గజ్వేల్‌ సభతో ముగింపు

30 Nov, 2018 01:33 IST|Sakshi

5న సొంత సెగ్మెంట్‌లో కేసీఆర్‌ ప్రచారం

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ముందస్తు ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రతిరోజు హెలికాప్టర్‌లో కేసీఆర్‌ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఒక్కోరోజు సగటున ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రచారం పూర్తి చేస్తున్నారు. ముందస్తు ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్‌ ఇప్పటికే 69 నియోజకవర్గాలలో ప్రచారం పూర్తి చేశారు. శుక్రవారం సైతం మరో ఏడు నియోజకవర్గాలలో ప్రచారం చేయనున్నారు. శనివారం మినహా డిసెంబర్‌ 4 వరకు కేసీఆర్‌ ఎన్నికల ప్రచార షెడ్యూల్‌ ఖరారైంది. డిసెంబర్‌ 2న హైదరాబాద్‌లో ప్రచారం నిర్వహించనున్నారు. పరేడ్‌గ్రౌండ్‌లోనే ఈ సభను నిర్వహించాలని నిర్ణయించారు. హైదరాబాద్‌ జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు కలిపి ఈ సభ జరగనుంది. ఇక ఎన్నికల ప్రచారానికి ఆఖరి రోజైన డిసెంబర్‌ 5న సాయంత్రం 4 గంటల్లోపు సీఎం సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌లో ప్రచార సభ నిర్వహించనున్నారు. 2014లో కూడా ఇదే తరహాలో చివరి రోజు ప్రచార సభను గజ్వేల్‌లో నిర్వహించారు. ఇదే సాంప్రదాయాన్ని ఈసారి కూడా కొనసాగిస్తున్నారు. 

రేపు మేనిఫెస్టో..!
అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను టీఆర్‌ఎస్‌ ఇప్పటి వరకు విడుదల చేయలేదు. పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను సీఎం కేసీఆర్‌ శనివారం విడుదల చేసే అవకాశం ఉంది. వరుస ఎన్నికల ప్రచారంలో నిమగ్నమైన కేసీఆర్‌కు ఆ రోజు ప్రచారానికి విరామం ఇస్తున్నారు. దీంతో అదే రోజు మేనిఫెస్టోను ప్రకటిస్తారని తెలుస్తోంది. కేసీఆర్‌ అక్టోబర్‌ 16న పాక్షిక మేనిఫెస్టోను ప్రకటించారు. లక్ష రూపాయల పంట రుణాల మాఫీ, నిరుద్యోగ భృతి, ఆసరా పింఛన్ల మొత్తం రెట్టింపు, రైతు బంధు సాయం పెంపు వంటి కీలక హామీలను ఇచ్చారు. ఆ తర్వాత ఎన్నికల సభలలో ఉద్యోగుల అంశాలపై పలు హామీలు ఇచ్చారు. పూర్తిస్థాయి మేనిఫెస్టోను సిద్ధం చేస్తున్నారు.

కేసీఆర్‌ ప్రచార సభల షెడ్యూల్‌
30–11–18: 11:30 : ఇల్లందు, 12:15:
కొత్తగూడెం, 1:00: మణుగూరు (పినపాక), 1:45: ములుగు, 2:30: భూపాలపల్లి,
3:15: మంథని, 4:00: పెద్దపల్లి.
2–12–2018: 1:00: నాగర్‌కర్నూల్,
2:00 : చేవెళ్ల, 3:00: పటాన్‌చెరువు,
5:00: హైదరాబాద్‌. 
3–12–18: 12:00: సత్తుపల్లి, 1:00: మధిర, 1:45: కోదాడ, 2:30: హుజూర్‌నగర్,
3:30: మిర్యాలగూడ, 4:30: నల్లగొండ.
4–12–18: 12:00: ఆలంపూర్,
1:00: గద్వాల, 2:00: మక్తల్, 3:00: కొడంగల్, 4:00: వికారాబాద్‌. 

మరిన్ని వార్తలు