గులాబీ ప్రచార పర్వం

26 Sep, 2018 02:13 IST|Sakshi

     ఉమ్మడి జిల్లాకో బహిరంగ సభ 

     టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ నిర్ణయం 

     అక్టోబర్‌ 3న నిజామాబాద్‌లో.. ఆ తర్వాత వరుసగా 4 సభలు 

సాక్షి, హైదరాబాద్‌: ముందస్తు ఎన్నికలకు టీఆర్‌ఎస్‌ ప్రచార పర్వం మొదలవుతోంది. టీఆర్‌ఎస్‌ అధినేత చంద్రశేఖర్‌రావు పాల్గొనే తదుపరి ప్రచార షెడ్యూల్‌ ఖరారైంది. అక్టోబర్‌ 3 నుంచి 8 వరకు వరుసగా ఉమ్మడి జిల్లాకు ఒక బహిరంగసభ నిర్వహించాలని కేసీఆర్‌ నిర్ణయించారు. అక్టోబర్‌ 3న నిజామాబాద్‌లో, 4న నల్లగొండ, 5న వనపర్తి (మహబూబ్‌నగర్‌), 7న వరంగల్, 8న ఖమ్మంలో ప్రచార సభలు జరగనున్నాయి. ఉమ్మడి మెదక్, ఉమ్మడి ఆదిలాబాద్‌లో తర్వాత దశలో నిర్వహిస్తారు.

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా హుస్నాబాద్‌లో సెప్టెంబర్‌ 7న నిర్వహించారు. ‘ప్రగతి నివేదిన సభ’గ్రేటర్‌ హైదరాబాద్‌లోనే నిర్వహించినందున హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మళ్లీ బహిరంగసభలు ఉండకపోవచ్చని తెలిసింది. ముందస్తు ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయ్యే లోపు ప్రతి జిల్లా కేంద్రంలో బహిరంగసభ నిర్వహించాలని కేసీఆర్‌ నిర్ణయించారు. ప్రతి బహిరంగసభను లక్ష మందికి తగ్గకుండా నిర్వహించాలని నిర్ణయించారు. తొలుత నిజామాబాద్‌లో తొలి సభ నిర్వహిస్తున్నారు. ఆ సభ నిర్వహణ బాధ్యతలను నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవితకు అప్పగించారు. ఉమ్మడి నిజామాబాద్‌లోని మొత్తం 9 అసెంబ్లీ నియోజకవర్గాలకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ఖరారు చేశారు. ఈ నేపథ్యంలోనే అక్కడ బహిరంగసభ నిర్వహిస్తున్నారు.  

‘కూటమి’ఆలస్యమవుతుండటంతో.. 
ముందస్తు ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థి పార్టీల కన్నా టీఆర్‌ఎస్‌ ముందుంది. 50 రోజుల్లో 100 బహిరంగసభలతో ప్రచారం నిర్వహించనున్నట్లు అసెంబ్లీ రద్దయిన రోజున కేసీఆర్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ ప్రకారం మరుసటి రోజు సెప్టెంబర్‌ 7న హుస్నాబాద్‌ నియోజకవర్గ కేంద్రంలో ఎన్నికల ప్రచారాన్ని కేసీఆర్‌ ప్రారంభించారు. ఆ తర్వాత ప్రచార ప్రక్రియ ఆగిపోయింది. విపక్ష పార్టీల కూటమి ఏర్పడిన తర్వాత అందుకు అనుగుణంగా రాజకీయ వ్యూహంతో ప్రచారం నిర్వహించాలని కేసీఆర్‌ భావించారు. కానీ కూటమి ఏర్పాటు ఆలస్యం అవుతుండటంతో జిల్లాల వారీగా బహిరంగసభలు నిర్వహించాలని నిర్ణయించారు.

శాసనమండలి సమావేశాలు సైతం పూర్తవుతుండటంతో అక్టోబర్‌ 3న తదుపరి బహిరంగసభ నిర్వహణపై నిర్ణయం తీసుకున్నారు. నియోజకవర్గాల వారీగా సభలు నిర్వహించడానికి ముందు మూడు, నాలుగు సెగ్మెంట్లకు ఒకటి చొప్పున సభ నిర్వహించేలా ప్రచార షెడ్యూల్‌ ఖరారైనట్లు తెలిసింది. ప్రతి బహిరంగసభనూ లక్ష మందితో నిర్వహించాలని భావిస్తున్నారు. ఏయే నియోజకవర్గాలను కలిపి సభలు నిర్వహించాలనే విషయంపైనా స్పష్టత వచ్చినట్లు తెలిసింది. ప్రతి జిల్లాలో లక్ష మందితో బహిరంగసభ నిర్వహించిన తర్వాత టీఆర్‌ఎస్‌ ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలు పూర్తిగా ఎన్నికలకు సన్నద్ధమవుతారని అధిష్టానం భావిస్తోంది.

మరిన్ని వార్తలు