నాడు తృణమూల్‌....నేడు బీజేపీ

3 Mar, 2018 19:45 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రానికి 2011లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 34 ఏళ్ల సీపీఎం ఎదురులేని పాలనకు చరమగీతం పాడుతూ తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎలాగైతే అఖండ విజయం సాధించిందో ఈ రోజున అదే మార్క్సిస్టుల కంచుకోటను బద్దలుగొట్టి త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అఖండ విజయం సాధించింది. తద్వారా  రాష్ట్ర రాజధాని అగర్తలా లాంటి నగరాల్లో బెంగాలీలు ఎక్కువగా ఉండడంతో త్రిపురలోకి పార్టీని విస్తరించాలనుకున్న తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత మమతా బెనర్జీ ఆశలను కూడా గండికొట్టింది.  ఇది బీజేపీకి ఎంతటి సైద్ధాంతిక విజయమో, సీపీఎం పార్టీకీ అంతే సైద్ధాంతిక పరాజయం కూడా. దేశంలోనే అత్యంత పేద ముఖ్యమంత్రిగా, నిజాయితీపరుడైన నేతగా 20 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా కొనసాగిన మాణిక్‌ సర్కార్‌ ప్రభుత్వాన్ని ఓడించడం మాటలు కాదు.

ఇందులో భారతీయ జనతా పార్టీ సాగించిన విస్తత ఎన్నికల ప్రచారంతోపాటు సీపీఎం ప్రభుత్వం అపజయాలు అన్నే ఉన్నాయి. ఇదివరకే అస్సాం, మణిపూర్, మేఘాలయ రాష్ట్రాలో కాషాయ జెండాను ఎగురవేసిన భారతీయ జనతా పార్టీ రెట్టించిన ఉత్సాహంతో ఎలాగైన సీపీఎంను ఓడించాలనే రాజకీయ సైద్ధాంతిక కసితో 2017, మార్చి నుంచే త్రిపురలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా సహా పలువురు పార్టీ జాతీయ నాయకులు పలుసార్లు చిన్న రాష్ట్రమైన త్రిపురలో ఉధృతంగా ప్రచారం సాగించారు.

బీజీపీలో సంఘ్‌ పరివార్‌లో భాగమైన ఆరెస్సెస్‌ ఎన్నికల విజయానికి క్షేత్రస్థాయిలో అవసరమైన రంగాన్ని ముందుగానే సిద్ధం చేసి ఉంచింది. బీజేపీ రంగప్రవేశం చేసి రాష్ట్రంలో గిరిజనులు, గిరిజనేతరుల మధ్యనున్న సామాజిక విభేదాలను సొమ్ము చేసుకునేందుకు తీవ్రంగా కృషి చేసింది. రాష్ట్రం అభివద్ధి చెందాలంటే అది కేంద్రంలో అధికారంలో ఉన్న తమ పార్టీ ప్రభుత్వం వల్లనే అవుతుందని ప్రజలకు ఆశ చూపించింది. 1980, 1990 దశకంలో అంతర్గత సంఘర్షణల నుంచి రాష్ట్రాన్ని వెలుపలికి తీసుకరావడంలో, అత్యంత వివాదాస్పదంగా తయారైన ‘సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టం’ను త్రిపుర రాష్ట్రం నుంచి ఉపసంహరించడంలో విజయం సాధించినందున మాణిక్‌ సర్కార్‌ తిరుగులేని నాయకుడిగా ఇంతకాలం రాష్ట్రంలో కీలక పాత్ర పోషించారు.

అయితే సర్కార్‌ ప్రభుత్వం అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయింది. సర్కార్‌ ప్రభుత్వం నియామకాలు చెల్లవంటూ సుప్రీం కోర్టు తీర్పు చెప్పడంతో కొన్ని వేల మంది టీచర్లు రోడ్డున పడ్డారు. అవినీతి జరిగిందన్న కారణంగానే ఆ నియామకాలను కోర్టు కొట్టివేసింది. రోజ్‌ఫండ్‌ చిట్‌ఫండ్‌ కుంభకోణం బెంగాల్‌ నుంచి త్రిపుర వరకు వ్యాపించింది. ఇందులో పెట్టుబడులు పెట్టిన వేలాది సామాన్యులు నష్టపోయారు. దేశంలోనే అత్యధికంగా నిరుద్యోగులు త్రిపురలో ఉన్నారు. ఈ సమస్యను ఎదుర్కోవడంలో కూడా సీపీఎం ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. రాష్ట్రంలో ఆర్థిక అభివృద్ధిని సాధించి చూపిస్తామని, యువతకు తప్పకుండా ఉద్యోగాలిస్తామంటూ బీజేపీ చేసిన ప్రచారానికి యువత మొగ్గు చూపింది.

‘స్వయంప్రతిపత్తి కలిగిన జిల్లా మండలి’ పరిధిలోని ప్రాంతాల్లో గిరిజన తెగల్లో ప్రభుత్వం పట్ల పెరుగుతున్న వ్యతిరేకతను కూడా మాణిక్‌ సర్కార్‌ పట్టించుకోలేదు. తరచూ బంగ్లాదేశ్‌ నుంచి అక్రమంగా వలసవచ్చిన వారుగా ముద్రకు గురవుతున్న బెంగాలీ భాష మాట్లాడే ప్రజలు, తామే ఆదిమ జాతిగా చెప్పుకునే గిరిజనుల మధ్య జరుగుతున్న గొడవలనూ ఆయన పట్టించుకోలేదు. దాంతో 2013 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 0.46 శాతం ఓట్లు సాధించి ఒక్క సీటులో కూడా గెలవని ‘త్రిపుర పీపుల్స్‌ ఫ్రంట్‌’  ఈసారి ఏకంగా తొమ్మిది సీట్లకు పోటీ చేసి ఎనిమిది సీట్లను గెలుచుకుంది. మాణిక్‌ సర్కార్‌ ప్రభుత్వం గిరిజనులకు వ్యతిరేకమని, బెంగాలీ మాట్లాడే ప్రజల పక్షమని ప్రచారం ద్వారా నమ్మించడంలో కూడా బీజేపీ విజయం సాధించింది. తద్వారా గిరిజనులను ఆకట్టుకుంది.

పేదల పక్ష పార్టీకి చెప్పుకునే సీపీఎం ప్రభుత్వం పేదలైన గిరిజనుల కోసం ఏమీ చేయలేకపోయిందన్న భావం వారిలో ఎక్కువగా ఈసారి కనిపించింది. అందుకని త్రిపుర ప్రజలు బీజేపీని గెలిపించారనడం ఎంత సమంజసమో, సీపీఎంను ఓడించారనడం కూడా అంతే సమంజసం.

(సాక్షి వెబ్‌ ప్రత్యేక కథనం)

మరిన్ని వార్తలు