టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల జాబితా మార్చాలి

1 Oct, 2018 02:42 IST|Sakshi

ఈ నెల 7న సరూర్‌నగర్‌లో బీసీల యుద్ధభేరి

బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌

హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాతో ఎన్నికలకు వెళితే ఓటమి తప్పదని, అభ్యర్థుల జాబితాను మార్పు చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ డిమాండ్‌ చేశారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల జాబితాలో సామాజిక న్యాయం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నాంపల్లి తెలుగు విశ్వవిద్యాలయంలో ఆదివారం జరిగిన బీసీల రాజకీయ భవిష్యత్తు కార్యాచరణ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

బీసీలకు రాజకీయ వాటా కల్పించకుండా అన్యాయం చేసిన పార్టీల్లో టీఆర్‌ఎస్‌ తొలిస్థానంలో ఉందని ఆరోపించారు. అన్ని రాజకీయ పార్టీలు జనాభా దామాషా ప్రకారం బీసీలకు టికెట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పిస్తామంటూ అసెంబ్లీలో చేసిన తీర్మానం ఏమైందని జాజుల ప్రశ్నించారు.

ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాటల్లోనే సామాజిక న్యాయం ఉంది తప్ప ఆచరణలో లేదని ఎద్దేవా చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 24 మంది బీసీ ప్రజాప్రతినిధులు ఉంటే ప్రత్యేక రాష్ట్రం వచ్చాక 2014లో వారి శాతం 19 మందికి పడిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నది ఇందుకోసమేనా అని ప్రశ్నించారు.

ఓటు మాదే సీటు మాదే
బీసీల రాజకీయ నిర్మాణం జరిగే దిశగా ఓటు మాదే సీటు మాదే అన్న నినాదంతో బీసీ సంక్షేమ సంఘం ఇక నుంచి బీసీల రాజకీయ సమితి పేరిట రాజకీయ వేదికను ఏర్పాటు చేస్తున్నట్లు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ ప్రకటించారు. బీసీ రాజకీయ యుద్ధభేరి పేరిట ఈ నెల 7వ తేదీన సరూర్‌నగర్‌ స్టేడియంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

ఈ సభలో బీసీల రాజకీయ ప్రణాళికను ప్రకటిస్తామని వెల్లడించారు. ఈ సభకు దేశవ్యాప్తంగా ఉన్న 28 రాష్ట్రాల బీసీ ఉద్యమ ప్రతినిధులు, సామాజిక ఉద్యమకారులు హాజరవుతున్నట్లు తెలిపారు. ఉద్యోగులు, మహిళలు, విద్యావంతులు, సామాజిక తత్వవేత్తలు, ప్రజలందరూ విచ్చేసి సభను విజయవంతం చేయాలని జాజుల పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలు కుల సంఘాల నేతలు, విద్యార్థి సంఘాల నేతలు, మహిళా నేతలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు