నువ్వా? నేనా?

26 Mar, 2019 07:37 IST|Sakshi

చేవెళ్లలో టీఆర్‌ఎస్‌–కాంగ్రెస్‌ మధ్య ‘టఫ్‌ ఫైట్‌’

సమస్యల పరిష్కార నినాదంతో కాంగ్రెస్‌

అభివృద్ధి మంత్రంతో జనంలోకి టీఆర్‌ఎస్‌

బీజేపీకీ చెప్పుకోదగ్గ స్థాయిలో ఓటుబ్యాంక్‌

సాగునీటి కోసం తహతహలాడే పల్లెలు, ఆధునికత మేళవించిన పట్టణ ప్రాంతాలు కలిగిన చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గంలో పాగా వేసేందుకు ప్రధాన పార్టీలు ఉవ్విళ్లూరుతున్నాయి. ఒకవైపు రైతులు, రైతు కూలీలు.. మరోవైపు కార్మికులు, ఉద్యోగులతో కూడిన ఈ నియోజకవర్గంలోని ఓటర్లు ఒకసారి కాంగ్రెస్‌ పార్టీకి పట్టం కడితే మరోసారి టీఆర్‌ఎస్‌కు విజయాన్ని చేకూర్చారు. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఏర్పడిన ఈ నియోజకవర్గంలో 2009లో మొదటిసారి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ఎస్‌.జైపాల్‌రెడ్డి.. 2014లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి విజయం సాధించారు. టీఆర్‌ఎస్‌తో పొసగక పార్టీ మారిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఇపుడు కాంగ్రెస్‌ పార్టీ తరపున బరిలో దిగగా, టీఆర్‌ఎస్‌ నుంచి వ్యాపారవేత్త గడ్డం రంజిత్‌రెడ్డి పోటీనిస్తున్నారు. సమస్యల పరిష్కారమే ఎజెండాగా కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి దూసుకెళ్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలే ఊతంగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ముందుకెళ్తున్నారు. ఇద్దరూ పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. మరోవైపు బీజేపీ తనవంతు ప్రయత్నాన్ని ప్రారంభించింది. ఆ పార్టీ అభ్యర్థి బెక్కరి జనార్ధన్‌రెడ్డి ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు కలిగిన చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గంలో ప్రధాన పార్టీ అభ్యర్థుల మధ్యే టఫ్‌ ఫైట్‌ నెలకొంది. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ ఈ నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో రాజకీయ పరిస్థితులను పరిశీలించింది. గ్రౌండ్‌ రిపోర్టు - చింతకింది గణేశ్‌

ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు కలిగిన చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గంలో 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు స్థానాల్లో టీఆర్‌ఎస్‌.. రెండుచోట్ల కాంగ్రెస్‌ గెలిచింది. అందులో మహేశ్వరం నుంచి గెలిచిన సబితా ఇంద్రారెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్టు ప్రకటించారు. దీంతో ఆరు స్థానాలు టీఆర్‌ఎస్‌వే కానున్నాయి. మరోవైపు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు దాదాపు 1.40 లక్షల మెజారిటీ వచ్చింది. ఈ పరిస్థితుల్లో దీంతో గెలుపుపై ధీమాతో టీఆర్‌ఎస్‌ ఉండగా, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి మాత్రం తనకున్న పేరు, చేపట్టిన కార్యక్రమాలు, చేస్తున్న పోరాటాలే తనను గెలిపిస్తాయన్న ధీమాతో ఉన్నారు.

