ఒక్కసారైనా రావాలన్నా..! 

15 Nov, 2018 01:41 IST|Sakshi

     అధినేత ప్రచారం కోసం టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ఎదురుచూపులు 

     ఒకసారైనా తమ నియోజకవర్గానికి రావాలని విన్నపాలు 

     కేసీఆర్‌ వస్తే ప్రచారంలో ఊపు వస్తుందంటున్న అభ్యర్థులు 

     గులాబీ బాస్‌ ప్రచార షెడ్యూల్‌పై అస్పష్టత 

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల వ్యూహంలో టీఆర్‌ఎస్‌ ప్రచార పర్వంపై అస్పష్టత కొనసాగుతోంది. అన్నింట్లో ముందున్న టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌.. ప్రచారం విషయంలో మాత్రం ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీల కంటే 2 నెలల ముందే అభ్యర్థులను ప్రకటించినా పూర్తిస్థాయి ప్రచారం ఇంకా మొదలు కావడంలేదు. దీంతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు. సీఎం కేసీఆర్‌ ఒక్కసారి నియోజకవర్గానికి వచ్చి వెళితే పరిస్థితి అనుకూలంగా మారుతుందని అభ్యర్థులు అభిప్రాయపడుతున్నారు. నియోజకవర్గాల్లో ఇప్పటికే రెండు మూడు సార్లు ప్రచారం పూర్తి చేశామని.. అధినేత కేసీఆర్‌ వస్తేనే ఊపు వస్తుందని అంటున్నారు. నామినేషన్లు దాఖలు కార్యక్రమం సైతం పూర్తవుతున్న నేపథ్యంలో కేసీఆర్‌ వీలైనంత త్వరగా ప్రచారం ప్రారంభించాలని కోరుతున్నారు. నవంబర్‌ 15 నుంచి ప్రచారం ప్రారంభిస్తానని కేసీఆర్‌ ఇటీవల అభ్యర్థులకు బీఫారాలు పంపిణీ చేసిన సమావేశంలో ప్రకటించారు. ఈ గడువు దగ్గరికొచ్చినా ప్రచార షెడ్యూల్‌ ఇంకా విడుదల చేయకపోవడంతో అభ్యర్థుల్లో ఆందోళన పెరుగుతోంది. 

కేసీఆర్‌ మాటతోనే... 
కేసీఆర్‌ ప్రచారశైలి టీఆర్‌ఎస్‌కు ప్రధాన బలం. ప్రస్తుత ఎన్నికల వ్యూహం పూర్తిగా కేసీఆర్‌ కేంద్రంగానే ఉంది. ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ నాలుగేళ్లలో చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలే ప్రధాన ఎజెండాగా టీఆర్‌ఎస్‌ వ్యూహం అమలు చేస్తోంది. 2014 ఎన్నికల్లో వందకుపైగా నియోజకవర్గాల్లో బహిరంగ సభల్లో కేసీఆర్‌ పాల్గొన్నారు. కొన్ని సెగ్మెంట్లలో రోడ్‌ షోలు చేశారు. వరుస ప్రచారంతో టీఆర్‌ఎస్‌కు ప్రజల్లో అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారం చేజిక్కించుకుంది. కేసీఆర్‌ ప్రచారం చేస్తే ఇప్పుడూ పరిస్థితి ఇలాగే ఉంటుందని అభ్యర్థులు అభిప్రాయపడుతున్నారు.  

మేనిఫెస్టో ఎప్పుడు... 
ఎన్నికల్లో కీలకమైన మేనిఫెస్టో ప్రకటనలోనూ టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. మహాకూటమి మేనిఫెస్టో ప్రకటించిన తర్వాతే ప్రకటించే యోచనలో ఉన్నారు. టీఆర్‌ఎస్‌ అధిష్టానం సేకరించిన సమాచారం ప్రకారం.. ఇప్పటికే ప్రకటించిన పాక్షిక మేనిఫెస్టోపై ప్రజల్లో సానుకూల స్పందన ఉందని తెలిసింది. ఎన్నికల ప్రచారం మొదలుపెట్టే ముందు మేనిఫెస్టోను ప్రకటించే అవకాశం ఉందని టీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి. 

గ్రేటర్‌లో ఇన్‌చార్జిలు.. 
ఎన్నికల ప్రచారం, వ్యూహం అమలు కోసం గ్రేటర్‌ హైదరాబాద్‌లోని అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌చార్జిలను నియమించాలని టీఆర్‌ఎస్‌ పార్టీ నిర్ణయించింది. ప్రత్యర్థి పార్టీలతో పోటీ ఎక్కువగా ఉందని భావించే నియోజకవర్గాలకు ఇన్‌చార్జిలను నియమించాలని మంత్రి కేటీఆర్‌ నిర్ణయించినట్లు తెలిసింది. నియోజకవర్గాల వారీగా ఇన్‌జార్జిల జాబితాను గురువారం విడుదల చేసే అవకాశం ఉంది. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల ప్రచార బాధ్యతలను మంత్రి కేటీఆర్‌కు అప్పగించారు. కేటీఆర్‌ ఈ నెల 20 నుంచి హైదరాబాద్‌లో రోడ్‌ షో నిర్వహించనున్నారు. రోడ్‌ షోల ప్రచార షెడ్యూల్‌ను గురువారం విడుదల చేసే అవకాశం ఉంది. ఈ నెలాఖరు వరకు గ్రేటర్‌ హైదరాబాద్‌లో కేటీఆర్‌ రోడ్‌ షోలు ఉండనున్నాయి. అలాగే డిసెంబర్‌ 3న పరేడ్‌ గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని కేసీఆర్‌ నిర్ణయించారు.  

మరిన్ని వార్తలు