా కాంగ్రెస్‌ సొంతగా బిల్లులో కొన్ని మార్పులను సూచించే అవకాశాలున్నట్లు తెలిసింది. మార్పులకు ప్రభుత్వం అంగీకరించని పక్షంలో ‘సెలెక్ట్‌ కమిటీ’  ని వేయాలని డిమాండ్‌ను తెరపైకి తేనున్నట్లు సమాచారం. వివాహలకు సంబంధించినవి సివిల్‌ వివాదాలుకాగా.. బీజేపీ తీసుకొచ్చిన బిల్లుతో వాటిని క్రిమినల్‌ వివాదాలుగా మార్చేసిందన్న సీపీఎం వాదనతో ఏకీభవిస్తున్నట్లు కాంగ్రెస్‌ గతంలోనే ప్రకటించింది. ఈ నేపథ్యంలో నేడు రాజ్యసభలో కాంగ్రస్‌ తీసుకోబోయే నిర్ణయం ఆసక్తికరంగా మారింది.

బీజేపీ ఎంపీలకు విప్‌ జారీ : మూడురోజుల సెలవుల తర్వాత మంగళవారం పార్లమెంట్‌ సమావేశాలు పునఃప్రారంభంకానున్నాయి. ట్రిపుల్‌ తలాక్‌తోపాటు మరికొన్ని కీలక బిల్లులు కూడా నేడు, రేపు ఉభయసభల్లో ప్రవేశపెట్టనున్నారు. దీంతో జనవరి 2, 3 తేదీల్లో సమావేశాలకు తప్పనిసరిగా హాజరుకావాలంటూ బీజేపీ తన సభ్యులకు విప్‌ జారీచేసింది. రేపు(బుధవారం) ఉదయం బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీ జరగనుంది.

>
మరిన్ని వార్తలు