‘కేటీఆర్‌కు అవగాహన లేక అలా మాట్లాడాడు’

17 Oct, 2018 17:47 IST|Sakshi
కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకురాలు డీకే ఆరుణ

సాక్షి, హైదరాబాద్‌ : కాంగ్రెస్ హామీలు ప్రజల్లోకి బలంగా వెళ్లటంతో తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు ఆందోళన పడ్డారని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకురాలు డీకే ఆరుణ అన్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ప్రజలు ఆయనను నమ్మే పరిస్థితిలేదని చెప్పారు. రోజు రోజుకు టీఆర్ఎస్ పరిస్థితి దిగజారుతుండటంతో కాంగ్రెస్ మేనిఫెస్టో కాపీ కొట్టారని ఆరోపించారు. మొన్నటికి మొన్న కేసీఆర్‌ కొడుకు కేటీఆర్‌ కాంగ్రెస్ మేనిఫెస్టో అమలుకు దక్షిణ భారతదేశం బడ్జెట్ చాలదన్నాడని పేర్కొన్నారు. 

కేటీఆర్‌కు అవగాహన లేక అలా మాట్లాడాడని, కేసీఆర్‌కు అవగాహన లేక మేనిఫెస్టో ప్రకటించారని వ్యాఖ్యానించారు. కేటీఆర్ ఎలాంటి అవగాహన లేకుండా మాట్లాడుతున్నట్లు అర్ధమైపోయిందన్నారు. డబుల్‌ బెడ్ రూం ఏ గ్రామంలో కట్టకుండా.. ఒకటి, రెండు చోట్ల చెప్పుకునేందుకు కట్టి ఇప్పుడు తాము చెప్పిన ఐదు లక్షలే అన్నాడని తెలిపారు. పింఛన్లు, నిరుద్యోగ భృతి తాము ఏం చెబితే దానికి 16 రూపాయలు ఎక్కువ చెప్పారని, కాంగ్రెస్ వాళ్లకంటే 16 రూపాయలు ఎక్కువ ఇస్తా! అని ఓట్లు అడుగుతారా అని ప్రశ్నించారు.

కేసీఆర్ ఎన్ని చెప్పినా ప్రజలు నమ్మేలా లేరని అన్నారు. కేసీఆర్ ఓటమి ఖాయయని, బండి నడపలేక తొమ్మిది నెలల ముందే ప్రభుత్వం రద్దు చేసుకున్నాడని ఎద్దేవా చేశారు. ఇచ్చిన అన్ని హామీలు కాంగ్రెస్ నిలబెట్టుకుంటే...కేసీఆర్ ఏ ఒక్క హామీ నిలబెట్టుకోలేదని అన్నారు. టీఆర్ఎస్‌, కేసీఆర్‌కు మిగిలేది అడియాసలేనని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ పార్టీ రోజు రోజుకు ప్రభావం కోల్పోతూందని, అందుకే చాలా మంది కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. 

మరిన్ని వార్తలు