కారుకే జై హుజూర్‌!

25 Oct, 2019 02:35 IST|Sakshi
గెలుపు అనంతరం విజయసంకేతం చూపుతున్న సైదిరెడ్డి

కాంగ్రెస్‌ కోటను బద్దలుకొట్టిన టీఆర్‌ఎస్‌ 

43,358 ఓట్ల రికార్డు మెజార్టీతో సైదిరెడ్డి గెలుపు..

హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో అధికార పార్టీ ఘన విజయం..

డిపాజిట్లు కోల్పోయిన బీజేపీ, టీడీపీ..

సాక్షి, హైదరాబాద్‌ /సూర్యాపేట: విపక్షాల మాటలను హుజూర్‌నగర్‌ ప్రజలు విశ్వసించలేదు.. కాంగ్రెస్‌ నేతలు కలిసి కట్టుగా నియోజకవర్గాన్ని చుట్టేసినా పట్టించుకోలేదు.. ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రభావమూ కని పించలేదు.. రాష్ట్ర స్థాయి రాజకీయాలను ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోకుండా నియోజ కవర్గ అభివృద్ధి నినాదానికే పట్టం కట్టారు. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ తక్కువ మెజార్టీతో గెలుస్తుందన్న ఎగ్జిట్‌పోల్‌ సర్వే లను తలకిందులు చేస్తూ.. అధికార పార్టీని భారీ మెజార్టీతో గెలిపించారు. గురువారం వెల్లడైన ఫలితాల్లో టీఆర్‌ఎస్‌ తొలిసారిగా కాంగ్రెస్‌ కంచు కోటను బద్దలు కొట్టింది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థి నలమాద పద్మావతిరెడ్డిపై 43,358 ఓట్ల మెజార్టీతో గెలు పొంది రికార్డు సృష్టించారు. సైదిరెడ్డికి 1,13,095 ఓట్లు రాగా పద్మావతిరెడ్డికి 69,737 ఓట్లు వచ్చా యి. ఇండిపెండెంట్‌ సపావత్‌ సుమన్‌ 2,697 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. బీజేపీ అభ్యర్థి డాక్టర్‌ కోటా రామారావుకు 2,639 ఓట్లు, టీడీపీ అభ్యర్థి చావా కిరణ్మయికి 1,827 ఓట్లు, సీపీఎం మద్దతు ఇచ్చిన దేశగాని సాంబశివ గౌడ్‌కు 885 ఓట్లు, తీన్మార్‌ మల్లన్నకు 894 ఓట్లు వచ్చాయి. మొత్తం 2,00,754 ఓట్లలో 28 మంది అభ్యర్థులకు 2,00,248 ఓట్లు పడగా, నోటాకు 506 ఓట్లు వచ్చాయి. బీజేపీ, టీడీపీ సహా 24 మంది అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యాయి.

అన్ని రౌండ్లలో గులాబీ హవా...
కౌంటింగ్‌ మొదలైన తర్వాత ఒకటో రౌండ్‌ నుంచి చివరిదైన 22వ రౌండ్‌ వరకు అన్నింటా గులాబీ గుబాళించింది. టీఆర్‌ఎస్‌ ప్రతి రౌండ్‌లోనూ స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది. 15వ రౌండ్‌లో అత్యధికంగా 3,014 ఓట్ల మెజార్టీ రాగా, అత్యల్పంగా 22వ రౌండ్‌లో 748 ఓట్ల మెజార్టీని దక్కించుకుంది. నియోజకవర్గంలోని ఏడు మండ లాలు, హుజూర్‌నగర్, నేరేడుచర్ల మున్సిపాలి టీల్లోనూ కారు జోరు కొనసాగింది. రెండు, మూడు పోలింగ్‌ కేంద్రాల్లో మాత్రమే కాంగ్రెస్‌కు మెజార్టీ వచ్చింది. బీజేపీ, టీడీపీ సర్వశక్తులొడ్డినా ఆశించిన స్థాయిలో వారికి ఓట్లు పడలేదు. గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీకి కేవలం 1,084 ఓట్లు మాత్రమే పెరిగాయి. గత ఎన్నికల్లో ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి 92,996 ఓట్లు, సైదిరెడ్డికి 85,530 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి బొబ్బా భాగ్యారెడ్డికి 1,555 ఓట్లు, సీపీఎం అభ్యర్థి పారేపల్లి శేఖర్‌రావుకు 2,121 ఓట్లు వచ్చాయి. ఆ ఎన్నికల్లో ఉత్తమ్‌కు 7,466 ఓట్ల మెజార్టీ వచ్చింది. గత ఎన్నికల్లో ట్రక్కు గుర్తుతో దెబ్బతిన్నామని భావించిన టీఆర్‌ఎస్‌ ఈ ఎన్నికల్లో జాగ్రత్తపడింది. దీంతో భారీ మెజార్టీ సొంతం చేసుకుంది.

టీఆర్‌ఎస్‌లో జోష్‌..
రాష్ట్ర ప్రభుత్వ అధినేత కేసీఆర్‌పై హుజూర్‌నగర్‌ ప్రజలు చూపిన విశ్వాసం టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో జోష్‌ నింపింది. అయితే, ఈ విజయం అంత సునాయాసంగా వచ్చిందేమీ కాదని అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు కూడా ఈ విజయంలో కీలకపాత్ర పోషించాయనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. అధికారంలో ఉన్న పార్టీనే గెలిపించడం ద్వారా తమ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాట పట్టించాలనే కోణంలోనే అక్కడి ప్రజలు టీఆర్‌ఎస్‌కు ఓట్లేశారని వారంటున్నారు. దీనికి తోడు గత ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థి సైదిరెడ్డిపై కూడా కొంత సానుభూతి వచ్చిందని, అనేకసార్లు ఉత్తమ్‌కు ఓటు వేసిన వారు కూడా ఈ ఒక్కసారి స్థానికుడైన సైదిరెడ్డికి వేద్దామనే ఆలోచనతోనే పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లారనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది.

‘చే’జారిన కీలక స్థానం
హుజూర్‌నగర్‌ ఫలితం ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీలో నైరాశ్యాన్ని నింపింది. ఏర్పాటైన నాటి నుంచి తమకు అండగా నిలుస్తూ వచ్చిన కీలక స్థానం చేజారిపోవడం ఆ పార్టీ శ్రేణులకు రుచించడంలేదు. ఆర్టీసీ సమ్మె, రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత, కాంగ్రెస్‌ నేతల ఐక్యతారాగం వంటి అంశాలు తమకు కలిసివస్తాయని, సాంప్రదాయ బద్ధంగా ఉన్న పార్టీ బలం తమను విజయతీరాలకు చేరుస్తుందని ఆశించినా ఊహించని పరాభవం ఎదురుకావడం వారికి మింగుడు పడడంలేదు. కౌంటింగ్‌ ప్రారంభమై తొలి రౌండ్‌ ఫలితం వచ్చినప్పటి నుంచే కాంగ్రెస్‌ నేతల్లో విశ్వాసం సన్నగిల్లిపోయింది. మంచి పట్టున్న నేరేడుచర్ల, పాలకవీడు, మేళ్లచెరువు, మఠంపల్లి వంటి మండలాల్లో కూడా భారీ నష్టం జరగడం, పార్టీ తరఫున ప్రచారం సరిగా నిర్వహించకలేపోవడంతో కాంగ్రెస్‌ పరాభవాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చింది. అయితే, ఈ ఎన్నికల్లో  కూడా ఓటు బ్యాంకు చెదరలేదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. నియోజకవర్గం ఏర్పాటైన తర్వాత అతి తక్కువగా తమకు 2014 ఎన్నికల్లో 69, 879 ఓట్లు వచ్చాయని, ఈ ఎన్నికల్లో కూడా అదే స్థాయిలో 69,737 ఓట్లు వచ్చాయని, అంటే తమ ఓటు బ్యాంకు పదిలంగా ఉందని విశ్లేషిస్తున్నారు. దీనికి తోడు ఈ ఎన్నిక ద్వారా రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయని, బీజేపీకి ఎక్కడా బలం లేదని నిరూపించగలిగామని అంటున్నారు.

ధ్రువీకరణ పత్రం అందుకున్న సైదిరెడ్డి..
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ దుగ్యాల అమయ్‌కుమార్, ఎన్నికల పరిశీలకులు సచింద్ర ప్రతాప్‌సింగ్, జేసీ సంజీవరెడ్డి, రిటర్నింగ్‌ అధికారి చంద్రయ్యల పర్యవేక్షణలో ఓట్ల లెక్కింపు జరిగిన అనంతరం సైదిరెడ్డిని విజేతగా ప్రకటిస్తూ ఆయనకు ధ్రువీకరణపత్రం అందజేశారు. సైదిరెడ్డి వెంట మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిశోర్‌లు ఉన్నారు.

ఇది హుజూర్‌నగర్‌ ప్రజల విజయం
అరాచకవాదాన్ని తీసేసి అభివృద్ధి వైపే ప్రజలు మొగ్గు చూపారు. టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యమవుతుందని భావించి గెలిపించారు. ముందే ఊహించినట్టు భారీ మెజార్టీ వచ్చింది. ప్రజలంతా ఏకపక్షంగా ఓట్లేశారు. ఈ ఎన్నికల్లో వారే గెలిచారు. నేను ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తా. అందరినీ కలుపుకొని ముందుకెళ్తా. హుజూర్‌నగర్‌ అభివృద్ధి కోసం కలిసొస్తానంటే ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కూడా కలుపుకొని పోతాం. రైతులు, మహిళల అభివృద్ధే ఎజెండాగా ముందుకెళ్తాం. యువతకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్, మహిళా సాధికారత, లిఫ్ట్‌లు, రోడ్లు, డ్రెయినేజి వ్యవస్థ తదితర పనులు చేయిస్తా. నా గెలుపు కోసం కృషి చేసిన ఓటర్లు, ప్రజలు, పార్టీ కేడర్‌కు, నేతలకు అభినందనలు తెలుపుతున్నా.– శానంపూడి సైదిరెడ్డి

రీపోలింగ్‌ నిర్వహించాలి
ఈవీఎంలను ట్యాంపరింగ్‌ చేయడంతో టీఆర్‌ఎస్‌ గెలిచింది. ఉత్తమ్‌ చేసిన అభివృద్ధిని చూసి ఓటర్లు ఓటు వేసినా ట్యాంపరింగ్‌తో మాయ చేశారు. మా పార్టీ, బీజేపీకి రావాల్సిన ఓట్లు రాలేదు. స్వతంత్ర అభ్యర్థులకు సంబంధించి వారి కుటుంబాల ఓట్లు కూడా వారికి పడలేదు. అందుకే ఆ అభ్యర్థులు కూడా దీనిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చాలాచోట్ల ఓటర్లను టీఆర్‌ఎస్‌ భయబ్రాంతులకు గురిచేసింది. రీపోలింగ్‌ను ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్‌తో పెట్టాలి. దీనిపై ఎన్నికల సంఘం స్పందించాలి. న్యాయపోరాటానికైనా సిద్ధం.
– నలమాద పద్మావతిరెడ్డి

మరిన్ని వార్తలు