‘కారు’ సీట్లు ఖరారు 

19 Nov, 2018 02:59 IST|Sakshi

పూర్తి అయిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ప్రకటన  

ఓసీలకు 58, బీసీలకు 26 స్థానాలు 

ముషీరాబాద్‌ ముఠా గోపాల్‌కు.. కోదాడ బరిలో మల్లయ్యయాదవ్‌ 

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ప్రకటన పూర్తయింది. పెండింగ్‌లో ఉన్న కోదాడ, ముషీరాబాద్‌ స్థానాలకు టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం అభ్యర్థులను ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ నుంచి శుక్రవారం టీఆర్‌ఎస్‌లో చేరిన బొల్లం మల్లయ్యయాదవ్‌ను కోదాడ అభ్యర్థిగా ఎంపిక చేశారు. ముషీరాబాద్‌లో ముఠా గోపాల్‌ పేరును ప్రకటించారు. దీంతో టీఆర్‌ఎస్‌ మొత్తం 119 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్లయింది. ముషీరాబాద్‌ విషయంలో హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి విన్నపాన్ని కేసీఆర్‌ పక్కనబెట్టారు. తనకుగానీ, తన అల్లుడైన కార్పొరేటర్‌ శ్రీనివాస్‌రెడ్డికిగానీ అవకాశం ఇవ్వాలని నాయిని కోరారు. పోటీ చేసే అవకాశం కల్పిస్తారని భావించారు. అయితే, ముందుగా నిర్ణయించిన ప్రకారం ఇక్కడ బీసీ వర్గానికి చెందిన ముఠా గోపాల్‌కు అవకాశం కల్పించారు.

కోదాడ అభ్యర్థి ఎంపికలోనూ కొత్త పరిణామాలు చోటుచేసుకున్నాయి. కోదాడ నియోజకవర్గ ఇన్‌చార్జి కె.శశిధర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వేనెపల్లి చందర్‌రావు టికెట్‌పై ఆశలు పెట్టుకున్నారు. అనూహ్యంగా రెండురోజుల క్రితం టీఆర్‌ఎస్‌లో చేరిన బొల్లం మల్లయ్యయాదవ్‌కు అవకాశం కల్పించారు. సోమ వారం ఉదయం బర్కత్‌పురలో జరిగే కార్యక్రమంలో హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి చేతుల మీదుగా ముషీరాబాద్‌ టీఆర్‌ఎస్‌ బీఫారాన్ని ముఠా గోపాల్‌ అందుకుంటారు. అనం తరం నాయిని ఆశీర్వాదం తీసుకుని నామినేషన్‌ దాఖలు చేస్తారు. విద్యుత్‌ మంత్రి జగదీశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చందర్‌రావు ఆధ్వర్యంలో  మల్లయ్య యాదవ్‌ సోమవారం నామినేషన్‌ దాఖలు చేస్తారు. టీఆర్‌ఎస్‌ ప్రకటించిన మొత్తం 119 సీట్లలో ఓసీలకు 58, బీసీలు 26, ఎస్సీలు 19, ఎస్టీలు 12, ముస్లింలు 3, సిక్కు లకు 1 చొప్పున స్థానాలను కేటాయించింది.  

నేటి నుంచి నియోజకవర్గాలకు... 
కేసీఆర్‌ సోమవారం నుంచి పూర్తిస్థాయిలో ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. కేసీఆర్‌ గజ్వేల్‌లోని ఎర్రవల్లి నివాసంలో ఉన్నారు. సోమవారం అక్కడి నుంచి హెలికాప్టర్‌లో ఖమ్మం చేరుకుంటారు. మధ్యాహ్నం 2.30 గంటలకు అక్కడ జరగనున్న ఖమ్మం, పాలేరు అసెంబ్లీ నియోజకవర్గాలసభలో మాట్లాడతారు. అక్కడి నుంచి పాలకుర్తికి చేరుకుని మధ్యాహ్నం 3.30 గంటకు అక్కడ జరగనున్న ప్రచారసభలో ప్రసంగిస్తారు. అనంతరం ఎర్రవల్లిలోని నివాసానికి చేరుకుంటారు. ఉత్తర తెలంగాణలోని అన్ని జిల్లాల ప్రచారానికి ఎర్రవల్లి నుంచే హెలికాప్టర్‌లో వెళ్లనున్నారు. 

మరిన్ని వార్తలు