నియోజకవర్గాల వారీగా బలాబలాలిలా..
చేవెళ్ల: కాంగ్రెస్‌కు పెట్టని కోట. ఈ అసెంబ్లీ సెగ్మెంట్‌ నుంచి మాజీ హోం మంత్రి పటోళ్ల ఇంద్రారెడ్డిని కాంగ్రెస్‌ పార్టీ తరపున నాలుగుసార్లు గెలిపించిన ఇక్కడి ఓటర్లు ఆయన మరణాంతరం ఇంద్రారెడ్డి భార్య సబిత ఇంద్రారెడ్డిని గెలిపించారు. నియోజకవర్గాల పునర్విభజనలో ఇది ఎస్సీ రిజర్వు అయ్యింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలుపొందారు. గత మూడు ఎన్నికల్లో ఒక్కో పార్టీకి ఒక్కో అవకాశం దక్కింది. మొన్నటి పంచాయతీ ఎన్నికల్లో ఎక్కువ మంది సర్పంచులు కాంగ్రెస్‌ పార్టీ మద్దతుదారులే గెలిచినా, వీరిలో పలువురు టీఆర్‌ఎస్‌లోకి మారారు. ఈ పరిస్థితుల్లో ఈ సెగ్మెంట్‌ ఓటు మొగ్గెటు ఉంటుందోనన్నది ఆసక్తిగా మారింది.

పరిగి: 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసిన మహేశ్‌రెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థి రామోహ్మన్‌రెడ్డిపై గెలుపొందారు. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఒకసారి ఒక పార్టీకి మరోసారి ఇంకో పార్టీకి పట్టం కట్టడంతో ఇక్కడి ఓటర్లు లోక్‌సభ ఎన్నికల్లో ఎవరి వైపు మొగ్గు చూపిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఓటర్లు ఏ పార్టీవైపు మొగ్గు చూపినా కొద్దిపాటి ఓట్ల తేడానే ఉండనుంది.
వికారాబాద్‌: టీఆర్‌ఎస్‌కు పట్టున్న వికారాబాద్‌లో లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఓటర్లు టీఆర్‌ఎస్‌ వైపే మొగ్గు చూపే అవకాశాలున్నాయి. 2009 అసెంబ్లీలో ఒకసారి కాంగ్రెస్‌ అభ్యర్థి ప్రసాద్‌ కుమార్‌ను గెలిపించిన ఒక్కడి ఓటర్లు ఆ తరువాత 2014, 2018లో జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులనే గెలిపించారు.  

తాండూరు: తాండూరు ఓటర్లు ఈ లోక్‌సభ ఎన్నికల్లోనూ భిన్నంగా స్పందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో ఒకసారి టీడీపీ నుంచి, మరోసారి టీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. ఆయనకు టీఆర్‌ఎస్‌ పార్టీ ఎంపీ టికెట్‌ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో పార్టీ అభ్యర్థికి నియోజకవర్గంలో ఎంతమేరకు ఓట్లు పడతాయన్న విషయంలో స్పష్టత లేదు. పైగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి పూర్తి స్థాయిలో ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి కోసం పని చేస్తున్నారు.

మహేశ్వరం: గడిచిన మూడు అసెంబ్లీ ఎన్నికల్లో చూస్తే ఈ నియోజకవర్గంలో రెండుసార్లు కాంగ్రెస్‌ పార్టీని గెలిపించిన ఓటర్లు ఒకసారి టీడీపీ అభ్యర్థిని గెలిపించారు. తాజాగా 2018లో కాంగ్రెస్‌ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డిని గెలిపించారు. తాజాగా ఆమె టీఆర్‌ఎస్‌లో చేరికకు ఓకే చెప్పారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్‌ పట్టున్న ఈ నియోజకవర్గంలో ఓటర్లు లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌వైపు మొగ్గు చూపుతారా? కాంగ్రెస్‌ పార్టీకే వేస్తారా? అన్నది సస్పెన్స్‌.

రాజేంద్రనగర్‌: మొదట్లో టీడీపీకి పట్టున్న ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం సీన్‌ మారిపోయింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు టీఆర్‌ఎస్‌ వైపు మొగ్గు చూపారు. ప్రకాష్‌గౌడ్‌ను అత్యధిక మెజారిటీతో గెలిపించారు. ప్రస్తుతం జరుగబోతున్న లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. పార్టీ పరంగా టీఆర్‌ఎస్‌కు కొంత అనుకూలత ఉన్నా అభ్యర్థి విషయంలో కాంగ్రెస్‌ పార్టీ వైపే మొగ్గుచూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

శేరిలింగంపల్లి: సెటిలర్ల ఓట్లు అత్యధికంగా ఉన్న ఈ నియోజవర్గంలో లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కే అనుకూలంగా ఉండే పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుత ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరపున అధిక మెజారిటీ సాధించారు. కేడర్‌ ఆయన వెన్నంటి ఉంది. దీంతో ఇక్కడ కొంత టీఆర్‌ఎస్‌కే అనుకూల వాతావరణం కనిపిస్తోంది.

ఇమేజ్‌పైనే నమ్మకం..
అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు స్థానాలకే పరిమితమైనా, పార్టీకి ఉన్న కేడర్, తనకున్న ఇమేజ్‌ తనను గెలిపిస్తాయన్న ధీమాతో ఉన్నారు కాంగ్రెస్‌ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి. ప్రధానంగా నియోజకవర్గంలో తమ కుటుంబానికి ఉన్న పేరు, కొండా వెంకట రంగారెడ్డి మనవడిగా తాము చేపడుతున్న కార్యక్రమాలు తనను గెలిపిస్తాయన్న నమ్మకంతో ఉన్నారు. ఈ ఎన్నికల్లో విజయం కోసం కేవీఆర్‌ ట్రస్టు వంటి సంస్థల ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో ప్రచారం ప్రారంభించారు. ప్రతి గ్రామంలో ప్రభావం చూపించే కొంతమందిని ఎంపిక చేసుకొని ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. తటస్థ సర్పంచ్‌లకు ఎంపీ కోటా నిధుల పేరుతో గాలం వేస్తూ అక్కున చేర్చుకుంటున్నారు. జోన్‌ మార్పు, సాగునీటి సమస్యల విషయంలో ప్రభుత్వ వైఫల్యాలే తనను గెలిపిస్తాయని ఆయన చెబుతున్నారు.

 ఏం చేశానో చూసి ఓటెయ్యండి– కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థి
ఈ ఐదేళ్లలో ఏం చేశానో చూసి ఓటెయ్యమని ప్రజలను అడుగుతున్నా. మంత్రులు, ఎమ్మెల్యేలు కాదు.. పునాదిలాంటి కార్యకర్తలు మాతో ఉన్నారు. వారే నాకు బలం. అందుకే టీఆర్‌ఎస్‌ తరచూకార్యకర్తలను మార్చుకుంది. మాజీ మంత్రిప్రచారం ప్రారంభించారు. ఆయన్నే విత్‌డ్రాచేసుకున్నారు. చివరకు నన్ను ఎదుర్కొనే వారు ఇక్కడ ఎవరూ లేక బయటి నుంచి తీసుకొచ్చారు. వారు పవర్‌ ఉపయోగించాలని చూస్తున్నారు. కానీ నాకు ప్రజా సమస్య ల పరిష్కారమే ముఖ్యం. తాండూరు, షాబాద్‌ రాళ్లపై ఉన్న జీఎస్‌టీ 4 నుంచి 28 శాతానికి పెరిగి తే, దానిని 18 శాతానికి తగ్గించా. ఆపై మళ్లీ 12 శాతానికి తగ్గించా. ఇంకా4 శాతానికి తేవాలి. కందిబోర్డు, జీవో 111 రద్దు కోసం కోసం పోరాటం చేశా. సీఎంకు మూడుసార్లు లేఖలు ఇచ్చాను. పాలమూరు రంగారెడ్డి విషయంలో సీఎంతో మాట్లాడాను. కానీ మంత్రిఒకసారి కూడా చొరవ తీసుకోలేదు. సాగునీటి ప్రాజెక్టుల కోసం పోరాటం చేశా. ఇకపైనా చేస్తా. యువత ఉపాధికి చర్యలు చేపట్టా.  గ్రామాలఅభివృద్ధికి నిధులు ఇచ్చా.

సంక్షేమమే సగం బలం
చేవెళ్ల లోక్‌సభ స్థానంలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో టీఆర్‌ఎస్‌కు ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్యేలు ఉండటం, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలే తమకు అసలైన బలమన్న ధీమాతో టీఆర్‌ఎస్‌ ఉంది. కాంగ్రెస్‌ పార్టీ తరపున మహేశ్వరం నుంచి గెలుపొందిన సబితా ఇంద్రారెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్ధం కావడం తమకు మరింతగా కలిసొచ్చే అంశంగా టీఆర్‌ఎస్‌ భావిస్తోంది. 2014 ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌కు రెండు స్థానాలే ఉన్నప్పటికీ ఎంపీగా తమ పార్టీ అభ్యర్థే గెలుపొందడం, సంస్థాగతంగా బలంగా ఉండడం, గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు ఇతర పార్టీలకు చెందిన నేతలు ఇప్పటికే టీఆర్‌ఎస్‌లో చేరడంతో ఆ పార్టీ గెలుపు ధీమాలో ఉంది. అభ్యర్థి కంటే పార్టీనే ప్రధానమని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామన్న హామీలతో రంజిత్‌రెడ్డి ప్రచారం చేపట్టారు. తమ అభ్యర్థి స్థానికేతరుడైనా ప్రజలు టీఆర్‌ఎస్‌ను, కేసీఆర్‌ అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలను చూసే ఓట్లు వేస్తారన్న ధీమాతో టీఆర్‌ఎస్‌ ఉంది.

అందుబాటులో ఉంటా.. అభివృద్ధి చేస్తా– గడ్డం రంజిత్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి
అభివృద్ధి, అందుబాటులో ఉండటం మాప్రచార నినాదం. సీఎం కేసీఆర్‌ మార్గదర్శకంలో చేవెళ్ల ప్రాంత అభివృద్ధి కోసం పని చేస్తా. ఇది వైవిధ్యమైన నియోజకవర్గం. దీంట్లోని నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లు గ్రామీణ ప్రాంతం. మరో మూడు పూర్తిగా నగరం. గ్రామీణ ప్రాంతంలోని 111 జీవో అంశాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తా. జోగులాంబ జోన్‌ నుంచి చార్మినార్‌ జోన్‌లోకి మార్చడం, గండిపేట, అనంతగిరి ప్రాంతాలు పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి, పాలమూరు ప్రాజెక్టుతో ఈ ప్రాంతానికి సాగునీటి సరఫరా, కంది పరిశోధన బోర్డు ఏర్పాటు, పరిశ్రమల జోన్, ఐటీ పార్కు నా ప్రాధాన్యతలు. నగర ప్రాంతంగా ఉండే అసెంబ్లీ సెగ్మెంట్లను కాలుష్యంలేని నివాసయోగ్య ప్రాంతంగాఅభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తా. మూసీనది ప్రక్షాళన, మౌలిక వసతుల అభివృద్ధికికృషి చేస్తా.

బీజేపీ పరిస్ధితి
బీజేపీకి కొంత పట్టున్న ప్రాంతాలు చేవెళ్లలో ఉన్నాయి. ముఖ్యంగా మహేశ్వరం, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌లో ఆ పార్టీకి ఓటుబ్యాంకు ఉంది. చేవెళ్ల, పరిగి, తాండూరు, వికారాబాద్‌లోనూ బీజేపీకి యువ ఓటర్లు ఉన్నారు. ఈ నియోజకవర్గం ఏర్పడ్డాక 2009లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసిన బద్దం బాల్‌రెడ్డి 1,12,701 సాధించారు. 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన అభ్యర్థి టి.వీరేందర్‌గౌడ్‌కు 3,53,203 ఓట్లు లభించాయి. ఈ పరిస్థితుల్లో తనకంటూ ఓటుబ్యాంకు కలిగిన బీజేపీ.. తమ అభ్యర్థి గట్టిపోటీ ఇస్తారని భావిస్తోంది.

మరోసారి మోదీ కోసం..  బెక్కరి జనార్ధన్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థి
కేంద్రంలో మరోసారి నరేంద్రమోదీని ప్రధానిని చేసేందుకు బీజేపీ అభ్యర్థులను గెలిపించాలి. ప్రస్తుతం జాతీయ భావన ముఖ్యం. దేశ ప్రజలు గౌరవంగా తలెత్తుకొని జీవించేలా చేయడం మోదీ వల్లే సాధ్యం. రైతులు, పేదల కోసం కేంద్రం అనేక సంక్షేమ పథకాలు చేపట్టింది. రాష్ట్రం నుంచి గతంలో ఒక్క ఎంపీ ఉంటేనే రాష్ట్రాభివృద్ధికి భారీగా నిధులను ఇచ్చింది. అదే ఎక్కువ మంది ఎంపీలుంటే ఇంకా భారీ మొత్తంలో నిధులను తేవచ్చు.

