లోక్‌సభలో కొనసాగిన టీఆర్‌ఎస్‌ ఆందోళన

24 Mar, 2018 02:22 IST|Sakshi

కావేరి నది బోర్డుపై ఏఐడీఎంకే ఎంపీలు కూడా.. 

సాక్షి, న్యూఢిల్లీ: రిజర్వేషన్ల పెంపు అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకే కల్పించాలని డిమాండ్‌ చేస్తూ లోక్‌సభలో టీఆర్‌ఎస్‌ ఎంపీలు చేస్తున్న ఆందోళన శుక్రవారం కూడా కొనసాగింది. సభ ప్రారంభమైనప్పటి నుంచి పార్టీ ఎంపీలు జితేందర్‌రెడ్డి, వినోద్‌కుమార్, కొండా విశ్వేశ్వరరెడ్డి, బూర నరసయ్య గౌడ్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, జి.నగేష్, బీబీ పాటిల్, పసునూరి దయాకర్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మల్లారెడ్డి తదితరులు వెల్‌లో నిలబడి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఏఐడీఎంకే సభ్యులు కూడా కావేరి నది బోర్డు ఏర్పాటుపై తమ ఆందోళనను కొనసాగించారు. దీంతో స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ సభను 12 గంటలకు వాయిదా వేశారు. సభ ప్రారంభమైన అనంతరం కూడా టీఆర్‌ఎస్, ఏఐడీఎంకే సభ్యుల ఆందోళన కొనసాగడంతో స్పీకర్‌ సభను మంగళవారానికి వాయిదా వేశారు.

శ్రీరామ నవమి సందర్భంగా సభ్యుల విజ్ఞప్తి మేరకు సోమవారం కూడా సెలవు ఇస్తున్నట్టు స్పీకర్‌ ప్రకటించారు. లోక్‌సభ వాయిదా పడిన అనంతరం టీఆర్‌ఎస్‌ ఎంపీ సీతారాం నాయక్‌ మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి తమ పార్టీ ఎంపీలు ఆందోళన చేస్తున్నా కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. రిజర్వేషన్ల పెంపుపై కేంద్ర ప్రభుత్వం ఒక స్పష్టమైన ప్రకటన చేసేంత వరకు తమ నిరసన విరమించబోమని ఆయన స్పష్టం చేశారు. కేంద్రంపై వైఎస్సార్‌ సీపీ, తెలుగుదేశం పార్టీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాలపై చర్చకు తమ నిరసన అడ్డుకాదని, అవిశ్వాసంపై స్పీకర్‌ చర్చకు అనుమతిస్తే అందులో పాల్గొనేందుకు తామూ సిద్ధంగా ఉన్నామని నాయక్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు