ప్రజాస్వామ్యం ఖూనీ

29 Apr, 2019 02:42 IST|Sakshi

ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసేందుకు టీఆర్‌ఎస్‌ కుట్ర

ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్రలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలకు డిమాండ్‌

ప్రాజెక్ట్‌ల రీ–డిజైన్‌తో రూ. కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణ

సాక్షి, భద్రాచలం/బూర్గంపాడు: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనలో తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖూనీ ఆవుతోందని కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసేందుకు కుట్ర జరుగుతోందన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి అనైతికంగా టీఆర్‌ఎస్‌లో చేర్చుకుంటున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్రలో భాగంగా ఆదివారం ఆయన భద్రాచలం, పినపాక నియోజకవర్గాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అంబేడ్కర్‌ రచించిన రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా తెలంగాణలో పాలన సాగుతోందన్నారు.

రాచరిక వ్యవస్థ ఉన్నప్పుడే శ్రీరామచంద్రుడు ప్రజాభీష్టానికి అనుగుణంగా పాలించాడని, నేడు ప్రజాస్వామ్య వ్యవస్థ ఉన్నా.. కేసీఆర్‌ నియంతలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించకుండా వారికి తమ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించటం సిగ్గుచేటన్నారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి పాలించే అర్హత లేదన్నారు. పార్టీ మారి న ఎమ్మెల్యేల శాసనసభ సభ్యత్వాలను రద్దుచేయాల ని భట్టి డిమాండ్‌ చేశారు. ఈ విషయంలో గవర్నర్‌ను కలిసినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.  

ఆ ఎమ్మెల్యేలపై కేసులు పెట్టండి
ప్రతిపక్ష నేతగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ అనైతికతపై పోరాడుతుంటే కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌లో చేర్చుకుని ప్రతిపక్షాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. కాంగ్రెస్‌ నుంచి గెలిచి టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలపై కేసులు పెట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ హయాంలో ప్రారంభించిన రాజీవ్‌సాగర్, ఇందిరాసాగర్‌ ప్రాజెక్ట్‌లను రీ–డిజైన్‌ చేసి కోట్లాది రూపాయల సొమ్ము కాజేశారని ఆరోపించారు. ఇంటర్మీడియట్‌ పరీక్షల మూల్యాంకనం కూడా సక్రమంగా నిర్వహించలేని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం.. కేంద్రంలో చక్రం తిప్పుతామని ప్రగల్భాలు పలకడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.

అంతమంది విద్యార్థులు బలైనా.. సీఎం కేసీఆర్‌ ఫాంహౌస్‌ నుంచి బయటకు రాలేదని అన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు కాంగ్రెస్‌ పార్టీ బలమైన ప్రతిపక్షపాత్రను పోషిస్తుందన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలలో కాంగ్రెస్‌ కూటమి అభ్యర్థులను గెలిపించి పార్టీ మారిన ఎమ్మెల్యేలకు తగిన బుద్ధి చెప్పాలని కోరారు. జిల్లా పరిషత్, మండల పరిషత్‌ అధ్యక్షులుగా కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు అందరు ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారు
భారత రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాలు గౌరవిస్తాయని, కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాత్రం అపహాస్యం చేస్తున్నారని భద్రాచలం ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్రలో భట్టి విమర్శించారు. ఓ పార్టీ జెండాపై గెలిచిన ఎమ్మెల్యేలను బెదిరించి, ప్రలోభపెట్టి తమ పార్టీలో కలుపుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యానికి ప్రభుత్వం, ప్రతిపక్షం రెండు కళ్ల లాంటివని చెప్పారు.

కేసీఆర్‌కు పాలన మీద దృష్టి లేదని, ఫాంహౌస్‌లో కూర్చుని అధికారం చలాయిస్తున్నాడని విమర్శించారు. తమ పిల్లలు చనిపోయి ఇంటర్మీడియట్‌ విద్యార్థుల తల్లిదండ్రులు ఏడుస్తుంటే, పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహించడమేంటని ప్రశ్నించారు. ఆయన వెంట జిల్లా పరిషత్‌ మాజీ చైర్మన్‌ చందా లింగయ్య, టీడీపీ నాయకులు కొడాలి శ్రీనివాసన్, కాంగ్రెస్‌ నాయకులు బొలిశెట్టి రంగారావు, డీసీసీ అధికార ప్రతినిధి బుడగం శ్రీనివాస్, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ బోగాల శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు