టీఆర్‌ఎస్‌ది రైతు ప్రభుత్వం  

7 Jul, 2018 09:02 IST|Sakshi
మున్నూరుసోమారం గ్రామంలో విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ను ప్రారంభిస్తున్న మంత్రి మహేందర్‌రెడ్డి 

మిషన్‌ కాకతీయతో చెరువుల పునరుద్ధరణ

24 గంటల ఉచిత కరెంటు కేసీఆర్‌ ఘనతే

రూ.60 కోట్లతో జిల్లాలో విద్యుత్‌ సబ్‌ స్టేషన్ల నిర్మాణం

రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి

వికారాబాద్‌ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శ్రీకారం

ధారూరు: టీఆర్‌ఎస్‌ది రైతు ప్రభుత్వమని రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. ధారూరు మండలంలోని మున్నూరుసోమారంలో రూ.2.95 కోట్లతో నిర్మించిన 33/11కేవీ విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ను ఎమ్మెల్యే సంజీవరావుతో కలిసి శుక్రవారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. రైతు సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ అనేక పథకాలు ప్రవేశపెట్టారన్నారు.

మిషన్‌ కాకతీయ, నిరంతర ఉచిత కరెంటు, రైతుబంధు, రైతుబీమా, రికార్డుల ప్రక్షాళన తదితర కార్యక్రమాలతో చరిత్రలో నిలిచిపోయే పనులు చేశారని కొనియాడారు. మిషన్‌ కాకతీయ పథకం కింద రాష్ట్రంలోని అన్ని చెరువులు, కుంటలను పునరుద్ధరిస్తున్నామని, జిల్లాలోని 1,350 చెరువులు, కుంటల అభివృద్ధికి రూ.500 కోట్లు మంజూరైనట్లు తెలిపారు.

ప్రాజెక్టుల ద్వారా గొలుసుకట్టు చెరువులు, కుంటల్లో నీళ్లు నింపేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని తెలిపారు. వ్యవసాయానికి అందిస్తున్న నిరంతర విద్యుత్‌ సరఫరాలో అంతరాయం లేకుండా చూసేందుకు సబ్‌ స్టేషన్లు నిర్మిస్తున్నామని చెప్పారు. ఇందుకోసం రూ.60 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. మోమిన్‌కలాన్, మున్నూరుసోమారం, ఎన్కతల, గెరిగిట్‌పల్లి గ్రామాల్లో కొత్త సబ్‌ స్టేషన్లు నిర్మించినట్లు వివరించారు.

మున్నూరుసోమారంలో చెరువు మరమ్మతులు, వంతెన నిర్మాణం, సీసీ రోడ్ల కోసం అవసరమైన ప్రతిపాదనలు అందించాలని పీఆర్‌ డీఈని ఆదేశించారు. ఎమ్మెల్యే సంజీవరావు, ధారూరు పీఏసీఎస్‌ చైర్మన్‌ జె.హన్మంత్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వేణుగోపాల్‌రెడ్డి, కె.అంజయ్య, మండల రైతు సమన్వయ సమితి కన్వీనర్‌ రాంరెడ్డి, జిల్లా సభ్యుడు రాజేందర్‌రెడ్డి, గ్రామ సర్పంచు బిచ్చన్న, ఎంపీటీసీ దస్తప్ప, విద్యుత్‌ ఎస్‌ఈ జానకీరాం, ఏఈ శ్రీనివాస్‌రెడ్డి, గ్రంథాలయ జిల్లా చైర్మన్‌ కొండల్‌రెడ్డి, వికారాబాద్‌ ఏఎంసీ చైర్మన్‌ రాంచంద్రారెడ్డి, నాయకులు వడ్లనందు, రాములు, రాంచంద్రయ్య, నర్సింహారెడ్డి, అవుసుపల్లి అంజయ్య, లక్ష్మయ్య, చిన్నయ్యగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు