రిటైర్మెంట్‌ @ 61

3 Dec, 2018 03:53 IST|Sakshi
ఆదివారం టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోను విడుదల చేస్తున్న కేసీఆర్, కేకే. చిత్రంలో తలసాని, మహమూద్‌ అలీ, నాయిని, కేటీఆర్, పద్మారావుగౌడ్‌

15 పేజీలతో టీఆర్‌ఎస్‌ ఎన్నికల మేనిఫెస్టో 

అందరినీ ఆకట్టుకునేలా 24 ప్రధాన హామీలు 

సాక్షి, హైదరాబాద్‌ : సంక్షేమ ఎజెండాతో టీఆర్‌ఎస్‌ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచుతామని పేర్కొంది. ఈ హామీతో నిరుద్యోగుల్లో అసంతృప్తి తలెత్తకుండా నియామక వయోపరిమితిని మూడేళ్లు పెంచనున్నట్లు తెలిపింది. పెన్షనర్ల కోసం ప్రత్యేక డైరెక్టరేట్‌ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులకు సబబైన, సముచితమైన రీతిలో వేతన సవరణపై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా సికింద్రాబాద్‌ పరేడ్‌గ్రౌండ్‌లో ఆదివారం జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోను ప్రకటించింది. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్, మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌ కె.కేశవరావు కలసి మేనిఫెస్టో విడుదల చేశారు. వివిధ వర్గాల నుంచి వచ్చిన వందలాది ప్రతిపాదనలను పరిశీలించి మేనిఫెస్టోను రూపొందించినట్లు కె.కేశవరావు తెలిపారు. 15 పేజీలతో రూపొందించిన ఈ మేనిఫెస్టోలో టీఆర్‌ఎస్‌ నాలుగేళ్ల మూడు నెలల పరిపాలన విషయాలకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు. ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలన్నింటినీ మరింత విస్తృత పరుస్తూ, కొనసాగిస్తామని స్పష్టం చేసింది. 

అభివృద్ధి యజ్ఞానికి అండగా నిలవండి.. 
‘ఉద్యమ కార్యాచరణలో, ప్రభుత్వ నిర్వహణలో టీఆర్‌ఎస్‌ ప్రదర్శించిన చిత్తశుద్ధి ప్రజల మన్ననలు పొందింది. నిన్నటి దాకా అస్తిత్వానికే నోచుకోని తెలంగాణ నేడొక ఆదర్శ రాష్ట్రంగా ప్రశంసలు పొందుతున్నది. ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు అడుగడుగునా అవరోధాలు కల్పించాయి. తమ అల్పమైన రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజా ప్రయోజనాలకు విఘాతం కలిగించాయి. అబద్ధపు ప్రచారాలతో, నిరాధారమైన విమర్శలతో అధికార యంత్రాంగంలో ఆత్మస్థైర్యం దెబ్బతీసేందుకు ప్రయత్నించాయి. కోర్టుల్లో కేసులు వేసి, ప్రాజెక్టుల నిర్మాణాన్ని అడ్డుకోవడానికి కుట్రలు చేశాయి. ప్రగతి నిరోధకుల ఆగడాలకు అడ్డుకట్ట వేయడం కోసం వారిని ప్రజా న్యాయస్థానంలో నెలబెట్టాలని టీఆర్‌ఎస్‌ నిర్ణయించింది.

ఎన్నికల సమరంలో దూకింది. ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు. మీ తీర్పే శిరోధార్యం. తెలంగాణ ప్రజలే అధిష్టానంగా ఎవరికీ తలవంచకుండా, ఏ ఒత్తిళ్లకు లొంగకుండా తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాజీలేని వైఖరి అవలంబించే ఒకే ఒక పార్టీ టీఆర్‌ఎస్‌ మాత్రమే. చిత్తశుద్ధితో కేసీఆర్‌ తలపెట్టిన అభివృద్ధి యజ్ఞం కొనసాగేందుకు మరోసారి మద్దతుగా నిలవాలని తెలంగాణ ప్రజలను సవినయంగా కోరుతున్నాం. రాష్ట్రంలోని అన్ని వర్గాలకు, అన్ని ప్రాంతాల ప్రజలకు సమాన న్యాయం, సమాన అభివృద్ధి లభించేందుకు, తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడం కోసం ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజల బతుకులు పండించే బంగారు తెలంగాణ నిర్మాణం కోసం సాగుతున్న మహోన్నత కృషికి అండదండలు ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తున్నాం’అని టీఆర్‌ఎస్‌ విజ్ఞప్తి చేసింది. 

సంపద పెంచుతున్నాం.. ప్రజలకు పంచుతున్నాం 
‘2014 ఎన్నికల సందర్భంగా ప్రకటించిన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడంతో పాటు, మేనిఫెస్టోలో ప్రకటించకున్నా సరే, ప్రజలకు అవసరమని భావించిన ప్రభుత్వం అనేక కొత్త పథకాలను ప్రవేశ పెట్టింది. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్, మిషన్‌ భగీరథ, కల్యాణలక్ష్మి/షాదీ ముబారక్, కేసీఆర్‌ కిట్స్, కంటి వెలుగు లాంటి 76 కొత్త పథకాలను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తోంది. రాష్ట్రంలో స్థిరమైన పరిపాలన అందిస్తూ రాజకీయ అవినీతిని తుద ముట్టించడం ద్వారా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆదాయ వృద్ధిరేటును గణనీయంగా పెంచింది. మొదటి నాలుగేళ్లలో రాష్ట్రం 17.17 శాతం సగటు వార్షిక ఆదాయ వృద్ధిరేటు సాధించింది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో కూడా ఇప్పటి వరకు 19.83 వృద్ధిరేటు సాధించింది. పెరిగిన సంపదను పేదలకు పంచడమే లక్ష్యంగా ప్రభుత్వం పథకాలను రూపొందించింది. ఆదాయ వృద్ధిరేటు ఇలాగే కొనసాగాలంటే రాజకీయ స్థిరత్వాన్ని అందించే టీఆర్‌ఎస్‌ తిరిగి అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత ఉంది. రాబోయే రోజుల్లో కూడా ప్రస్తుతం ప్రకటిస్తున్న హామీల అమలుకు మాత్రమే పరిమితం కాకుండా ప్రజల అవసరాలు, ఆకాంక్షలు, వివిధ వర్గాల డిమాండ్లు ఎప్పటికప్పుడు పరిగణనలోకి తీసుకుంటూ నూతన పథకాలను అమల్లోకి తెస్తాం’అని పేర్కొన్నారు.  

టీఆర్‌ఎస్‌ ఎన్నికల మేనిఫెస్టో హామీలు.. 
- వికలాంగుల పెన్షన్లను రూ.1,500 నుంచి రూ.3,016 వరకు పెంచుతాం. మిగిలిన అన్నిరకాల ఆసరా పెన్షన్లు రూ.1,000 నుంచి రూ.2,016 వరకు పెంపు. బీడీ కార్మికుల పీఎఫ్‌ కటాఫ్‌ తేదీ 2018 వరకు పొడిగింపు. 
వృద్ధాప్య పెన్షన్‌ అర్హత వయసు 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గింపు. 
- నిరుద్యోగ సోదరులకు నెలకు రూ.3,016 భృతి చెల్లింపు. 
డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణం పథకాన్ని ప్రస్తుత పద్ధతిలో కొనసాగిస్తూనే, సొంతస్థలం ఉండి, అర్హులైన పేదలకు డబుల్‌ బెడ్రూం ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు అందజేయడం. 
రైతుబంధు కింద ఏడాదికి ఎకరాకు అందిస్తున్న సాయాన్ని రూ.8 వేల నుంచి రూ.10 వేలకు పెంపు.  
రైతులకు రూ.1 లక్ష వరకున్న పంట రుణాలు మాఫీ. 
రెతు సమన్వయ సమితి సభ్యులకు గౌరవ భృతి చెల్లింపు. 
- ఎస్సీ, ఎస్టీ వర్గాల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక పథకాలు రూపొందించేందుకు నియమించిన కమిటీ ఇచ్చే నివేదికను ప్రభుత్వం అమలు చేస్తుంది. 
చట్టసభల్లో బీసీలకు 33 శాతం, మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ అమలు కోసం ప్రభుత్వం పోరాడుతుంది.  
ఎస్టీలకు 12 శాతం, మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ తెలంగాణ అసెంబ్లీ తీర్మా నం చేసింది. ఈ రిజర్వేషన్లు అమలు చేయడం కోసం కేంద్రంతో రాజీలేని పోరాటం చేస్తుంది.  
ఎస్సీ వర్గీకరణ కోసం అసెంబ్లీ తీర్మానం చేసి, కేంద్రానికి పంపాం. కేంద్రం నుంచి ఆమోదం వచ్చేందుకు టీఆర్‌ఎస్‌ పోరాటం చేస్తుంది. 
- వివిధ కులాల కేటగిరీ మార్పు కోసం వచ్చిన విజ్ఞాపనలను సానుభూతితో పరిశీలిస్తుంది.  
రెడ్డి కార్పొరేషన్, వైశ్య కార్పొరేషన్‌తో పాటు ఆర్థికంగా వెనుకబడిన ఇతర వర్గాల సంక్షేమానికి కార్పొరేషన్లు ఏర్పాటు.  
- వివిధ సామాజిక వర్గాల నుంచి కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని వచ్చిన డిమాండ్లను రాబోయే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తుంది.  
అగ్ర కులాల్లోని పేదల అభ్యున్నతికి ప్రత్యేక పథకాలు అమలు.. 
టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను నెలకొల్పుతుంది. ఐకేపీ ఉద్యోగులను పర్మినెంటు చేసి, ఈ యూనిట్ల నిర్వహణ బాధ్యతను మహిళా సంఘాలతో కలిపి ఐకేపీ ఉద్యోగులకు అప్పగిస్తుంది. ఈ యూనిట్లు తయారు చేసే ఆహార పదార్థాలను ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందుబాటులోకి తెస్తుంది. 
కంటి వెలుగు పథకం తరహాలోనే ప్రజలందరికీ ఇతర ఆరోగ్య పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తుంది. ప్రతీ వ్యక్తి హెల్త్‌ ప్రొఫైల్‌ రికార్డు చేసి, రాష్ట్ర హెల్త్‌ ప్రొఫైల్‌ రూపొందిస్తుంది. 
- ప్రభుత్వ ఉద్యోగులకు సబబైన, సముచితమైన రీతిలో వేతన సవరణ చేస్తుంది. 
- ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్‌ వయసు 58 ఏళ్ల నుంచి 61 ఏళ్లకు పెంపు. దీనికి సమాంతరంగా నిరుద్యోగులకు ఎక్కువ అవకాశాలు కల్పించేందుకు ఉద్యోగాల నియామక వయో పరిమితి మూడేళ్లు పెంపు. 
- పెన్షనర్ల కోసం ప్రత్యేక డైరెక్టరేట్‌ ఏర్పాటు.. 
అటవీ ప్రాంతాల్లోని గిరిజన, గిరిజనేతర రైతుల భూ వివాదాలను పరిష్కరించి యాజమాన్య హక్కులు కల్పిస్తుంది. పోడు భూముల విషయంలో నెలకొన్న వివాదాల పరిష్కారం. వారికి ఇతర రైతులకు అందిస్తున్న ప్రయోజనాలు వర్తింపు. 
బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ స్థాపించడానికి చర్యలు.. 
- సింగరేణి భూముల్లో ఇళ్లు కట్టుకున్న వారికి పట్టాలు.. 
- హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. వీటిని మరింత ముమ్మరం చేస్తాం.  

మరిన్ని వార్తలు