చేవెళ్ల లోక్‌సభలోఅసెంబ్లీ సెగ్మెంట్లు : చేవెళ్ల, పరిగి, తాండూరు, వికారాబాద్,మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి.

గత లోక్‌సభ ఎన్నికల్లో ఇలా..
ఎన్నికలు    టీఆర్‌ఎస్‌    కాంగ్రెస్‌    టీడీపీ/బీజేపీ
2014      4,35,077     3,62,054    3,53,203
2009     4,20,807      1,12,701    4,02,275
2009లో ఈ నియోజకవర్గానికి జరిగిన తొలి ఎన్నికల్లో ఎస్‌.జైపాల్‌రెడ్డి (కాంగ్రెస్‌).. ఏపీ జితేందర్‌రెడ్డి (టీడీపీ)పై గెలుపొందారు.
 2014 ఎన్నికల్లో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి (టీఆర్‌ఎస్‌).. కాంగ్రెస్‌ అభ్యర్థి పి.కార్తీక్‌రెడ్డిపై విజయం సాధించారు. ప్రస్తుతం విశ్వేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరి పోటీ చేస్తుండగా, టీఆర్‌ఎస్‌ నుంచి రంజిత్‌రెడ్డి బరిలోకి దిగారు.

2018 అసెంబ్లీ ఎన్నికలు – ప్రధాన పార్టీల ఓట్లు
టీఆర్‌ఎస్‌   6,47,763
కాంగ్రెస్‌     5,03,863
బీజేపీ       1,05,357
మొత్తం పోలైన ఓట్లు20,83,142

చేవెళ్లలోక్‌సభ ఓటర్లు
పురుషులు      12,51,210
మహిళలు       11,64,093
మొత్తం ఓటర్లు 24,15,598
ఇతరులు        295

మా గురించి పట్టించుకోరా?– రాజు, బార్బర్, తాండూరు
కులవృత్తి చేసుకునే వారిని పట్టించుకునే వాళ్లు లేరు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఒకట్రెండు
కులాలకు పథకాలు పెట్టారు. మాకోసం కూడా ఏదైనా చేయాలి. మమ్మల్ని పట్టించుకునే వారికి ఓటేస్తాం.

కేసీఆర్‌ ‘సంక్షేమం’ భేష్‌– ఎస్‌.రఘురాం, ప్రైవేటు ఉద్యోగి
సీఎం కేసీఆర్‌ అమలు చేసే సంక్షేమ పథకాలతో చాలామందికి ప్రయోజనం కలిగింది. అభ్యర్థి ఎవరైనా ప్రజల కోసం వారితో పని చేయించే సత్తా కేసీఆర్‌కు ఉంది.  

మోదీ మళ్లీ రావాలి– కె.సురేందర్‌రెడ్డి,విద్యార్థి, అనంతగిరి
దేశానికి ప్రధానిగా మరోసారి నరేంద్రమోదీ ఉండాలి. ప్రపంచ దేశాల్లో భారత దేశ ఖ్యాతిని చాటారు. మరో ఐదేళ్లు ప్రధానిగా ఉంటే దేశం మరింత అభివృద్ధి సాధిస్తుంది. ప్రపంచ దేశాలతో పోటీ పడుతుంది.

ఎవరూ చేసిందేమీ లేదు..– ఐ.లక్ష్మీనర్సింహారెడ్డి, వ్యాపారి, కందుకూరు
ఇప్పటివరకు ఎంపీలుగా చేసిన వారు చేసిం దేమీ లేదు. కొత్తగా గెలిచే వారైనా టార్గెట్‌ పెట్టుకొని మరీ అభివృద్ధి పనులు చేపట్టాలి. కేంద్రంలో సజావుగా పాలన సాగాలంటే జాతీయ పార్టీలే అధికారంలోకి రావాలి.

మరిన్ని వార్తలు