ఆధిక్యం అదరాలి

29 Oct, 2018 01:53 IST|Sakshi

టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్దేశం

మామూలు గెలుపు కాదు.. భారీ మెజారిటీ రావాలి

 గత ఎన్నికల రికార్డులను అధిగమించాలి

ప్రత్యేక ప్రణాళిక..మేనిఫెస్టోతో ముందుకెళ్లాలని సూచన

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీలో వందసీట్లలో గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్న టీఆర్‌ఎస్‌.. ఆ స్థానాల్లో అదిరిపోయే ఆధిక్యాన్ని సంపాదించే దిశగా అడుగులేస్తోంది. పార్టీ ఆవిర్భావం నుంచి గెలుస్తూ వస్తున్న సెగ్మెంట్లతోపాటు గత ఎన్నికల్లో గెలిచిన సీట్లలోనూ భారీ ఆధిక్యాన్ని నిలబెట్టు కోవాలని ప్రణాళికలు రూపొందిస్తోంది. నాలుగేళ్లుగా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలే పార్టీకి పటిష్టమైన ఓటు బ్యాంకుగా మారాయని టీఆర్‌ఎస్‌ అంచనా వేస్తోంది. వీరితోపాటు తటస్థ ఓటర్లను ఆకట్టుకునేందుకు స్థానికంగా వ్యూహాలు సిద్ధం చేసుకోవాలని ఈ సెగ్మెంట్ల అభ్యర్థులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఫోన్లో సూచనలు చేశారు. పండుగలు పూర్తవుతున్న నేపథ్యంలో ప్రచార జోరును పెంచాలని.. భారీ మెజారిటీ సాధనలో ఎక్కడా ఉదాసీనత చూపవద్దని ఆదేశించారు.  

15 చోట్ల 50 వేలకు పైగా..
2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ 63 స్థానాల్లో గెలిచింది. వీటిలో 20 వేలకుపైగా మెజారిటీతో గెలిచిన సెగ్మెంట్లు 30. ఇలా భారీ మెజారిటీతో గెలిచే స్థానాల సంఖ్య ఈసారి 50కి చేరాలని టీఆర్‌ఎస్‌ అధిష్టానం భావిస్తోంది. టీఆర్‌ఎస్‌కు కంచుకోట అయిన సిద్ధిపేట నియోజకవర్గంలో భారీ మెజారిటీ ఆ పార్టీకి ఆనవాయితీగా మారింది. గత ఎన్నికల్లో హరీశ్‌రావు అభ్యర్థిగా 93,328 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. హరీశ్‌రావు ఇక్కడ పోటీ చేసిన 5సార్లూ భారీ మెజారిటీతో గెలిచారు. సిద్ధిపేటలో విజయాలను మిగిలిన నియోజకవర్గాల్లోనూ అమలు చేయాలని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది.

వర్ధన్నపేటలో అరూరి రమేశ్‌ 86,883 ఓట్లు, పెద్దపల్లిలో దాసరి మనోహర్‌రెడ్డి 62,677 ఓట్లు, మంచిర్యాలలో ఎన్‌.దివాకర్‌రావు 59,250 ఓట్లు, స్టేషన్‌ ఘన్‌పూర్‌లో తాటికొండ రాజయ్య 58,829 ఓట్లు, హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌ 57,037, వరంగల్‌ (పశ్చిమ)లో దాస్యం వినయ్‌భాస్కర్‌ 56,304, సిరిసిల్లలో కేటీఆర్‌ 53,004, బెల్లంపల్లిలో దుర్గం చిన్నయ్య 52,528, మానకొండూరులో రసమయి బాలకిషన్‌ 46,922 మెజారిటీతో గెలిచారు. ఉప ఎన్నికల్లో.. నారాయణఖేడ్‌లో భూపాల్‌రెడ్డి 53,625, పాలేరులో తుమ్మల నాగేశ్వర్‌రావు 45,676 మెజారిటీతో విజయం సాధించారు. ఇలా 15 నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు 50 వేల ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. ప్రస్తుత ఎన్నికల్లోనూ ఇదే లక్ష్యాన్ని సాధించేలా ముందుకెళ్లాలని కేసీఆర్‌.. వీరికి సూచించారు.
 
20 వేలకు మించి 40 స్థానాల్లో..
2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ 20వేల – 40వేల మెజారిటీతో గెలిచిన స్థానాలు 15. వీటిలోనూ ఈసారి ఇంకా మంచి మెజారిటీ సాధించాలని టీఆర్‌ఎస్‌ ప్రయత్నిస్తోంది. మునుగోడు (38,055), దుబ్బాక (37,925), బాల్కొండ (36,248), జుక్కల్‌ (35,507), ఆలేరు (33,477), జనగామ(32,695), సంగారెడ్డి (29,522), బోథ్‌ (26,993), నిజామాబాద్‌ రూరల్‌(26,547), చెన్నూరు(26,164), సికింద్రాబాద్‌ (25,979), కరీంనగర్‌ (24,754), ఎల్లారెడ్డి (24,009), బాన్స్‌వాడ (23,930), కోరుట్ల (20,585) మంచి ఆధిక్యంతో టీఆర్‌ఎస్‌ విజయం సాధించింది.
 
పెండింగ్‌లోనూ తగ్గొద్దు
టీఆర్‌ఎస్‌ భారీ ఆధిక్యం సాధించిన స్థానాల్లో మూడు స్థానాల్లో ఇప్పటికీ అభ్యర్థులను ఖరారు చేయలేదు. అయితే గత ఎన్నికల్లో వచ్చిన ఆధిక్యం తగ్గకుండా పార్టీ శ్రేణులు సమష్టిగా ప్రచారం కొనసాగించాలని టీఆర్‌ఎస్‌ అధిష్టానం ఆదేశించింది. గత ఎన్నికల ఆధిక్యం తగ్గకుండా అన్ని రకాలుగా వ్యూహాలు అమలు చేయాలని సూచించింది. వరంగల్‌ (తూర్పు) నియోజకవర్గంలో.. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొండా సురేఖ 55,085 ఓట్ల మెజారిటితో గెలిచారు. ప్రస్తుతం ఆమె కాంగ్రెస్‌లో చేరారు. టీఆర్‌ఎస్‌ ఇక్కడ అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. అలాగే చొప్పదండిలో బొడిగె శోభ 54,981 ఓట్ల తేడాతో గెలిచారు. ఇక్కడ కూడా అభ్యర్థిని ప్రకటించలేదు. అభ్యర్థి ఎవరైనా.. ఆధిక్యం గత ఎన్నికల తరహాలోనే ఉండాలని సీఎం కేసీఆర్‌ ఇక్కడి నేతలను ఆదేశించారు. మేడ్చల్‌ సెగ్మెంట్‌ పరిస్థితి ఇలాగే ఉంది. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఎం.సుధీర్‌రెడ్డి 43,455 ఓట్లతో విజయం సాధించారు. ఇక్కడా అభ్యర్థిని ప్రకటించలేదు.  

మరిన్ని వార్తలు